అంగరంగ వైభోగం – ACTTA


“మనది” అనే భావం కలగాలంటే గుండె లోతుల్లో అణగారి వున్న భావాలకు ప్రేరణ కలగాలి. మనం చూసే దృశ్యం గత స్మృతులను స్పురణకు తేవాలి. మనలో అంతర్లీనమైయున్న ఆలోచనలకు ఒక రూపం చూడగలగాలి. చరిత్రాత్మకమైన ఘట్టాలతో ముడిపడి ఉండాలి. మన సాంప్రదాయ విలువలకు పట్టం కట్టాలి. మాతృభూమి మమకారం పొంగిపొరలాలి. భాషా సంస్కృతులు వెల్లివిరయాలి. రాగం, తానం, పల్లవి రసమయం కావాలి. అన్న, తమ్ముడు, అక్క, బావా, అత్త, మామ బంధాలు బలపడాలి. తదేక ధ్యానంతో సంయుక్తంగా పనిచేయాలి. తనివితీరా ఆనందించాలి.

సెప్టెంబరు 25 వ తేదీన ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా నగరాన, మొట్టమొదటిసారి Australia Parliment Grand hall లో ACT Telangana Association అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “బతుకమ్మ సంబరాలు” దీనికి చక్కని ఉదాహరణ.

శ్రీ రమేష్ కైలా గారి అధ్యక్షతన వారి కార్యవర్గం ఎంతో ఉత్సాహంగా పండుగ శోభతో నిర్వహించిన ఈ సంబరాల్లో రకరకాల బతుకమ్మలతో అంగరంగ వైభవంగా కొలువుదీరి ఆస్ట్రేలియా ప్రజల ప్రశంసలనందుకొని ఇక్కడ వసంతానికి స్వాగతం పలికిన బతుకమ్మ సంబురాలు ఎంతో ఘనంగా జరిగాయి. తమ ఊరికి, దేశానికి సుదూరంగా ప్రవాసాన కాన్బెర్రా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలంతా ప్రాంతాలకతీతంగా పాల్గొని విజయవంతం చేయడం ఆస్ట్రేలియా బహుళ సంస్కృతీ సాంప్రదాయానికి ప్రతీక.

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మరియు ఆర్ధిక మంత్రి శ్రీమతి కాటి కెలగర్ పాల్గొని మాట్లాడుతూ పండుగ జరిగిన విధానాన్ని కొనియాడి నిర్వాహకులను ప్రశంసలతో ముంచెత్తి తన సంతోషాన్ని మరియు సందేశాన్ని తెలియచేయటం తెలంగాణ ఔన్నత్యాన్ని గుర్తించడం ఆనందానికి గురిచేసింది.. పిల్లల సందడి మరియు మంచి తెలంగాణ రుచులతో విందు పసందుగా ముగిసింది.

తెలంగాణా సంచిక: తెలుగుపలుకుల తెలంగానము
ఈ సందర్భంగా 102 పేజీలతో కూడుకున్న ఒక సంచికను ఆవిష్కరించడం జరిగింది.
చారిత్రాత్మకంగా తెలంగాణా రాష్ట్రం ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. వివిధ మతాల ప్రజల జీవనశైలి తనలో ఇముడ్చుకొని ఒక సరిక్రొత్త జీవన సరళికి, ప్రత్యేకమైన మాండలీకానికి, సమూలమైన సంస్కృతికి దోహదపరచింది. అయితే వీటన్నిటినీ కలబోసి, తెలంగాణా రాష్ట్రంలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలు, వాటి వైభవాలు, భౌగోళిక సారూప్యం, దేవాలయాలు, సాహిత్యం, కళలు, కవులు, పండుగలు ఇంకా ఎన్నో విశేషాలతో కూడుకున్న ఈ సంచిక “తెలుగు పలుకుల తెలంగానం” ఒక అద్బుతమైన ప్రచురణని చెప్పాలి. ఈ పుస్తకం చదివిన వారు తెలంగాణా రాష్ట్రం గురించి సుమారు 80-90 శాతం తెలుసుకుంటారు. కొన్ని అంశాలను చదివినపుడు “ఓహో! తెలంగాణా ఇంత గొప్పదా?” అని ముక్కు మీద వ్రేలు వేసుకోకుండా ఉండలేరు.

తెలంగాణా రాష్ట్ర చరిత్ర విశేషాలతో పాటు గత ఏడేళ్ళుగా ACT తెలంగాణా సంఘం చేపట్టిన సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను వివరించే సజీవమైన చిత్రాలు ఇందులో పొందుపరచి చెప్పకుండానే ఇవన్నీ మన సంస్కృతిలో భాగమేయన్న పరమాద్భుతమైన సందేశం అందించారు కార్యవర్గం.

కృతజ్ఞతలు:
ACTTA అధ్యక్షులు శ్రీ రమేశ్ కైలా గారు తమ కార్యవర్గానికి, తెలంగాణా సంచిక రూపొందించిన ‘తెలుగుమల్లి’ సంపాదక వర్గానికి, స్వచ్చంద సేవకులకు, ఆర్ధిక సహాయం అందించిన వ్యాపార భాగస్వాములకు మరియు మునుపటి కార్యవర్గ అధ్యక్షులు మరియు కార్యవర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top