తెలుగు జాతికి చిరస్మరణీయుడుగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) ను చెప్పుకోవచ్చు. ఈయన తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశారు.
సి. పి. బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించారు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరారు. బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నారు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించారు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ – ప్రచురణల ముద్రింపచేసారు.
1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.
తెలుగు సాహిత్యం 18వ శతాబ్ద కాలానికి క్షీణ దశకు చేరుకుంది. అప్పటి సాంఘిక, రాజకీయ పరిస్థితులతో పాటు, తెలుగులో సృజనాత్మక కవులు కొరవడటం, నిరక్షరాస్యత పెరిగిపోవడం, తెలుగు భాషాసాహిత్యాలను పోషించి, ప్రోత్సహించిన విజయనగర రాజుల వంటి ప్రభువులు ఆ లేకపోవడం ఇందుకు ముఖ్య కారణాలు.
సి.పి. బ్రౌన్ ఈ ప్రాంతానికి అధికారిగా వచ్చి, తాళపత్ర నిక్షిప్తమైవున్న అనర్ఘ తెలుగు సాహిత్యాన్ని సేకరించి, వెలికితీసి, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించారు. ఆయన మాటల్లోనే “తెలుగు సాహిత్యం మరణశయ్యపై ఉంది. 1825 నాటికి దీపం మిణుకుమిణుకు మంటున్నది. తెలుగు సాహిత్యం చనిపోవడం నేను చూశాను. అయితే ముప్పె ఏళ్ళలో దాన్ని తిరిగి బ్రతికించగలిగాను”.
అంతకు ముందు భారత్ లో సివిల్ సర్వీసులో ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైన శిక్షణ పొందడానికిగాను హెయిలీ బర్రే కళాశాలలో బ్రౌన్ జేరారు. 1820లో మద్రాసు గవర్నర్ థామస్ మన్రో, ప్రతి ప్రభుత్వాధికారి ఒక స్థానిక భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఉత్తర్వులు వేశాడు. కాబట్టి పాఠ్యాంశాలలో భాగంగా సి.పి. బ్రౌన్ ఒక స్థానిక భాషను నేర్చుకోవలసి వచ్చింది. ఆ పరిస్థితిలో ఆయన తెలుగు భాషను ఎంచుకుని, వెలగపూడి కోదండరామ పంతులు శిక్షణలో తెలుగు నేర్చుకోవడానికి పూనుకున్నారు.
బ్రౌన్ తెలుగు పరీక్షను, సివిల్ సర్వీసు పరీక్షను 1820లో పాసైనాడు. కడప జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న హన్‌బర్రీకి డిప్యూటీగా బ్రౌన్‌కు ఉద్యోగం వచ్చింది. హన్బర్రీ తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడటం గమనించిన బ్రౌన్ ఆయన నుంచి స్ఫూర్తిని పొంది, తాను కూడా తెలుగు మీద పట్టు సాధించాలని పూనుకున్నారు. ఆయన 1824లో మచిలీపట్టణానికి, ఆ తరువాత రాజమండ్రికి బదిలీ అయ్యారు.
బందరులో సి.పి. బ్రౌన్ చేసిన తెలుగు భాషా సేవ వారి మాటల్లోనే:
“తెలుగు దేశానికి రాజధానియైన బందరు (మచిలీపట్టణము)లో నేను మూడు సంవత్సరములు న్యాయాధిపతిగా వ్యవహరించేను. అక్కడ నేను సంస్కృతాంధ్ర గ్రంథముల వ్రాతప్రతులు చాలా సంపాదించేను. వాని సంపాదన నాకొక “పిచ్చిగా” పరిణమించిందంటే అతిశయోక్తికాదు. అక్కడ నేను ఒక దమ్మిడీ నిలవచేయలేదు. నా వద్ద ఎప్పడూ ఇరవై మంది బ్రాహ్మణులు, శూద్రులు వీటి గురించి పనిచేసేవారు. వారికందరకు జీతము లేర్పాటు చేసెను. ప్రాచీన కావ్యాలు కాగితాల మీద వ్రాయడము, సప్రమాణికములైన పాఠములతో వానిని సంస్కరించడము, పదానుక్రమణికలు తయారుచేడము, వ్యాఖ్యానాలు వ్రాయడము వారి పని.”
తెలుగులో కోర్టు తీర్పు ఉత్తర్వులు ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది.
ఆ కాలంలో గుంటూరు ప్రాంతం భయంకరమైన క్షామాన్ని ఎదుర్కొంటున్నది. 1882-83లలో ఈ క్షామాన్ని ఎదుర్కోవటంలో బ్రౌన్ కనబరచిన పాలనాదక్షత అందరి మన్ననలు పొందింది. 1834లో ఆయన ప్రభుత్వోద్యోగం నుంచి విడుదలై లండన్ కు వెళ్ళిపోయి 1885 నుంచి 1838 వరకు అక్కడే ఉన్నాడు. 1838లో ఈస్టిండియా కంపెనీకి పర్షియన్ అనువాదకుడుగా బ్రౌన్ తిరిగి మద్రాసుకు చేరుకున్నాడు. మద్రాసు కాలేజి బోర్డు సభ్యుడుగా కూడా సేవలందించి 1854లో అనారోగ్యం వల్ల ఉద్యోగ విరమణ చేసి, లండన్ కు వెళ్ళిపోయాడు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశాడు. ఆయన 1884 డిసెంబర్ 12న కన్నుమూశాడు.
