మహాకవి కాళిదాసు – అపురూప కావ్యశిల్పం
రెండేళ్ల క్రితం మొదలైన అలుపెరుగని సాహితీ ప్రయాణం. భారతీయ వాజ్మయంలో అజరామరమైన ఒక ఘట్టానికి దృశ్యరూపం. ప్రసిద్ధిగాంచిన ఒక మహాకవి జీవితంలోని ప్రముఖ ఘట్టాలను తీర్చిదిద్దడం. సరికొత్త సాంకేతిక వెలుగులతో, కమనీయ కధాకధనంతో, రమణీయ నృత్య విలాసాలతో కూడిన అద్భుత రంగస్థల నాటకం.
ఈ నాటకం వేయాలన్న తలంపు రావడమే తడవుగా మా భువన విజయ సభ్యులు శ్రీ రాంప్రకాష్ యెర్రమిల్లి గారు బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి “కాలిదాస చరిత్ర” ఆధారంగా ఒక చక్కని ప్రతిని వ్రాయడం జరిగింది. దానిని భువనవిజయ సభ్యులందరూ కలిసి కొంత చర్చా గోష్టి జరిపిన తరువాత కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా మహాకవి కాళిదాసు నాటకం ప్రతి దొరుకుతుందేమోనని ఆరు నెలలు తెలిసినవారందరినీ అడిగాము. ఎక్కడా దొరికే అవకాశం కనిపించలేదు. చివరికి ముఖచిత్రం (Facebook) లో ఖమ్మం వాసి శ్రీ వనం వెంకట వరప్రసాదరావు గారు తటస్థ పడడం, వారిని కాలిదాస నాటకం వేయాలని, ప్రతి వ్రాయగలరా అని అడగడం, వారు దానికి అంగీకరించి అచ్చ తెనుగులో మంచి నాటకం వ్రాసి పంపించారు. అయితే కాళిదాసు అంటేనే మొదట సంస్కృతం గుర్తుకు వస్తుంది కానుక సంస్కృతంలో ప్రతి ఉంటే ఇంకా బాగుంటుందని మళ్ళీ శోధన మొదలుపెట్టాము.
అయితే భువనవిజయం ఆనవాయితీ ప్రకారం ఆస్ట్రేలియా వాసులు ఎవరైనా వ్రాస్తే వారికి అవకాశం కల్పించి గౌరవించడం జరుగుతుంది, అంతే కాకుండా ఈ నాటకంలో సూత్రధారులు, పాత్రధారులు అందరూ ఆస్ట్రేలియాకే చెందినవారౌతారన్న ఒక స్వార్ధం కూడా జతకూడి సిడ్నీ వాస్తవ్యులు, సంస్కృతాంధ్ర పండితులు శ్రీ తూములూరి శాస్త్రి గారెని సంప్రదించడం జరిగింది. వారు మేము అప్పటికే వ్రాసిన ప్రతులు చదివి ఒక్కొక్క అంకంలో మార్పులు చేస్తూ శ్రీ కాళిదాసు జీవిత చరిత్రకన్నా వారి ప్రతిభను శ్లాఘిస్తూ సాహితీ పరమైన సంభాషణలు, సంస్కృత శ్లోకాలు మరియు వాటి అర్ధాలు వివరిస్తూ అద్భుతమైన నాటకం వ్రాసారు. అయితే వారు వ్రాసిన ప్రతి అంతా నాటకం వేయడానికి సుమారు 6 గంటలు పడుతుంది. అందుకని వారిని రెండున్నర గంటల నిడివి గల నాటకానికి కుదించడానికి ఒప్పించి జనరంజకమైన ఘట్టాలతో ఈ నాటకం ఏప్రిల్ 2వ తేదీ ఉగాది రోజున ప్రదర్శించడం జరుగుతుంది. పూర్తి ప్రతిని ఆ రోజు ఆవిష్కరించడం జరుగుతుంది.
ఈ నాటకానికి కావలసిన ఆహార్యాలు, హంగులు సమకూర్చి సాంకేతిక నైపుణ్యతను జోడించి ఈ ప్రదర్సన ఒక అనుభూతిగా మిగిలిపోవడానికి మా భువనవిజయ సభ్యులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. 25 మంది నటులు గత 5 నెలలుగా సాధన చేస్తూ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఎంతో కష్టపడి ప్రతీ పాత్రకు ప్రాణం పోస్తున్నారు.
అందరూ ఈ మహత్తర ఘట్టం రంగస్థలంపై తిలకించి అస్వాదించగలరని మనవి.