సేవానిరతికి ప్రతిబింబం

శివ విష్ణు దేవాలయం మొదటి మహిళా అధ్యక్షులు – శ్రీమతి ఉష గుల్లపల్లి

సేవ చేయడానికి అవకాశం కోసం ఎదురు చూసే మనస్తత్వం. మానవ సేవయే మాధవ సేవని నమ్మే వ్యక్తిత్వం. మమతల వెల్లువలో మానవతను పంచి మన్ననలందే మానవత్వం. భగవంతుని నుండి సేవే వరంగా పొందానన్న భావనతో భావితరాలకు స్పూర్తిదాయకం. తరతమ, వర్గ బేధాలు లేకుండా సమాజ సేవకే అంకితం.

బాల్యంలో…
హైదరాబాదులో పుట్టి పెరిగి చిన్నప్పటినుండే తల్లిదండ్రులు – శ్రీమతి పొట్లూరి విజయలక్ష్మి మరియు శ్రీనివాసరావు దంపతులు – నేర్పిన విద్యాబుద్ధులు పుణికి పుచ్చుకొని సేవా భావం అలవరచుకున్న శ్రీమతి ఉషా గుల్లపల్లి గారి కథనం. ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడే తన పాకెట్ మనీ తోటి పేద విద్యార్థులకు ఇచ్చి ఆదుకున్న వైనం. సమయం, సందర్భం లేకుండా సహాయం కావాలని ఒక పొలికేక వినిపిస్తే నేనున్నానని భరోసా ఇచ్చే ఆపన్న హస్తం.

విదేశాలలో…
శ్రీమతి ఉషా గారు యుక్త వయస్సులోనే ప్రముఖ ఔషధాల సంస్థ ప్రోక్టర్ & గేంబుల్ లో వచ్చిన ఉద్యోగాన్ని అందిపుచ్చుకొని విదేశాలలో పని చేస్తూ రసాయన శాస్త్రంలో కొన్ని పత్రాలు కూడా ప్రచురించారు. ఆఫ్రికా ఖండంలోని కీన్య, ఉగాండా దేశాలలో ఔషధాల కర్మాగారం నిర్మించడంలో కీలక పాత్ర వహించారు.

ఆస్ట్రేలియా ఆగమనం…
1997లో ఆస్ట్రేలియాలో స్థిరపడడానికి వచ్చి సి.ఎస్.ఎల్, సిగ్మా, బి.ఎం.ఎస్ మరియ ఫైజెర్ సంస్థల్లో వివిధ హోదాలలో పని చేసారు. ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుండి మొనాష్ కమ్యునిటీ వాలంటీర్ సెంటర్ లో తన స్వచ్చంద సేవ కొనసాగిస్తూ తాయి, FIAV, HSV సంస్థలలో వివిధ హోదాలలో గౌరవ పదవులను నిర్వహిస్తున్నారు.

తన సేవానిరతికి చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. వారు ఎప్పుడూ తన పనులను స్వతహాగా, స్వతంత్రంగా చేయాలని ప్రోత్సహిస్తూ, భవిష్యత్తులో ఏ విపత్తునైనా ఎదుర్కొనే మనోధైర్యాన్ని, మానసిక వికాసాన్ని కల్పించారని శ్రీమతి ఉషా గారు చెప్పారు.

హిందూ సొసైటీ అఫ్ విక్టోరియా…
శివ విష్ణుదేవాలయంతో తన అనుబంధం ఎన్నెన్నో జన్మల బంధమనీ, అవకాశం ఉంటే ఎప్పటికీ కొనసాగిస్తానని శ్రీమతి ఉషా గారు ఆకాంక్షించారు. 2013లో దేవాలయ ప్రాంగణంలో నిర్మితమైన సాంస్కృతిక కేంద్ర నిర్మాణంతో అక్కడి కాంటీన్ కి కావలసిన పద్ధతులు, నియమనిబంధనలు వ్రాయడంలో ప్రముఖ పాత్ర వహించారు. 2017-18 లో కార్యవర్గ సభ్యులుగా తన ప్రస్థానాన్ని మొదలిడి 2024-26 సంవత్సరానికి గాను మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. హిందూ సొసైటీ అఫ్ విక్టోరియా నాలుగుపదుల ప్రస్థానంలో ఇదొక మైలు రాయనే చెప్పాలి. వారు అధ్యక్ష పదవి చేపట్టినప్పటినుండి ఫ్రాంక్ స్టన్ సిటీ కౌన్సిల్ తో ఈక్రింది అనుమతులు మంజూరు చేయించారు:
1. క్రొత్త మరుగుదొడ్లు
2. ఆత్మ లింగం నిర్మాణం
3. చెప్పులు భద్రతా అల్మైరా
4. తోరణ వాసం
5. ఫస్ట్ ఎయిడ్ రూమ్