బ్రౌన్ తెలుగు భాషాసాహిత్యాలకు చేసిన సేవలు ఎనలేనివి. ఉచిత విద్యను, ఉచిత ఆహారాన్ని అందించే పాఠశాలలను నెలకొల్పారు. ఈ విషయం సి.పి. బ్రౌన్ తన స్వీయచరిత్రలో ఈ విధంగా రాసుకున్నారు –
“నేనెక్కడ పనిచేసినా, బాలురకు తెలుగు, హిందూస్థానీ విద్యాభ్యాసము నిమిత్తము ఉచిత పాఠశాలలను నెలకొల్పేవాడను. ఆయా ప్రాంతము వారినే ఉపాధ్యాయులుగా నియమించేవాడను. 1821లో కడపలో రెండింటిని, 1823లో బందరులో రెండింటిని స్థాపించేను.
1844లో మదరాసులో ఒక ఉచిత పాఠశాల పెట్టేను. అందులో 80 మంది తెలుగు, తమిళ విద్యార్ధులుండేవారు. ఇది ఏడేండ్లు నడచినది. కానీ దాని యాజమాన్యము మరొకరికి అప్పగించేను. కాని అది సరిగా నడవలేదు. తరువాత క్రైస్తవ మిషనరీలకు దాన్ని అప్పగించేను.”
1824లో ఆయనకు వేమన సాహిత్యం విూద ఆసక్తి కలిగింది. వేమన సాహిత్యాన్ని తెలుగు ఛందస్సును, వ్యాకరణాన్ని తిప్పాభొట్ల వెంకటశివశాస్త్రి, అద్వైత బ్రహ్మశాస్త్రి మార్గదర్శకత్వంలో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. వేమన పద్యాలను సేకరించి, 698 పద్యాలతో 1827లో మొదటి సంపుటాన్ని 1164 పద్యాలతో 1839లో రెండవ సంపుటాన్ని ప్రచురించారు. వీటికి ఆంగ్లానువాదాలు కూడా ప్రచురించారు. బందరు నుంచి రాజమండ్రికి బదిలీ అయిన తర్వాత కూడా ఆయన తెలుగు సాహిత్య సేవను, భాషాధ్యయనాన్ని కొనసాగించారు. అంతరించిపోయే దశలో ఉన్న తెలుగు కావ్యాల వ్రాత ప్రతులను సేకరించారు. కొందరు వ్రాయసగాళ్ళను తన స్వంత డబ్బుతో నియమించి, వారితో ఈ కావ్యాలకు వ్రాత ప్రతులను సిద్ధం చేయించి, పండితులతో చర్చించి, దోషాలను సరిదిద్ది పరిష్కరించారు. ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్ర మహాభాగవతాన్ని పునర్ముద్రించారు. శోభావిహీన అయిపోయిన తెలుగు సరస్వతికి ఆశ్రయం కల్పించి, పూర్వవైభవాన్ని తెచ్చారు.
తెలుగు నేర్చుకోవడంలో ఆసక్తివున్న బ్రిటిష్ వారి కోసం ఆయన ఎన్నో వ్యాకరణ పుస్తకాలను, ఛందో గ్రంథాలను వ్రాశాడు. తెలుగు-ఇంగ్లీషు; ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను, తెలుగు వాచకాలను మొదటిసారిగా తయారు చేశారు. సాహిత్య పత్రికలలో ఎన్నో వ్యాసాలను రాశారు. క్యావాలను అనువదించారు. ఇవన్నీ ఇప్పటికీ మదరాసు ఓరియంటల్ లైబ్రరీలో ఉన్నాయి.
1824 నుంచి తిక్కన, పోతన, వేమన వంటి ప్రసిద్ధ కవుల రచనలను సేకరించడం ప్రారంభించారు. 1835-38 మధ్య లండన్‌లో ఉన్నప్పుడు ఆయన 2,106 దక్షిణ భారతీయ భాషలకు చెందిన వ్రాత ప్రతులను ఇండియా హౌస్ లైబ్రరీ నుంచి సేకరించి, మద్రాసు లైబ్రరీకి పంపారు.
తెలుగు, సంస్కృత గ్రంథాల నెన్నింటినో పరిష్కరించి, ప్రచురించారు. మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ కు సంపాదకుడుగా పనిచేశాడు. ఆయన ప్రాచీన కావ్యాలు సేకరిస్తున్నప్పుడు చోటు చేసుకున్న అనేక సంఘటనలను కథలు కథలుగా లండన్ నుంచి వెలువడే ది ఆసియాటిక్ జర్నల్లో వ్రాశారు.
తెలుగు సాహిత్య పరిరక్షణకు బ్రౌన్ తన స్వంత డబ్బును ఖర్చు చేశారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రతి పైసా పొదుపు చేసేవారు. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో వుండి కూడా తెలుగు కోసం ఖర్చు చేయడానికి వెనకడుగు వేయలేదు. తనకు వస్తున్న జీతంతో ఎంతో మంది పండితులను, వ్రాయసగాళ్ళను పోషించారు.
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కావ్యాలను సేకరించి ప్రచురించడమే కాక బ్రౌన్ జనసామాన్యం నోళ్ళలో సజీవంగా వుంటూ, తరం నుంచి తరానికి బదిలీ అవుతున్న మౌఖిక సాహిత్యాన్ని ఎంతో సేకరించి, గ్రంథస్థం చేసి భద్రపరిచారు. ముద్రణకు అనువుగా వుండటానికి వీలుగా తెలుగు లిపిని సంస్కరించారు. ‘అరసున్నాను, బండి”ఱ”ను పరిహరించి, క్రావడిని మార్చారు. తెలుగు పద్యపాదాలను ‘యతి’ స్థానంలో విరచడం ఆయన ప్రారంభించిన సంప్రదాయమే. 12 డిసెంబర్ , 1884న వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్ లో మృతిచెందిన బ్రౌన్ కు యావత్ తెలుగు జాతి ఎప్పటికీ రుణపడివుంటుంది.