తెలుగు కల్చరల్ సెంటర్ క్రోధి ఉగాది



శోభకృతు ఉగాదితో మొదలై రెండవ సంవత్సరం కూడా అత్యంత శోభాయమానంగా అనుభవజ్ఞులైన కార్యవర్గ నిర్వహణలో క్రోదినామ సంవత్సర ఉగాది ATCCC 14-04-2024న జరుపుకుంది. తెలుగువారికి స్థిరాస్తి రూపంలో ఒక భవనాన్ని నిర్మించాలన్న లక్ష్యసాధనలో తదేక దీక్షతో సభ్యులందరినీ ఏక త్రాటిపై తెచ్చి, ప్రభుత్వ పరంగా అనేకమంది రాష్ట్ర మంత్రులను, అధికారులను ఆహ్వానించి తెలుగు భవనం ప్రాముఖ్యతను, అవసరాన్ని విశదపరచి కావలసినంత సహాయాన్ని అందివ్వవలసిందిగా అర్థించారు. సుమారు 700 మంది విచ్చేసిన ఈ కార్యక్రమానికి చిరంజీవులు మధు పసుమర్తి మరియు రాకేశ్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ప్రకృతితో సమ్మిళితమైన పండుగ, కాబట్టి సాంప్రదాయబద్ధంగా శ్రీ విజయ్ కుంద్రగుంట గారు అందించిన ఉగాది పచ్చడితో పండుగ మొదలయ్యింది. ఈ కార్యక్రమంలో చాలా సంగీత, నృత్య సంస్థలు పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో, రాగామృత, శ్రీ శాయి నటరాజ స్కూల్ అఫ్ డాన్స్, గాయత్రి మ్యూజిక్ స్కూల్, అభినయ నృత్యమాల డాన్స్ స్కూల్, రచన నాట్యాలయ మరియు ఆజ్ నాట్యం డాన్స్ స్కూల్ మొదలైన వారున్నారు.


ఉగాది అనగానే పంచాంగం, కవి సమ్మేళనం ముందుగా గుర్తుకువస్తాయి. ఈ సంవత్సరం శ్రీ నరసింహమూర్తి గారు పంచాంగ శ్రవణం చేయగా తెలుగుమల్లి – రావు కొంచాడ, రాజశేఖర్ రావి మరియు అమరేంద్ర రెడ్డి అత్తాపురం గార్లు ఆస్ట్రేలియాలో 60 తెలుగు వసంతాల ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలపై పద్య రూపంలో కవి సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రభుత్వ అతిథులు విచ్చేసి వారి సందేశాలను వినిపించారు. వారు:
• Hon Ingrid Stitt – Minister for Multicultural Affairs
• Mr Steve McGhie MP – Cabinet Secretary
• Mr Mathew Hilakari MP
• Mayor Cr Matt Tyler – Mayor Hobsons Bay Council
• Mayor Councillor Jennie Barrera – Wyndham City Council

ATCCC చైర్ పర్సన్ పవర్ పాయింట్ ద్వారా ఇప్పటి వరకూ నిర్వహించిన కార్యక్రమాలు, మూలధనం సమకూర్చడంలో చేసిన ప్రయత్నాలు వివరిస్తూ గత నాలుగేళ్ళుగా శ్రీ గోపాల కృష్ణ మూర్తి తంగిరాల మరియు శ్రీ శ్రీనివాస రావు గంగుల గార్లు నిర్విరామంగా కృషి చేసి $500,000 పైచిలుకు డబ్బుని సభ్యులద్వారా స్వచ్చంద విరాళాల రూపంలో కూడబెట్టడం ఎంతో శ్లాఘనీయమని కొనియాడారు. వారితోబాటు ఇతర కార్యవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు అహోరాత్రులు కష్టపడ్డారని చెప్పారు.

Ms. Ingrid Stitt మాట్లాడుతూ తెలుగు భవనం ఆలోచనే ఒక గొప్ప సంకల్పమనీ, దీని గురించి ప్రభుత్వ పరంగా తప్పకుండా సహాయం అందిస్తామని చెప్పారు.


ఆస్ట్రేలియా తెలుగు కల్చరల్ కమ్యూనిటీ సెంటర్ కార్యవర్గం తెలుగువారందరూ ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలతో చేయూతనివ్వాలని, ఇది భావితరాలకు ఒక స్పూర్తిదాయకమైన సంపదగా మిగిలపోవాలని ఒక సత్సంకల్పంతో అభ్యర్ధిస్తున్నారు. తెలుగువారందరూ ముందుకొచ్చి ఈ ప్రక్రియలో భాగస్తులైతే ఈ భవనం రూపు దిద్దుకోవడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు.

ఈ కార్యక్రమానికి తెరవెనుక వేదిక అలంకరణ మరియు నిర్వహణలో ఎంతో సహాయాన్ని అందించిన వారు: లత గణపతిరాజు, విజయ తంగిరాల, నందిని బిస్కుండ, నిత్య కట్నేని మరియు కవిత లింగాబత్తుల.
ఇతర స్వచ్చంద సేవకులు: గణేష్ దొడ్డి, శర్మ బేతనభట్ల, ప్రవీణ్ మామిడి, అమిత్ కులకర్ణి మరియు రాజశేఖర్ రావి

ఆర్ధిక సహాయం: టైటిల్ స్పాన్సర్: స్వీట్ ఇండియా
ప్లానెట్ వెల్త్, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్, MGA ఇన్సూరెన్స్ బ్రోకర్స్ మరియు తత్త్వం యోగశాల

Scroll to Top