ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో సాహిత్యానికి రెండు కళ్ళులా గత పదునాలుగేళ్ళుగా అహర్నిశలూ పని చేస్తున్న అనుబంధ సంస్థలు తెలుగుమల్లి మరియు భువనవిజయం.
సాహితీ ప్రచురణలు:
“కవితాస్త్రాలయ” శీర్షికన ఈ రెండు దేశాల తెలుగు భాషాభిమానులు మరియు సాహితీపరులు వ్రాసిన కవితలు, కథలు, కథనాలు, వ్యాసాలు కూడిన మూడు సంకలనాలు – మొదటిది 2010లో ప్రముఖ నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు, రెండవది 2014 లో ప్రముఖ నటులు, రచయిత, సాహితీవేత్త, దర్శకులు మరియు తత్వవేత్త శ్రీ తనికెళ్ల భరణి గారు, మూడవది 2018 లో ఆస్ట్రేలియాలో మొదటి ప్రపంచ తెలుగు సాహితీ నిర్వహణ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ పూర్వ అధ్యక్షులు పద్మభూషణ్ శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఆవిష్కరించారు – ప్రచురించి తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేసాయి. ఈ పరంపరలో ఆస్ట్రేలియాలో మొదటగా స్థిరపడి తెలుగువారికి ఆద్యులైన శ్రీ దూర్వాసుల మూర్తి గారి “ప్రభాత వీచికలు” పుస్తకం కూడా ఆవిష్కరించడమైనది. తోటి భాషాప్రియులకు ప్రోత్సాహాన్నందించే దిశగా ఎంతోమంది భాషాభిమానులకు తమ స్వీయ రచనలు ప్రచురించడానికి చేయూతనిచ్చాయి.
తూర్పు తీరంలో తెలుగు రేఖలు
ఒక సమున్నతమైన జాతి తన మూలాలను సమగ్రంగా భావి తరాలకు అందివ్వాలంటే దానికి అక్షర రూపమివ్వడం ఎంతైనా సమంజసం. అందునా మాతృభాషలో రూపు దిద్దడం ఎంతో ముదావహం. ఇటువంటి గ్రంథం తెలుగు వారి సత్సంప్రదాయాలకు విలువనిచ్చి ఒక పాశ్చాత్య దేశంలో “షష్ఠి పూర్తి” పూర్తి చేసుకున్న సందర్భంగా ముద్రణకు నోచుకోవడం ఎంతో శ్లాఘనీయం.
ఆస్ట్రేలియాలో తెలుగువారు వచ్చి అరవై ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుమల్లి సంపాదకులు మరియు భువనవిజయ సమన్వయకర్త శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు వ్రాసిన “తూర్పు తీరంలో తెలుగు రేఖలు” గ్రంథం ఆస్ట్రేలియాలోని వివిధ రాజధాని నగరాలలో ఆవిష్కరించబడింది.
భారతదేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారు న్యూ ఢిల్లీలో ప్రత్యేకంగా ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈ గ్రంథాన్ని పరిశోధనకు తీసుకొని పుస్తకావిష్కరణ చేసి రెండు రోజుల సాహితీ సదస్సును కూడా నిర్వహించారు.
పుస్తకం కావలసిన వారు contact@telugumalli.com ఈమెయులుకు సంప్రదించవచ్చు.
ప్రపంచ సాహితీ సదస్సులు:
ఈ రెండు సంస్థలు కలిసి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో 2018 లో తొలిసారిగా ప్రపంచ సాహితీ సదస్సు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. దీని పర్యవసానంగా 2019, 2021 లో న్యూజిలాండ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల మొదటి మరియు రెండవ సాహితీ సమావేశాలు నిర్వహించబడ్డాయి.
నాటక రంగం:
తెలుగు భాషకు ఆయువు పట్టువులైన పౌరాణిక నాటకాలు ఆస్ట్రేలేషియా ప్రాంతంలో మొదటిసారిగా రంగస్థల ప్రదర్శనలు నిర్వహించిన ఘనత ఈ రెండు సంస్థలకు చెందుతుంది. నాడు-నేడు (తెలుగు భాష వెయ్యేళ్ళ చరిత్ర), శ్రీకృష్ణ రాయబారము, శ్రీ పార్వతీ కళ్యాణం (దక్షయజ్ఞంతో సహా), శ్రీ మహాకవి కాళిదాసు పద్య నాటకాలు రంగస్థలంపై ప్రదర్శించి ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల తెలుగువారి మన్నలనందుకున్నారు.
కాళిదాసు జీవిత కథాగమనంలో ఎటువంటి వివాదాస్పదమైన అంశాలు లేకుండా, సాహిత్య విలువలను ఇనుమడింపజేసే విధంగా, సంస్కృతాంధ్రములలో రసవత్తరమైన, జనరంజకమైన ఘట్టాలతో ప్రేక్షకుల నాడికి అనుగుణంగా భారతీ విలాసం అనే పేరున ఈ నాటకాన్ని రచించారు సిడ్నీ (ఆస్ట్రేలియా) వాస్తవ్యులు శ్రీ తూములూరి శాస్త్రి గారు. ఈ పుస్తకాన్ని, నాటక ప్రదర్శనను ఆస్ట్రేలియాలోని పాఠకులు, ప్రేక్షకులు అత్యంతాదరాభిమానాలు చూపించి బ్రహ్మ రథం పట్టారు.
ఈ నాటక ప్రతిని తెలంగాణా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీ అయాచితం శ్రీధర్ గారికి చూపించిన వెంటనే తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు శ్రీ కె.వి.రమణాచారి గారితో పుస్తకావిష్కరణ చేసి అన్ని గ్రంథాలయాలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. భువనవిజయ చరిత్రలో ఇదొక మహత్తర ఘట్టం.
పద్య రచన:
‘పద్య వికాసం’ పేరుతో ఒక సమూహాన్ని ఏర్పరచి గత నాలుగేళ్ళుగా ఔత్సాహవంతులైన పద్య రచయితలను ప్రోత్సహించి ‘వీర సైనిక శతకము’, ‘అదివో అల్లదివో’ (అలిపిరి మెట్ల దారిని వివరిస్తూ పద్య లఘు కావ్యం), సిరిదివ్వెలు మొదలగు పద్య కావ్యాలు ప్రచురించడం జరిగింది.
సామాజిక భాషగా తెలుగు
ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (FTAA) వారితో కలిసి ఆరేళ్ళు నిర్విరామంగా పనిచేసి తెలుగు భాష సామాజిక భాషగా గుర్తింపచేయడానికి సఫలీకృతులవ్వడంలో తెలుగుమల్లి మరియు భువన విజయం ఎంతో కృషి చేసాయి.