మీడియా మొఘల్‌గా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
1936 నవంబర్ 16న అప్పటి కృష్ణాజిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే ఆయన తెలుగు సినీ, మీడియా, వ్యాపార రంగాల్లో తనదైన ముద్రవేశారు. ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ గ్యారెంటీ అన్న పేరును రామోజీరావు తెచ్చుకున్నారు. ఓ చిరుద్యోగిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు.
తన సన్నిహితుడి ద్వారా ఢిల్లీలో ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగంలో చేరిన రామోజీరావు మూడేళ్ల పాటు అనుభవం సంపాదించారు. 1962లో హైదరాబాద్‌కు వచ్చి ‘మార్గదర్శి’ చిట్‌ఫండ్ కంపెనీని స్థాపించారు. అనతికాలంలోనే ప్రజలకు నమ్మకమైన సంస్థగా దానిని తీర్చిదిద్దిన రామోజీరావు తెలుగునాట అన్ని ప్రధాన పట్టణాలు , నగరాలలో బ్రాంచ్‌లు తెరిచారు. ప్రస్తుతం మార్గదర్శి విలువ రూ. వేల కోట్లలో ఉంది. అనంతరం తనకు ఎంతో ఇష్టమైన అడ్వర్టైజింగ్ రంగంలో అడుగుపెట్టాలని భావించిన రామోజీరావు.. 1965లో కిరణ్ యాడ్స్ కంపెనీని స్థాపించారు. దీనితో పాటు 1967-1969 కాలంలో ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారంలోనూ దిగారు.
రామోజీరావు ఈనాడు సంస్థను ప్రారంభించడానికి ముందే ఒక మాసపత్రికను స్థాపించారు అదే ‘అన్నదాత’. వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, సంస్కరణలు, నూతన సాగు పద్ధతులు ఇలా అన్ని రకాల సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం 1970లో ఇమేజెస్ ఔట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. 1974 ఆగస్ట్ 10 విశాఖలో ‘ఈనాడు’ ఆవిర్భవించి తెలుగునాట జర్నలిజం, పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించి, సమాచారాన్ని అందించింది.
5000 ప్రతులతో ప్రారంభమైన ఈనాడు.. తెల్లవారేసరికి ఇంటి గుమ్మం వద్దకు చేరుకునే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పత్రిక చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యేదని చెప్పుకునేవారు. స్థానిక వార్తలకు జిల్లా ఎడిషన్ తీసుకురావడం ఈనాడుతోనే ప్రారంభం. ఆ తర్వాతి కాలంలో తెలుగునాట ఎన్నో పత్రికలు, దినపత్రికలు, మాసపత్రికలు వచ్చినా వాటన్నింటిని తట్టుకుని ఈనాడు నిలబడింది. నేటి స్మార్ట్ యుగంలోనూ ఈనాడుకు దాదాపు 18 లక్షల సర్క్యూలేషన్ ఉందంటే తెలుగు ప్రజలపై అది ఎంత ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు.
పత్రికా రంగంలో సక్సెస్ అయిన రామోజీరావు.. 90వ దశకంలో భారతదేశంలో మొదలైన టెలివిజన్ రంగంలోనూ అడుగుపెట్టాలని భావించారు. దీనిలో భాగంగా 1995లో ఈటీవీని స్థాపించారు. ఇక్కడ విజయవంతం కావడంతో దేశంలోని మిగిలిన భాషల్లోనూ ఛానెల్స్ ప్రారంభించి అప్పట్లో అతిపెద్ద టెలివిజన్ నెట్‌వర్క్‌గా ఈటీవీని నిలబెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం అక్కడికే వెళ్లాల్సి వచ్చేది. దీనిని గమనించిన రామోజీ.. 1996లో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి అనుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. స్క్రిప్ట్‌తో వస్తే.. సినిమాతో వెళ్లొచ్చు అనేంతగా అన్ని వసతులను కల్పించారు. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌గా గిన్నెస్ బుక్‌లో స్థానం సంపాదించారు రామోజీరావు. ఇవే కాదు.. ప్రియా ఫుడ్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, ఉషాకిరణ్ మూవీస్, కళాంజలి షోరూమ్‌లు, డాల్ఫిన్ హోటల్స్ వంటివి కూడా రామోజీ గ్రూపులో ఉన్నాయి.
జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన రామోజీరావును ఎన్నో పురస్కారాలు వరించాయి. అనేక వర్సిటీలు గౌరవ డాక్టరేట్లను ప్రకటించగా.. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది.నిర్మాతగా టాలీవుడ్‌లో ఎన్నో మరపురాని సినిమాలను నిర్మించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. సమాజాన్ని మేలుకొలిపేలా ఆయన సినిమాలు ఉంటాయనే గుర్తింపును పొందారు. మయూరి, ప్రతిఘటన, మౌనపోరాటం వంటి ఎన్నో సందేశాత్మక సినిమాలు వెలవడ్డాయి ఆయన బ్యానర్ నుంచి.
రామోజీ రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాలు విషాదంలో మునిగిపోయాయి.
ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ తెలుగువారి తరఫున తెలుగుమల్లి వారి ఆత్మకు శాంతిని చేకూరాలని ప్రార్థిస్తుంది.