ఇంకా అనుమతులు రావలసినవి:
1. సెన్సార్ టేప్స్
2. అన్నదానం హాల్
3. టెంపుల్ గేట్స్ (ఎలక్ట్రానిక్)
4. స్మార్ట్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ & కెమేరాస్ (iCloud)
5. ఫెన్సింగ్
6. పార్కింగ్
7. క్రొత్త కాంటీన్ సాఫ్ట్వేర్
8. పిల్లల పార్క్

ఇవే కాకుండా పర్యావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రసాదం ఇచ్చే ప్లాస్టిక్ పళ్ళేలను ఆకులతో మార్చడం కూడా జరిగింది.

ప్రస్తుతం బేస్ వాటర్ లోని శ్రీ విఘ్నేశ్వరాలయంలో, హిందీ నికేతన్ వారికి మరియు సత్యసాయి సంస్థకు కూడా తన స్వచ్చంద సేవలందిస్తున్నారు. చాలామంది పేదవారికి భోజనాలు స్వయంగా వండి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా హిందూ సొసైటీ అఫ్ విక్టోరియా వారి అధ్వర్యంలో ‘హోతా’ సంస్థతో కలిసి ఒక సభను నిర్వహించనున్నారు.

మీల్స్ సర్వీస్
ఫ్రాంక్ స్టన్ సిటీ కౌన్సిల్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం త్వరలో వారానికి ఒకరోజు పరిమితమైన భోజనాలు పంపదలచినట్లు శ్రీమతి ఉషాగారు చెప్పారు. ఇది ముఖ్యంగా ఇల్లు లేనివాళ్ళకు మరియు పేదవారికి ఎక్కువుగా ఉపయోగపడుతుందని చెప్పారు.

నూతన సంవత్సర వేడుకలు
జనవరి 1, 2026 వ తేదీన సుమారు 20,000 మంది శివ విష్ణు దేవాలయానికి వచ్చి దేవుని దర్శించుకోవడం ఇప్పటివరకూ ఎన్నడూ జరగని ఒక రికార్డు. ఇది ప్రజల్లో దేవునియందుగల విశ్వాసానికి ప్రతీక మరియు దేవాలయ ప్రాంగణంలో అధిక మొత్తంలో జరుగుతున్న సదుపాయాలు కూడా ఇందుకు తోడ్పాటు కావచ్చు.

దేవాలయం తీసుకున్న అప్పులు
శ్రీమతి ఉషాగారు దేవాలయ పగ్గాలు చేపట్టిన 6 నెలల్లో ఇప్పటి వరకూ వివిధ ఆర్ధిక సంస్థల నుండి తీసుకున్న అప్పులు అన్నీ తీర్చడం జరిగిందని చెప్పారు. ఇకముందు అప్పులు లేకుండానే నిర్మాణ పనులు చేపట్టవచ్చని, భక్తుల సౌకర్యార్ధం వివిధ రకాల సదుపాయాలు చేపట్టడం జరుగుతుందని కూడా వారు చెప్పారు.

అవార్డులు…
చాలా సంస్థలు శ్రీమతి ఉషా చేస్తున్న స్వచ్చంద సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. అందులో ప్రముఖంగా ప్రస్తావించాల్సినవి:
1. వలంటీర్ అఫ్ ది ఇయర్ – 2001 – విక్టోరియా ప్రభుత్వము
2. విక్టోరియా ముల్టీ కల్చరల్ అవార్డు ఫర్ ఎక్స్లెన్స్ – 2012
3. తాయి అవార్డు – 2012
4. కమ్యునిటీ సర్వీస్ అవార్డు – 2022 – ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్

తన సహధర్మచారి శ్రీ రాంబాబు గుల్లపల్లి గారు తన సమాజ సేవలో కూడా అలుపెరుగకుండా అన్ని వేళలా ఒక స్నేహితునిగా చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేస్తూ ఉండడం వలన ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని శ్రీమతి ఉషా గారు చెప్పారు.

Scroll to Top