సత్కావ్యంబులు వ్రాయ నెంచితివయా సద్భావనాభ్యున్నతిన్
సత్కారమ్ము ల తోడ పండితుడవై, సమ్మానితుండై సదా
సత్కీర్తిన్ గడియించి బోధనలతో సంభావనా చాతురీ
సత్కవీంద్రునిగా నిలన్ చరితలో సంప్రీతితో వెల్గగా
విశ్వావసు ఉగాది సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కావ్యకళాప్రపూర్ణ, డా. చింతలపాటి మోహన మురళీకృష్ణగారిని ఉగాది పురస్కారంతో సత్కరించింది.
డా. చింతలపాటి మోహన మురళీకృష్ణగారు గత అయిదారేళ్లుగా ఆస్ట్రేలియా వాసులకు పరిచితులు. 2020 నుండి ఇక్కడ ఉన్న ఏన్నారై తెలుగువారితో కలిసి తెలుగుభాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
– వారు ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు ఎన్నారైలకు తెలుగు పద్యాలు నేర్పించారు. తెలుగు ఛందస్సులను పరిచయం చేశారు. ముఖ్యంగా ఇక్కడివారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. గత 30-40 సంవత్సరాలనుండి ఆస్ట్రేలియాలో ఉంటూ మాతృభాషపై మమకారంతో తెలుగులో ఏదైనా వ్రాయాలని, ఇక్కడి పిల్లలకు తెలుగును నేర్వాలని ఆశిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో డా. చింతలపాటి వారు ఇక్కడివారందరినీ ఒక సమూహంగా చేర్చి తెలుగు భాషా లక్షణాలను తెలియజేశారు. తెలుగు వ్యాకరణాన్ని నేర్పించారు. శతకాలు వ్రాయించారు. పద్య రచనలో మెళకువలు చెప్పారు. అవధానాలలో పృచ్చకపాత్ర నిర్వహింపజేశారు.
– ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, మలేసియా తెలుగు ఎన్నారైల కోరిక మేరకు 6 మాసాలపాటు తెలుగుపంచకావ్యాలను ధారావాహికగా ఉపన్యాస రూపంలో తెలియజేశారు.ఆ సందర్భంగా వారి ప్రతిభకు మెచ్చి ఆస్ట్రేలియాలోని తెలుగు అంతర్జాల పత్రిక “తెలుగుమల్లి” పక్షాన “కావ్యకళాప్రపూర్ణ”బిరుదుతో సత్కరించడం జరిగింది.
– అమెరికా లోని తెలుగు సంఘాలవారు పోతన భాగవత పద్య పోటీలను అంతర్జాతీయంగా నిర్వహిస్తూ పిలుపునిచ్చినప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్న తెలుగు ఎన్నారైల పిల్లలకు భాగవత పద్యాలను నేర్పి, ఆ పోటీలకు సిద్ధపరచారు.
– అలాగే తెలుగు పౌరాణిక రంగస్థల నాటకాలను ఎన్నారైలు ప్రదర్శించేటప్పుడు వారికి మెళకువలను నేర్పి సంభాషణల పలుకుబడిలోను, పద్యపఠనంలోనూ చక్కని శిక్షణనిచ్చారు.
– డా. చింతలపాటివారు సహజకవి. అనర్గళంగా పద్యాలను చెప్పగలరు. వారు భక్తిపూర్వకంగా ఇక్కడ ఉన్న రోజుల్లో 650 పద్యాలతో “ సిరిదివ్వెలు”అనే కావ్యాన్ని వ్రాశారు. ఆ కావ్యాన్ని ఇక్కడి వారందరూ ఎంతో ఆసక్తితో చదువుతున్నారు. సరళమైన తెలుగుభాషలో వివిధ ఛందస్సుల్లో ఆ కావ్యాన్ని వ్రాశారు. వారు ఇప్పటి వరకు 25 పద్యకావ్యాలను వ్రాశారు. 4,000 పద్యాలను వ్రాశారు.
– వారు గత రెండేళ్ళుగా “ వాఙ్మయి” పేరుతో ఒక అంతర్జాల తెలుగు సాహిత్య వేదికను నిర్వహిస్తున్నారు. అందులో భారతదేశం లోని పద్య రచయితలే కాకుండా అనేక దేశాలనుండి ఉద్దండులైన పండితులు పాల్గొంటూ భాషాభిమానాన్ని ప్రదర్శించగలుగు తున్నారు.
– ఆ వేదికపై “ఇంద్రసభ” లాంటి సాహిత్య రూపకాలను రూపుదిద్ది ప్రదర్శిస్తున్నారు. ఇది అద్భుతమైన రూపకంగా చాలామంది ప్రశంసించారు.
– ప్రముఖ అవధానుల చేత అష్టావధానం నిర్వహించారు.
– ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని అనేకమంది తెలుగువారు ఆంధ్ర విశ్వకళాపరిషత్తువారి M. A., తెలుగు పరీక్షలకు హాజరయ్యే నిమిత్తం తెలుగు భాషా శాస్త్రం, సాహిత్య చరిత్ర, ప్రబంధాలు, జానపదసాహిత్యం పేపర్లకు శిక్షణ నిస్తున్నారు.
డా. చింతలపాటి వారి సేవలు నిరుపమానం. వారిద్వారా తూర్పుదేశాలలో ఉన్న తెలుగు వారందరూ తెలుగు భాషలో చైతన్యవంతులవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు.
మల్లికేశ్వర రావు కొంచాడ
నేడు సుదినం. నవ వర్షము తనతో హర్షమును తెచ్చింది. తెలుగుజాతి తనను తాను సత్కరించుకుంది. ప్రతిభను అందలమెక్కించి, ఊరేగించి, పట్టాభిషేకం చేసింది. తనను సేవించిన సుపుత్రునికి ఉన్నత పురస్కారం అందించింది ఆంధ్రభాషాయోష. ఇంతటి ఆనందం చింతలపాటి మురళీకృష్ణ గారికి, వారితో బాటు వారి నెఱిగిన వారలందరకు ఉగాది పురస్కారమైంది. వారి కన్నా వారి అర్ధాంగి కడు పుణ్యాత్మురాలు, ఇంతటి ఘనత ఆమె కారణంగా వారికి కలిగినందులకు. అంతే కాదు సిసలైన ఆనందం ఉత్సాహం వారి తల్లిదండ్రులది. జనులీ పుత్రుని కనుగొని పొగడిరి కనుక పుత్రోత్సాహము నేడు పొందిరి. ఐనా ఈ పురస్కారం అణుమాత్రమే. ఎందుకంటే సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ అన్నారు భర్తృహరి. మురళీకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. రెండువేల ఇరువదియారు జనవరి నెలలో వారు భారతప్రభుత్వము పద్మమును, సిరిని యిచ్చి సమ్మానించగలదని ఆశిస్తున్నాను.
శ్రీ ఎం.వి.ఎస్.మూర్తి – ప్రముఖ పద్య రచయిత రాజమహేంద్రవరం.