ఈ కాలపు వట్టికోట… అవిలేను


కొందరు సామాన్యంగా కనిపిస్తారు. వాళ్ల పనుల ద్వారా అసామాన్యులై నిలుస్తారు. వ్యక్తిగత జీవితం కంటే సమాజం కోసమే జీవితం అనే మనుషులు ఈ కాలంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన ఉపాధ్యాయుడు శీల అవిలేను. పుట్టింది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం అడ్డ గూడూరు మండలం చిర్రగూడూరు గ్రామం. ఉద్యోగ రీత్యా ప్రస్తుతం నివాసం ఉండేది సూర్యాపేట పట్టణం. అవిలేనుకు పుస్తకాలు అంటే ప్రాణం… చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం ఇష్టంగా పెంచుకున్న అవిలేను తాను పదవ తరగతి పూర్తిచేసుకుని తిరుమలగిరి ( ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని ఓ మండల కేంద్రం) లో ఇంటర్ చదవడానికి వచ్చినప్పుడు అక్కడి గ్రంథాలయం అతనికి పరిచయమైంది. గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం ద్వారా తన ప్రపంచం విశాలమైంది. అప్పటినుండే నుండే ఇలాంటి గ్రంథాలయం ఒకటి సొంతంగా తన జీవిత కాలంలో తప్పకుండా స్థాపించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. పుస్తకాలే లోకంగా తనకు నచ్చిన పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టాడు.
ప్రస్తుతం సుమారు లక్షన్నర పుస్తకాలతో గ్రంథాలయం నడుపుతున్న అవిలేను మూడు దశాబ్దాలుగా పుస్తకాలు సేకరించిన విధానం చూస్తే అబ్బురం అనిపిస్తుంది. తన దగ్గర వ్యక్తిగత ఖర్చులకోసం ఉన్న డబ్బులను కూడా పుస్తకాలు కొనడానికే వెచ్చిస్తాడు. ఇట్లా కొన్ని వేల పుస్తకాలు కొన్నాడు. ఇతని అభిరుచిని గమనించిన పుస్తక ప్రియులు రచయితలు ఈయన గ్రంథాలయం కోసం పంపే పుస్తకాలను స్వీకరిస్తాడు. ఇది అవిలేను పుస్తకాలు సేకరించడంలో రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి చూస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. సాధారణంగా మనం బజారులో వెళ్తున్నప్పుడు పాత ఇనుప సామాను షాపులు కనిపించినా వాటిపై మనకు అంత సూక్ష్మదృష్టి ఉండదు. కానీ అవిలేను పాత ఇనుప సామాను షాప్ లలో ఉండే పాత పుస్తకాలను పరిశీలనగా చూసినప్పుడు అనేక విలువైన ఒక తరానికి చెందిన గ్రంథాలు చెత్త పుస్తకాలుగా వెళ్ళిపోతుండడం గమనించాడు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించినప్పుడు ఒక సాహితీవేత్త లేదా మేధావి తన జీవితంలో తాను సంపాదించిన గ్రంథాలు తన అనంతరం తన వారసులకు ఆసక్తి లేకపోవడం వలన వాటిని చెత్త పుస్తకాల షాపులకు అమ్ముతున్నారు. ఇంత విలువైన సంపద ముందు తరాలకు అందకుండా అంతరించిపోతే ఎలా ? అని ఆలోచించాడు . ఎలాంటి బేషజం లేకుండా సూర్యాపేటలోని పాత పుస్తకాల షాపులలో ముందు తరాలకు కావలసిన అన్ని రకాల పుస్తకాలను వాళ్లకు ఇవ్వవలసిన ధర కంటే ఎక్కువగా వెచ్చించి కొనడం మొదలుపెట్టాడు. తాను ఉపాధ్యాయుడు. ఆడంబరంగా ఉండాలి వంటి ఆలోచనలు అవిలేనుకు ఉండవు. అవసరమైతే పుస్తకాల మూట ఎత్తిన పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంతటి నిరాడంబరుడు అవిలేను. ముందు తరాలకు ఈ విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలకు మించిన ప్రత్యామ్నాయం లేదంటాడు. వాటిని చదవాలి చదివించాలి ముందు తరాలకు అందించాలి అనే సందేశంతో ముందుకు సాగుతుంటాడు.
అవిలేను సుమారు 30 ఏళ్లు శ్రమించి అత్యంత విలువైన పుస్తక భాండాగారాన్ని సమకూర్చాడు. గత నాలుగేళ్ల ముందు వరకు చిన్న గదిలో అద్దెకు ఉండే అవిలేను ఆ పుస్తకాలను పాఠకులకు, నిరుద్యోగులకు, పరిశోధకులకు అందించగలిగినప్పటికీ పుస్తకాలను ఉంచే స్థలం లేక కొంతకాలం ఇబ్బంది పడ్డాడు. గ్రంథాలయం కోసమైనా తనకు ఓ సొంత ఇల్లు కావాలని, ఓ ఇల్లు కొని ఆ ఇంటినే గ్రంథాలయంగా మార్చేశాడు. పిల్లలమర్రి పిన వీరభద్ర కళాపీఠం పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ఈ గ్రంథాలయం నిర్వహిస్తున్నాడు. వచ్చిపోయే పరిశోధకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. దూర ప్రాంతం నుంచి వచ్చే పరిశోధకుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశాడు. ఎవరైనా వచ్చి ఒక పుస్తకం చదివి వెళ్లారంటే తాను ఎంతో సంతృప్తి చెందుతాడు. ఎందరో నిరుద్యోగులు అవిలేను గ్రంథాలయంలోని పుస్తకాలను పోటీ పరీక్షల కోసం వినియోగించుకొని నేడు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అనేకమంది పరిశోధకులు ఈ గ్రంథాలయం ఆధారంగా పరిశోధనలు చేశారు. ఇంకా చేస్తున్నారు.
