అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహిపాహి” యనఁ గుయ్యాలించి సంరంభియై.
ఎంత అద్భుతమైన పద్యం. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఇటువంటి పద్యం. స్వయంగా శ్రీరామ చంద్రుడే ఈ పద్యాన్ని వ్రాసాడని కధనం. ఈ పద్యాన్ని మూడు రకాలుగా విశ్లేషించవచ్చు.
1. భక్తి భావంతో
2. సాహిత్య పరంగా
3. ఆధునిక పరంగా (వ్యక్తిత్వ వికాసం)
ప్రస్తుత మన జీవితాలకు అన్వయించుకోవాలంటే మూడవది చాలా ముఖ్యమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది వ్యక్తిత్వ వికాసం (Personality Development) కోసం కొన్ని లక్షల డాలర్లు ఖర్చుబెట్టి శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. కానీ పైన వివరించిన పద్యం చదివితే, ఒక భక్తుడు ఎక్కడో పాతాళ లోకంలోనుండి భగవంతునిపై నమ్మకంతో “పాహి పాహి” యని ప్రార్థిస్తే వైకుంఠములో ఒక మూలనున్న మేడ, దానిదగ్గర ఒక సరస్సు… చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్న ఆపన్న ప్రసన్నుండు…భక్తుని కాపాడడానికి వేగిరపడ్డాడు. “నమ్మకం” అనేది ఎంత గొప్పదో ఇక్కడ పోతనామాత్యులు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి.
ఇలాంటి పద్యాలు విని, చదివి మన చిన్నతనంలో ఎంత భావోద్వేగానికి గురై వ్యక్తిత్వ వికాసాన్ని పొందమో ఆలోచించండి. ఇదే పని అనుభూతిని, అనుభవాలను మన పిల్లలు కూడా పొందాలని గత ఆదివారం iBAM (అంతర్జాతీయ భాగవత ఆణిముత్యాలు) వారు ఆస్ట్రేలియాలో తెలుగుమల్లి వారి సౌజన్యంతో భాగవత పద్య పఠన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఆస్ట్రేలియాలోని మూడు వయసుల విభాగాలలో (6-9, 10-13, 14-18) చెందిన 45 మంది పిల్లలు పాల్గొన్నారు. గత మూడు నెలలుగా ఎంతో శ్రమకోర్చి ఈ పద్యాలను నేర్చుకొని అద్భుతంగా పాడి వినిపించారు.
ఈ కార్యక్రమానికి మెల్బోర్న్ నుండి శ్రీమతి రమణి బొమ్మకంటి గారు మరియు సింగపూర్ నుండి శ్రీ రాధాకృష్ణ శర్మ గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అద్భుతమైన వారి పాండితీ ప్రకర్ష పిల్లలకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ముఖ్య అతిథిగా iBAM రూపశిల్పి శ్రీ మల్లిక్ పుచ్చా గారు వచ్చారు. శ్రీ చింతలపాటి మురళీ కృష్ణ గారు గత మూడు నెలలుగా చాలామంది పిల్లలకు శిక్షణనిచ్చి ఈ కార్యక్రమానికి కీలకోపాన్యాసంతో ప్రారంభించారు. ఆస్ట్రేలియా అవధాని శ్రీ కళ్యాణ్ తటవర్తి మరియు న్యూ జిలాండ్ ప్రతినిధి శ్రీ గోవర్ధన్ మల్లెల గారు కూడా పిల్లలనుద్దేశించి ప్రసంగించారు. శ్రీకృష్ణ రావిపాటి గారు సాంకేతిక సహాయం అందించారు. వీరందరికీ తెలుగుమల్లి కృతజ్ఞతాభినందనలు తెలుపుకుంటుంది.
ప్రతీ తల్లిదండ్రి తమపిల్లలు వారు చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు భాగవతం, వేమన, సుమతీ శతకం ఏవైనా వారు వల్లిస్తుంటే వినాలని తపన పడుతుంటారు. ఆ కల సాకారమై ఈరోజు ఆస్ట్రేలియా దేశమంతటా అందరూ ఈ ప్రక్రియ గురించి మాట్లాడుకోవడం ముదావహం. వచ్చే సంవత్సరం మళ్ళీ జరిగే జరిగే ఈ పోటీలకోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రతీ విభాగంలో ముగ్గురు పిల్లలు ఆస్ట్రేలియా నుండి ఎన్నికై అంతర్జాతీయ స్థాయిలో మరో 20 దేశాల నుండి పాల్గొననున్న పిల్లలతో పోటీ పడనున్నారు. సెప్టెంబర్ 18 వామన జయంతి నాదు ఇవి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మరిన్ని వివరాలు ముందు ముందు తెలియజేస్తాము.
ఈ వీడియోని ఈ క్రింది లింకులో చూడవచ్చు.