తెలంగాణా సాంస్కృతిక దినోత్సవం


దశ వసంతాల తెలంగాణా ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని మెల్బోర్న్ తెలంగాణా ఫోరం ఈ సంవత్సరం తెలుగు భాషా సంస్కృతుల మూలాలను పునశ్చరణ చేసుకోవాలన్న ఒక మహోత్కృష్టమైన ఆలోచనతో రామాయణ, మహాభారత ఇతిహాసాల నుండి కొన్ని ఘట్టాలను రంగస్థల ప్రదర్శన చేయడం జరిగింది. పరభాషా సంస్కృతులతో సహజీవనం చేస్తూ మన ఉనికిని కాపాడుకోవాలన్న తపన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కనబడింది. అందునా చిన్నారులతో ‘భక్త ప్రహల్లాద’, ‘తాటకి వధ’ వంటి గాధలను ప్రదర్శింపజేయడం ఎంతో ముదావహం. ఇటువంటి పద్య నాటకాలను ప్రదర్శించడానికి ఎంతో ఓర్పు, నేర్పు అవసరం. వాటికి అవసరమైన ఆహార్యాలు, వస్త్రాలు సమకూర్చుకోవడం అంత సులువైన పని కాదు.

సీతారామ కళ్యాణం:
శ్రీ సాయి నటరాజ కూచిపూడి నృత్య కళాశాల వారిచే ప్రదర్శించబడిన శ్రీ సీతారామ కళ్యాణం ప్రత్యేకంగా చెప్పుకోదగింది. కూచిపూడి నృత్యానికి పేరొందిన శ్రీమతి శోభానాయుడు గారు రూపు దిద్దిన శ్రీ సీతారామ కళ్యాణానికి చిరంజీవులు సాయి అశితా రెడ్డి మరియు సాయి అష్మితా రెడ్డి తాటిరెడ్డి జీవం పోసారంటే అతిశయోక్తి కాదు. మెల్బోర్న్ నగరంలో జరిగే అనేక భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలలో వీరిరువురి ప్రదర్శన దాదాపు ఉంది తీరుతుంది. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.

రాగామృత సంగీత కళాశాల వారి సుందరాకాండ, రచనా నాట్యాలయ వారి శ్రీరామ పట్టాభిషేకం, రాధేశ్యాం వారి నృత్య రూపకం మరియు ఇతర బాలీవుడ్ నృత్యాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసాయి.

మొదటిగా తెలంగాణా రాష్ట్ర అవతరణకు ఆద్యులైన శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి విగ్రహానికి అందరూ గౌరవాభివందనాలతో స్మరించి తెలంగాణా రాష్ట్ర గీతాలాపన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Viv Nguyen – Victorian Multicultural Commissioner (Chair Person) మరియు Dr. Sushil Kumar (Consul General of India Melbourne) విచ్చేశారు. ఇతర అతిథులు MTF వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి నూకల,  MTF పూర్వ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ తోపుచర్ల, శ్రీ గంగిరెడ్డి,  శ్రీ పూనం సింగ్, తాయి అధ్యక్షులు శ్రీ చక్రి చయనం,ATCCC చైర్ పర్సన్ శ్రీ శ్రీనివాస్ గుల్లపల్లి, శ్రీ కార్తీక్ అరసు మరియు శ్రీ గౌరిశెట్టి దినేష్ గారు విచ్చేసి కార్యక్రమాన్ని వీక్షించి అద్భుతమైన పౌరాణిక అంశాలను ప్రదర్శించినందుకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఎంతోమంది తెలుగు, భారతీయ సంస్థలు ఆర్థిక సహాయం అందించారు. వారి వివరాలు:
Ridge water property group, Bal real estate, ReddyG Real estate, Apara Accountants, Ozz floor solutions, Universal fly travels, Karvis accountants, Loans sorted, Infinite accountants, Dream square real estate, wishtoys, Chai N Dosa , SnackIndia.
మరెంతోమంది వ్యక్తిగతంగా, సంస్థాపరంగా స్వచ్చంద సేవలనందించి ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు. MTF అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి నూకల గారు మరియు కార్యదర్శి శ్రీ ప్రదీప్ రెడ్డి గారు కార్యవర్గ సభ్యులకు, స్వచ్చంద సేవకులకు, సంస్థలకు, వ్యాపార సంస్థలకు, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

Scroll to Top