ఈ గ్రంథాలయంలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వంటి అత్యుత్తమ గ్రంథాలతో కూడిన ఆంగ్ల సాహిత్యం, తెలుగులో అన్ని ప్రక్రియలకు సంబంధించిన అత్యుత్తమమైన సాహిత్యం, వైజ్ఞానిక సంబంధమైన సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యం, బాల సాహిత్యం అనేక పరిశోధనా గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, వేలకొద్దీ కథల సంపుటాలు నవలలు ఇలా ఇది అది అని కాకుండా అన్ని రకాల సాహిత్యానికి చోటు కల్పించాడు. 100 సంవత్సరాలకు పూర్వం ప్రచురించబడ్డ అరుదైన యక్షగానాలు, నాటకాలు, పద్య కావ్యాలు అవిలేను గ్రంథాలయంలో కనిపిస్తాయి. విశేషమైన సంస్కృత సాహిత్యం, హిందీ, కన్నడ, మరాఠా భాషల పుస్తకాలు సైతం అవిలేను గ్రంథాలయంలో ఉన్నాయి. అనేకమంది రచయితల దగ్గర కూడా లేని వారి పుస్తకాలు అవిలేను గ్రంథాలయంలో దొరుకుతుండడం గమనించవచ్చు.
నేటి తరం విద్యార్థులలో చదివే అభిరుచి తగ్గిపోతున్నదని భావించి విద్యార్థుల స్థాయికి తగిన పుస్తకాలను విద్యార్థుల చెంతకు చేర్చాలి అన్న లక్ష్యంతో చదవండి- చదివించండి అనే నినాదంతో పాఠశాల పుస్తకాలు ప్రతి పాఠశాలకు 100 పుస్తకాలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికీ సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో అనేక పాఠశాలలకు అందించారు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు తనను సంప్రదించమని కోరుతున్నారు.
పిల్లలమర్రి పిలవీరభద్ర కళాపీఠం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడానికి కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు. కవి సమ్మేళనాలు, పుస్తక పరిచయ కార్యక్రమాలు, అవధానాలు మొదలైన సాహిత్య కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారు.
గ్రంథాలయోద్యమకారుడినే కాక ఉపాధ్యాయుడిగా అవిలేను ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలో విషయ నిపుణుడిగా సేవలందిస్తున్నారు , రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి పక్షాన అనేక అకాడమిక్ ప్రోగ్రాంలలో పాల్గొన్నారు. అవిలేను రచయితగా పలు గ్రంథాలు రాశారు. నేటి పల్లె చిత్రం (ఖండ కావ్యం), సాయి శతకం, తెలుగు బిడ్డ శతకం
అముద్రితవచన కవితా సంపుటి
సాహిత్య వ్యాస సంపుటి
అవధాన మధురిమ,
సూర్యాపేట జిల్లా కవుల చరిత్ర తదితర గ్రంధాలు అముద్రితంగా ఉన్నాయి.
అవిలేను గ్రంథాలయ సేవలను గుర్తించి అనంతుడు ఫౌండేషన్ పురస్కారం
తెలంగాణ సారస్వత పరిషత్ బాల సాహిత్య సమ్మేళనం సందర్భంగా సత్కారం, డాక్టర్ కాలువ మల్లయ్య స్ఫూర్తి పురస్కారం, దాశరధి జాషువా అధ్యయన పీఠం వారి పురస్కారం, 2012, 17 ప్రపంచ తెలుగు మహాసభలలో సత్కారం,
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతోపాటు మనం వికాస వేదిక ఉత్తమ కవిత పురస్కారం తదితర పురస్కారాలు ఆయనను వరించాయి.
‘వాణి సేవామణి’ అనే బిరుదు అందుకున్నారు. ఆస్ట్రేలియా కు చెందిన ప్రముఖ అష్టావధాని తటవర్తి కళ్యాణ చక్రవర్తి పలు ప్రాచీన దేవాలయాల పేరిట జరిపిన ఆన్లైన్ అష్టావధానాలలో భాగంగా సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి క్షేత్రం వేదికగా జరిపిన అష్టావధానం నిర్వహణలో అవిలేను కీలక పాత్ర పోషించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సూర్యాపేట సందర్శించినప్పుడు అవిలేను గ్రంథాలయ సేవలను గుర్తించి ఆ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారు. ఆదిలీల ఫౌండేషన్ ఢిల్లీలో నిర్వహించిన కవి సమ్మేళనానికి, అష్టావధానానికి అవిలేనుకు ఆహ్వానం అందింది. ఇటువంటి పరిచయాలను సందర్భాలను కూడా అవిలేను గ్రంథాలయ అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటారు. ఆ సందర్భంగా కలిసిన రచయితల వద్ద నుండి పుస్తకాలు సేకరిస్తుంటారు.
సాయంత్రం పాఠశాల నుండి రాగానే గ్రంథాలయమే ఆయన లోకం. పుస్తకాలు సర్దుతూనో, పుస్తకాలు చదువుతూనో కనిపిస్తాడు. ప్రచారానికి ఆమడ దూరంగా ఉంటాడు . సూర్యాపేట అనగానే సాయుధ పోరాటం గుర్తొస్తుంది. పెద్దగట్టు లింగమంతుల జాతర గుర్తొస్తుంది. పిల్లలమర్రి దేవాలయం గుర్తొస్తుంది. అలాగే భవిష్యత్తులో అవిలేను గ్రంథాలయం గుర్తొస్తుంది

– డాక్టర్ సాగర్ల సత్తయ్య
7989117415

Scroll to Top