స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం


నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం
(ప్రగతిపధంలో స్వతంత్ర భారతం)

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అలుపెరగని మన స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలంగా 1947 ఆగష్టు 15న విదేశీపాలనా శృంఖలాల నుండి ముక్తినొందిన మాతృదేశానికి ప్రణమిస్తూ మనం సాధించిన ప్రగతిని సమీక్షించుకుందాం, సంబరాలు జరుపుకుందాం.

ప్రగతిపధంలో ఏడున్నర దశాబ్దాల మన ప్రయాణం భారతీయుల దృడసంకల్పానికి స్థితిస్థాపకతకు ప్రతీకగా నిలుస్తుంది. దూరదృష్టి గల నాయకుల మార్గనిర్దేశంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితొ వివిధ రంగాలలో అద్భుతమైన మైలురాళ్లను సాధించాం. ఎదురైన ప్రతి సవాళును అధిగమిస్తూ సామాజిక సంస్కరణల నుండి సాంకేతిక ఆర్థిక సంస్కరణల వరకు పురోగమనదిశలో స్వతంత్ర భారతం విజయపథం సాగించింది.

సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కులు రాజ్యాంగ సూత్రాలుగా పొందుపరుచుకున్నాం. మొదటి ఎన్నికలలోనే సార్వత్రిక ఓటునిచ్చిన అతితక్కువ దేశాలలో మన స్థానం ప్రశంసనీయం. అది సామాన్య మానవుని సాధికారతకు చిహ్నమై నిలిచింది. అట్టడుగు వర్గాలకూ మహిళలకూ విద్యా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం చారిత్రిక అంతరాలను పూడ్చడమేనని చెప్పాలి. అదే మనం నిర్దేశించుకొన్న సమ్మిళితతకు ప్రతిరూపం.

అమానుషమైన అంటరానితనాన్ని దాదాపుగా నిర్మూలించడం స్వతంత్ర భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం. దురాచారమైన సతీసహగమనాన్ని సమూలంగా నిర్మూలించాము, బాల్యవివాహాలను దాదాపుగా రూపుమాపాము. అక్షరాశ్యతను పెంపొందించాము, వితంతు వివాహాలను ప్రోత్సహించాము. మహిళా సాధికారత స్వతంత్ర భారతం సాధించిన ప్రగతికి సూచికగా భావించవచ్చును. సాంకేతిక రంగంలో కల్పనా చావ్లా, క్రీడా రంగంలో సానియా మీర్జా, కళా రంగంలో అమృతా షేర్గిల్, యామినీ కృష్ణమూర్తి, రాజకీయ రంగంలో ఇందిరా గాంధీ, ప్రతిభా పాటిల్, ద్రౌపది మూర్ము ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ మహిళలు.

అత్తెసురు ఆర్ధిక వనరులను సైతం లెక్కచేయకుండా స్వతంత్ర భారతదేశం మొదటినుండీ విద్యా ఆరోగ్య రంగాలపై దృష్టి సారించింది. జాతీయ ఆరోగ్య మిషన్ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, టీకాలను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నది. పోలియో వంటి వ్యాధులను నిర్మూలించడంలో భారతదేశం చేస్తున్న కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలనందుకున్నది. రెండు దశాబ్దాల క్రితం తెలుగునాట ఆవిర్భవించిన ఆరోగ్యశ్రీ పధకం నేడు ఆయష్మాన్ భారత్ పధకానికి ఆదర్శమై నిలిచింది. అది మనందరం గర్వించ దగిన విషయం.

ఎన్నో ప్రపంచ విశ్వవిద్యాలయాలలో పనిచేసిన అనుభవంతో చెబుతున్నమాట: మన విద్యారంగం స్వతంత్ర భారతానికి మకుటాయమానం. మనవారు లేకుంటే సంపన్నదేశాల విశ్వవిద్యాలయాలూ వ్యాపార సంస్థలూ స్తంభించిపోతాయి అంటే అది అతిశయోక్తి అవుతుంది కానీ వాస్తవదూరం మాత్రం కాదు. అమెరికాలో మనవారు లేని గొప్ప విశ్వవిద్యాలయాలూ లేవు, పెద్ద వ్యాపార సంస్థలూ లేవు. ఇంతెందుకు విదేశీ ఆగమనాలను నియంత్రిస్తానన్న ట్రంపుకి సైతం మనవారికిచ్చే వీసాలను పెంచక తప్పలేదు. మరోవిధంగా చెప్పాలంటే ఇది పాశ్చాత్య దేశాల ఆధునిక దోపిడి. IITలు NITలు సిల్వర్ జుబ్లీ ఇన్స్టిటూట్ లు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మన దూరదృష్టికి తార్కాణాలు. ఇంతగా అభివర్ణిస్తున్న మన విద్యారంగానికి చీకటికోణాలు లేకపోలేదు. మూడుసంవత్సరాల ముద్దుబాలలను మోయలేని సంచులతో ఇంటినుండి తరమడం అత్యంత శోచనీయం. అవసరంలేని విషయాలను బలవంతంగా కంఠస్థం చేయించడం అమానుషమంటే అతిశయోక్తి కాదు.

వ్యాసకర్త: ఎం.ఆర్.కె. కృష్ణారావు
గాయత్రీ విద్యా పరిషత్, వైజాగ్

Scroll to Top