సోషల్ మీడియా మేనియాకు మరోపేరు పాప్‌కార్న్ బ్రెయిన్
ప్రస్తుతం చాలామంది రోజులో ఎక్కువ సేపు సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. ముందు కాసేపు ఫేస్‌బుక్, మరికాసేపటికి ఇన్‌స్టాగ్రామ్.. ఆ తర్వాత వాట్సాప్, స్నా్ప్‌చాట్, మళ్లీ తిరిగి ఫేస్ బుక్.. ఇలా సోషల్ మీడియా చుట్టూ చంచలంగా తిరిగే మెదడుని పాప్ కార్న్ బ్రెయిన్ అనొచ్చు. ఇదెలా ఉంటుందంటే.. పాప్‌కార్న్ వేగించేటప్పుడు అవి చెల్లాచెదురుగా ఎలా ఎగిరి పడుతుంటాయో అదే మాదిరిగా సోషల్ మీడియా ఉపయోగించే వారి మనస్తత్వం కూడా పాప్‌కార్న్‌లాగా మారిపోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్నే ‘పాప్‌కార్న్ బ్రెయిన్’గా వర్ణిస్తున్నారు.
ఎన్నో నష్టాలు:
* ముందుగా నిలకడ లోపిస్తుంది. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. తద్వారా పలు రకాల మానసిక సమస్యలు తలెత్తొచ్చు. అలాగే ఒత్తిడి, యాంగ్జయిటీ, చిరాకు వంటివి మొదలవ్వొచ్చు.
*జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా మతిమరుపు సంభవిస్తుంది. అంతేకాదు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గి ప్రొడక్టివిటీ కూడా లోపిస్తుంది.
*ఒంటరితనం పెరిగి రిలేషన్స్ దెబ్బతింటాయి. నిద్ర లోపిస్తుంది. ఇదిలాగే కంటిన్యూ అయితే రకరకాల మానసిక సమస్యలతో పాటు శారీరక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బ తింటుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్నుంచి బయటపడడం ముఖ్యం.
ఎలా బయట పడాలంటే..?
*పాప్‌కార్న్ బ్రెయిన్‌ను నార్మల్ బ్రెయిన్‌గా మార్చుకునేందుకు సోషల్ మీడియాకు కొంత బ్రేక్ ఇస్తే సరిపోతుంది.
*ఫోన్‌తో గడిపే సమయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ రావొచ్చు.
*ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేసి ఆయా సైట్స్‌ను వెబ్ బ్రౌజర్‌లో విజిట్ చేయడం ద్వారా సోషల్ మీడియా వాడకం కొంతవరకూ తగ్గుతుంది.
* ముందుగా ఎర్లీగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసకోవాలి.
*వ్యాయామం, ధ్యానం, పుస్తక పఠనం వంటివి చేయడం, తాజా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గి మొబైల్ వాడకం తగ్గుతుంది.