తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది.‘ సంక్రాంతి’ వచ్చిందంటే చాలు..తెలుగు లోగిళ్లు పండుగ శోభను సంతరించుకుంటాయి. శనివారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు. భోగమంటే సుఖసంపదలు. ఇది కాలక్రమేణా భోగిగా మారింది. సూర్యుడు దక్షిణాయన సమయంలో భూమికి దూరంగా జరగడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీనివల్ల చలి తీవ్రత పెరుగుతుంది. అందుకే.. అంతా ఆ రోజు చలిమంటలు వేస్తుంటారు. పాత వస్తువులను అగ్ని దేవుడికి ఆహుతి ఇచ్చి.. ఉత్తరాయణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటారు. మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటలు వెనుక ఉన్న ఆంతర్యం.
తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ ‘సంక్రాంతి’ . ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి ముందు రోజు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వేడుక వైభవంగా జరుగుతోంది. ఈ ఏడాది జనవరి 14న జరుపుకునేందుకు తెలుగువారు రెడీ అయ్యారు.
‘భగ’ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటారు. అందరూ భోగి రోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవుపేడతో తయారైన పిడకలు, ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో వేస్తారు. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. భోగి అనగానే చిన్న పిల్లల మీద రేగుపళ్లు పోస్తారు. ఆ రోజున రేగుపళ్లు కాస్తా భోగిపళ్లుగా మారిపోతాయి.
భోగి మంటలు
భోగిరోజు ప్రధానమైనవి భోగిమంటలు. ఆవు పేడతో చేసిన పిడకలు, కర్రలు, ఇంట్లో పాత వస్తువులు అన్నింటినీ అగ్నికి ఆహుతి చేస్తారు. అంటే మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల వెనుకున్న ఆంతర్యం. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగిమంటలు వేసుకోమంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది, భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో, పొలాల నుంచి వచ్చే పురుగులు కూడా ఇళ్లలో చేరకుండా తిప్పికొట్టేందుకు భోగిమంటలు ఉపయోగపడతాయంటారు.
భోగిపళ్లు
తెల్లవారు జామున భోగిమంటల దగ్గర చిన్నారులు ఎంత సంబరపడాతారో..సాయంత్రం భోగిపళ్లు పోసేటప్పుడు కూడా ఆ ఉత్సాహం అలాగే కొనసాగుతుంది. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి, కూర్చోబెట్టి భోగిపళ్లు పోస్తారు. ఇలా చేయడం వెనుక కారణం ఏంటంటే.. రేగు చెట్టుకు బదరీ వృక్షం అని పేరు. రేగు చెట్లు, రేగు పండ్లు శ్రీమన్నారాయణుడి ప్రతి రూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. అందుకే సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని పెద్దల విశ్వాసం. మన కంటికి కనిపించని బ్రహ్మ రంధ్రం తలపై భాగంలో ఉంటుందని.. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని కూడా చెబుతారు. ఎందుకంటే రేగు పండ్లు సూర్య కిరణాల్లో ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి. అందుకే రేగుపళ్లు తలపై పోయడం వలన వీటిలో విద్యుశ్చక్తి ఆరోగ్యాన్నిస్తుందని అంటారు.