ప్రభవ నుంచి అక్షయ వరకు గల అరవై సంవత్సరాలలో 39వ దైన విశ్వావసు నామ సంవత్సరం లోకి మరికొన్ని గంటల్లో అడుగుపెట్టబోతున్నాం. చైత్రమాస ఆగమనంతో ప్రకృతి పులకిస్తుంది. అంతటా కొత్తదనం సంతరించుకుంటుంది. నవచైతన్యానికి నాంది అవుతుంది. అనంతమైన కాలంలో సంవత్సరం ఒక ప్రమాణం. మానవ జీవనానికి, కాలస్వరూపుడైన ఆ పరమాత్మకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని, ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. తదనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.
చాంద్రమానం అనుసరించే తెలుగు వారి సంవత్సరాది… ఉగాది. సంస్కృత పదమైన ‘యుగాది’ కాలక్రమంలో ‘ఉగాది’ అయింది. ‘ఉ’ అంటే నక్షత్రం, ‘గ’ అంటే గమనం. అలా ఉగాది చాంద్రమాన నక్షత్ర గమనంతో రూపుదిద్దుకున్నదనేది ఖగోళ, జ్యోతిష శాస్త్ర ప్రమాణం. ఇదే విషయాన్ని హేమాద్రి పండితుడు ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథంలో ప్రస్తావిస్తూ… బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుగా దీన్ని పేర్కొన్నాడు. అఖండ దేవుడు తన ‘స్మృతి కౌస్తుభం’ గ్రంథంలో ‘‘చాంద్రమాన సంవత్సరంలోని తొలి మాసమైన చైత్రమాసంలో… తొలి తిథి అయిన పాడ్యమి- ఉగాది’’ అని తెలిపాడు. ఈ రోజునుంచి వసంత ఋతువు ఆరంభమవుతుంది.
తెలుగు, కన్నడ ప్రజలు ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరాది పండుగలో తప్పకుండా తినే ఆహారాలు కేవలం రుచికోసం కాదు, వాటి వెనుక లోతైన సాంస్కృతిక, ఆరోగ్య ప్రాముఖ్యత దాగి ఉంది. ఉగాది నాడు ఆరు రుచులు కలగలపిన ‘ఉగాది పచ్చడి’తోపాటు బొబ్బట్లు మామిడికాయ పులిహోర, పాయసం, ఇలా రకరకాలు వంటలు చేసుకుంటాం. ఉగాది పచ్చడి, వేపపుష్పం, మామిడి కాయలు వంటివి ఉగాది రోజున ప్రతి ఇంటా కనిపిస్తాయి.
ఉగాది పచ్చడి
ఉగాది పండుగనాడు చేసే ముఖ్య తెలుగు వంటకం ఉగాది పచ్చడి. సంవత్సరం మొత్తంలో వచ్చే ఆనందాలు, బాధలు, ఇతర భావాలకి ప్రతీకగా ఈ ఉగాది పచ్చడిని చేసుకుంటారు. పేరుకు పచ్చడి కానీ, దీనిని చాలా మంది పానకంలా చేసుకుంటారు. ఆరు రుచుల కలయికతో ఈ వంటకాన్ని తయారుచేస్తారు. ఇది జీవితంలోని ఆరు రుచులను సూచిస్తుంది. కొత్త ఏడాదిలో సుఖదుఃఖాలను సమతుల్యంగా స్వీకరించే సందేశం ఇస్తుందని హైదరాబాద్కు చెందిన సాంస్కృతిక నిపుణుడు చెప్పారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, వేప పువ్వు, రక్తశుద్ధి చేస్తుంది, చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మామిడి విటమిన్ సి అందిస్తుంది. వసంత ఋతువులో వచ్చే వ్యాధులను నివారించడానికి ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది.
కావాల్సిన పదార్థాలు :
చింతపండు, బెల్లం, పచ్చి మామిడి, వేప పువ్వు, నల్ల మిరియాలు, ఉప్పు (ఈ పదార్థాలు వివిధ ప్రాంతాలలో దొరికే వస్తువుల బట్టి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో వెలగ పండు కూడా ఉపయోగిస్తారు)
తయారీ విధానం :
ఈ పచ్చడి చేయడం అంత కష్టమేమీ కాదు. ఈ ఆరు పదార్థాలు ఉంటే సులభంగా చేయొచ్చు. ముందుగా చింతపండు నీటిలో నానబెట్టండి. తర్వాత అందులో మీకు చెప్పిన పదార్థాలన్నింటిని ఒక్కో స్పూన్ చొప్పున వేస్తూ కలపండి. తియ్యగా ఉండాలనుకుంటే బెల్లాన్ని కాస్త ఎక్కువగా కలపండి. మిగతా పదార్ధాలు తక్కువ మోతాదులోనే కలపండి. ఉగాది పచ్చడి సిద్ధం.