
2011 నుండి 2021 వరకు జరిగిన అధికార గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య 7,400 నుండి 59,406 పెరిగింది. FTAA (Federation of Telugu Associations in Australia) గత రెండు గణాంకాల (2016 మరియు 2021) సమయంలో మన తెలుగు వారందరినీ సమాయత్తపరచి విజయ పథం వైపు నడిపించి ఇప్పుడు సుమారు అధికారికంగా 60,000 నమోదు చేయడానికి ఎంతో కృషి చేసిందనే చెప్పాలి. పదేళ్లలో ఈ సంఖ్య 8 రెట్లు పెరిగింది .
అధికారికంగా 60 వేలు ఉన్నప్పటికీ అనధికారికంగా లక్షకు పైగా తెలుగువారున్నట్లు అంచనా.
రెండేళ్ల క్రితమే ఆస్ట్రేలియా తెలుగు సమాజం 60 ఏళ్ల సుదీర్ఘమైన చరిత్రను అంబరమంత ఎత్తున సంబరాలుగా జరుపుకొని ఇతర సమాజాలకు ఆదర్శంగా నిలచింది. ఇప్పటి వరకూ స్థానిక సంస్థలతో మమేకమై తన ఉనికిని కాపాడుకుంటూ ఎదిగిన తెలుగు సమాజం ఇక్కడి నుండి దిశను మార్చి ఆస్ట్రేలియా దేశ భవిష్యత్తును తీర్చి దిద్దే నిర్ణయాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు . అయితే దీనికి ముఖ్యంగా జనాభా లెక్కలలో మన సంఖ్య గణనీయంగా పెరగాలి. ఆ తరుణం ఇప్పుడు మరోసారి ఆసన్నమైంది.
అందుకే ఈసారి “లక్షే లక్ష్యం” గా అందరమూ కలిసికట్టుగా పనిచేస్తే లక్ష్య సాధన సులువుగా చేరుకోవచ్చని ఆశాభావం. ఇది అంత కష్టతరం కాదు. ఎందుకంటే ఈ క్రింది పట్టికలోని వివరాల ప్రకారం విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్ ల్యాండ్ మరియు వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్రాలలో ఇప్పుడున్న సంఖ్య కంటే ఎక్కువగా నమోదు కావలసి ఉంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఈ నాలుగు రాష్ట్రాలలో మన తెలుగువారందరికీ చేరువై తెలియజేయగలిగితే లక్ష్య సాధన సుళువౌతుంది.
గత 10 సంవత్సరాలలో జరిగిన సార్వత్రిక గణాంకాలలో తెలుగువారి వివరాలు
| 2011 | 7,400 (సుమారు) |
| 2016 | 34,435 |
| 2021 (రాష్ట్రాల వారీగా) | 59,406 |
| విక్టోరియా | 24,677 |
| న్యూ సౌత్ వేల్స్ | 20,154 |
| క్వీన్స్ ల్యాండ్ | 5, 639 |
| వెస్ట్రన్ ఆస్ట్రేలియా | 3,089 |
| ఆస్ట్రేలియన్ కాపిటల్ టెరిటరీ | 2,752 |
| సౌత్ ఆస్ట్రేలియా | 2,385 |
| నార్తర్న్ టెరిటరీ | 362 |
| తాస్మానియా | 335 |
| మొత్తం | 59,406 |
NAATI గుర్తింపు
తెలుగు మాతృ భాషగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరగడం వలన ముఖ్యంగా NAATI (National Accreditation Authority for Translators and Interpreters) తెలుగు భాషను సామాజిక భాషగా గుర్తించింది. ఇందుమూలంగా ఆస్ట్రేలియా పెర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు NAATI నిర్వహించే CCL (Credentialed Community Language) పరీక్షలో ఉత్తీర్ణత పొందితే ఉచితంగా 5 పాయింట్లు లభిస్తాయి. గత ఆరు నెలలుగా నిర్వహించిన CCL పరీక్షలకు అభ్యర్ధులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పటి వరకూ మన తెలుగు విద్యార్ధులు “తెలుగు” CCL పట్టికలో లేకపోవడం వలన హిందీ మరియు ఇతర భాషల్లో పరీక్షలు వ్రాసేవారు. ఇప్పుడు ఆ కొరత తీరింది. సుమారు 10,000 మంది ఇప్పటి వరకూ CCL పరీక్ష వ్రాసి లబ్ది పొందారు.
అనువాదకారులు మరియు బాష్యకారులు (Translators and Interpreters)
ఇప్పుడు అనువాదకారులు మరియు బాష్యకారులు (Translators and Interpreters) కోసం ఎక్కువ గిరాకీ కూడా పెరిగింది. ఇలా భాషాపరంగా ఎన్నో లాభాలు కలిగాయి. మన తెలుగు భాష ఆస్ట్రేలియా బడులలో ఇతర సామాజిక భాషలలాగానే బోధిస్తే మన పిల్లలు అక్కడే తెలుగు నేర్చుకోవచ్చన్న ఆలోచనతో ముందు అడుగులు వేయడం కూడా జరుగుతుంది.
NAATI వారు భాష్యకారుల గురించి ప్రత్యేకంగా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. క్వీన్స్ ల్యాండ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియా వంటి రాష్ట్రాలలో ఈ పరీక్షలకు హాజరై మన తెలుగు వారి అవసరాలకు ఉపయోగపడే నైపుణ్యాన్ని పొందగలిగితే ఎంతో బాగుంటుంది.
ప్రపంచంలో మొదటి దేశం ఆస్ట్రేలియా
ప్రపంచ దేశాలలో ఈ విధమైన గుర్తింపు ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు. ఆస్ట్రేలియానే ఈ విధమైన తెలుగు భాషకు గుర్తింపు ఇవ్వడం ద్వారా తన బహుళ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటుకుంది.
మరో అవకాశం
ఇప్పుడు మళ్ళీ మరో సువర్ణావకాశం మన ముంగిట తొంగి చూస్తోంది. వచ్చే సంవత్సరం ఆగష్టు 11, 2026 మంగళవారం నాడు మళ్ళీ ఆస్ట్రేలియా సార్వత్రిక గణాంకాలు జరగనున్నాయి. తెలుగు భాష మాట్లాడేవారు సుమారు 1,00,000 మందికి పైగా ఉంటారని అనధికార అంచనా. అయితే ఈ విషయం ఋజువు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని అందరమూ సద్వినియోగం చేసుకుందాము. అందరూ తెలిసిన వారందరినీ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా “తెలుగు” మాతృభాషగా 2026 గణాంకాల పత్రంలో పెట్టాలని తెలియజేయగలరు.
