
తెలుగు ప్రజలకు అతి ప్రధానమైన పండుగ సంక్రాంతి. ఇందులో తొలి రోజు జరుపుకునే పండుగ భోగి. ఈ సంక్రాంతి పండుగను గురువారం తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని తెలుగు ప్రజలంతా బుధవారం వేకువజామునే భోగి మంటలు వేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభ సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల వద్ద పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. భోగి మంటల వద్ద చిన్నారుల కోలాటాలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది.
సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజున భోగి’ , రెండోరోజు ‘మకర సంక్రాంతి’, మూడోరోజు ‘కనుమ పండుగ.’! మకర సంక్రాంతినే’ తిల సంక్రమణం’ , ‘ పంటల పండుగ’ ‘ఆమని పండుగ’, అల్లుళ్ళ పండుగ’, జానపదుల పండుగ’ వంటి పేర్లతోనూ పిలుస్తారు. సస్య లక్ష్మిని వెంటబెట్టుకు వచ్చే పండుగ ఇది. సర్వ సాధారణంగా సంక్రాంతి జనవరి 13, 14, 15 తేదీల్లో వస్తుంటుంది. కానీ ఈ ఏడాది ఈనెల 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు వచ్చాయి.
‘సంక్రాంతి’ అంటేనే ఒక కొత్తదనానికి స్వాగతం పలికే శుభతరుణం గా పేర్కొనవచ్చు. ఏడాదికొకసారి వచ్చే మకర సంక్రాంతి తెలుగు వారి విశిష్ట పండుగ. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగకూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్ల సంవత్సర ప్రారంభంలోనే వచ్చే మొట్ట మొదటి తెలుగు పండుగ ఈ సంక్రాంతి. మరణానికి సైతం పనికిరాని చేదు కాలంగా భావించే దక్షిణా యుగానికి స్వస్తి పలికి పుణ్య కాలమైన ఉత్తరాయణానికి ‘ మకర సంక్రాంతి’ పండుగే స్వాగతం పలుకుతుంది. ఆ రోజునుంచే మంచి రోజులకు శ్రీకారం. సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించే సంక్రమణాలను బట్టి ఒక్కో నెల ఏర్పడుతుంది. ఇలా సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశించే ప్రతి సమయాన్ని సంక్రాంతి అనవచ్చు. కాకపోతే వాటిని ‘మాస సంక్రాంతు’లంటారు. ధనుస్సు రాశి తర్వాత వచ్చే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్టుగా చెబుతారు.
మిగిలిన అన్ని పర్వదినాల మాటెలా వున్నా ఈ సంక్రాంతి తెలుగు ఆడపడుచుల పండుగలా అభివర్ణించవచ్చు. ధనుర్మాస ప్రారంభం నుండే తెలుగు వాకిళ్లు పండుగ సంబరాల్ని సంతరించుకుంటాయి. పసుపు, కుంకుమలు, మామిడాకులు, పూలదండలతో ఇంటి గుమ్మాలని శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతివారి వాకిళ్ళ ముంగిట ”ముత్యాల ముగ్గులు” ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు …బంతిపూల అలంకరణలు గంగిరెద్దుల ఆటపాటలు…హరిదాసు కీర్తనలతో సంక్రాంతి లక్ష్మి’ కి స్వాగతం పలుకుతారు.
సంక్రాంతి అంటే పిండి వంటల పండుగ. అందులో అరిసెలు సంక్రాంతి స్పెషల్. ఏపీలో చేసే అరిసెలకు ఈ సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక చక్రాలు, పొంగలి నువ్వు, వేరుశనగ ఉండలతో పాటు రకరకాల స్వీట్లు తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సంక్రాంతికి మాత్రం ఏపీలోని తమ సొంత ఊర్లు చేరుకోవటం పరిపాటి. రాయలసీమలో ఎద్దుల పందాలు, పొట్టేళ్ల పందాలు జోరుగా సాగుతాయి. భోగి మంటతో మొదలై…కనుమతో ముగిసే సంక్రాంతికి మరో విశేషం కూడా ఉంది. అదే సంక్రాంతి ధన, ధాన్యాలతో తాము సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. కనుమ రోజు పశువులకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం అందిస్తారు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాల సంబరాలు మొదలవుతాయి. పండుగకు ముందు, తర్వాత కొన్నాళ్ల పాటు ఆకాశంలో పగటి నక్షత్రాల్లా పతంగులు విహరిస్తుంటాయి. పతంగులు గాలిలో ఎగరవేసే ఆచారం చాలా కాలంగా వస్తోంది. ఒకప్పుడు ఇది గ్రామీణ క్రీడగానే ఉండేది. కానీ ఇప్పుడు నగరాల్లోనూ, పట్టణాల్లోనూ గాలిపటాల విన్యాసాలు అధికమయ్యాయి. గాలిపటాలు ఎగుర వెయ్యటానికి ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపిస్తున్నారు.
