మహాకవి కాళిదాసు నాటక రచయిత శ్రీ తూములూరి శాస్త్రి గారు రంగస్థల ప్రదర్శన చూసిన తురువాత ఒక్కొక్క పాత్రధారి వారి పాత్రాభినయం గురించి మరియు ఈ కార్యక్రమం గురించిన వారి అభిప్రాయాలు:
కాళికాదేవి: మొదటి, చివరి సన్నివేశాల్లో భయానక, దయామయ భావాలతో, సాధు భాషణలతో, ప్రసన్నత ఉట్టిపడే ముఖ కవళికలతో, కాళీమాతను ప్రత్యక్షంగా దర్శింపజేసిన తీరు అద్భుతం, హస్త విన్యాసం సర్వత్ర వికాసం.
శ్రుతకీర్తి మహారాజు: కుమార్తె పట్ల అమితమైన ప్రేమ, ధర్మరక్షణలో అప్రమత్తత కలిపి, చక్కటి సంభాషణా శైలితో, నాటకారంభానికే వన్నె తెచ్చి ఉత్కంఠత పెంచేటట్లు చేసిన నటన అందర్నీ మెప్పించింది.
సర్వమంగళ, శకుంతల: రాకుమారిగా, సర్వవిద్యా విశారదగా, వినయవిహారిగా, స్నిగ్ధ సుకుమారిగా, ముగ్ధ మునికుమారిగా, అద్భుతమైన హావ భావ ప్రకటనతో, సంభాషణా పటిమతో ప్రేక్షకులను స్తబ్ధుల్ని చేస్తూ, మొత్తం ప్రదర్శనకే వన్నె తెచ్చిన నటీమణి నటన అత్యంత అభినందనీయం.
రాకుమారి చెలికత్తెలు: రాజభక్తిని చూపుతూ, దైవప్రార్ధనలో నృత్యంతో రాకుమారికి సాయం చేస్తూ, వెన్నంటి ఉన్న ప్రభుభక్తి పరాయణులుగా నటించిన తీరు అందర్నీ అలరించింది.
రాజపురోహితుడు: విద్యాపారంగతుడైనా, వికారాలకు అతీతుడు కాడనే విషయాన్ని చక్కటి సంభాషణాశైలిలో ప్రదర్శించి, నటించిన తీరు మెచ్చుకోదగ్గది.
ప్రధాన సచివుడు: రాజకుమారిపై అసూయతో, ఆమె జీవిత పతనానికి పధకాలు రచించి, అమలు జరపడంలో కుటిల రాజనీతిని ప్రదర్శించిన పద్ధతి, సంభాషణలు ప్రశంసనీయం.
ఆస్థాన జ్యోతిష్కుడు: అసాధారణ జ్యోతిష్కుడుగా, సత్యాన్ని సున్నితంగా చెప్పి, పై అధికారి అయిన మంత్రి బెదిరింపులకి తల ఒగ్గి, నటించిన తీరు నాటకంలో చక్కగా అతికినట్లు శోభించింది.
కిరాతుడు, కాళిదాసు: విభిన్న వేషధారణలతో, వివిధరకాల పలుకుబడులతో, అనాగరికత నుంచి, అసామాన్యత వరకు, క్రూరభాషణల నుంచి, విద్వదభిభాషణల వరకు, వెంటవెంటనే మారవలసిన పాత్రలను ఎంతో నేర్పుతో, చురుకుగా పోషించిన తీరు అత్యంత శ్లాఘనీయం. “తప్పకుండా కాళిదాసు ఇలానే ఉంటాడు” అనే చెరగని జ్ఞాపకాన్ని ప్రేక్షకుల మనస్సులలో ముద్రించినట్లు నటించిన సౌరు గణనీయం.
భోజరాజు: అందరి అభిమానాన్ని పొందిన మహారాజుగా, కవిరాజుగా, ఠీవితో, ధీర గంభీర స్వరంతో, స్వఛ్చమైన, విద్వత్తుతో కూడిన వాక్కుతో, అందర్నీ సమన్వయం చేసే విధంగా, ఎంతో హుందాతనంతో నటించిన విధం అభినందనీయం.
భోజ మంత్రి: ఉద్దండులైన కవులున్న ఆస్థానాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తూ, కాళిదాసు శ్లోకాలకు అర్ధాలను వివరిస్తూ, మహారాజు మనోభావాలను గమనిస్తూ నటించిన తీరు ప్రశంసాపాత్రం.
కాంచనమాల: “ఇది నాటక ప్రదర్శన కాదు, నా ప్రదర్శన. అన్నీ నేనే” అనుకుంటూ చిన్ని చిట్టెమ్మగా దిగివచ్చిందా పెద్దమ్మ ఈ పాప రూపంలో. నదురూ, బెదురూ లేకుండా, నెమ్మదిగా నడుస్తూ, మహారాజుకి సరి అయిన సమాధానమిస్తూ, ప్రేక్షకులను రెండు నిమిషాల పాటు ఆశ్చర్యపరచిన ఆ పాప నటన అమోఘం. ఈ పాత్రను ప్రదర్శనకు తీసుకున్న దర్శకుల ధైర్య సాహసాలు అభినందనీయం.
దండి కవి: కవితా విన్యాసంతో, అసూయా విలాసాన్ని కలిపి, భోజునికి సాహిత్య సమీక్ష, కాళిదాసుకి జీవిత పరీక్ష కల్పించి, కాళికను రప్పించడానికి కారణమైన ఘట్టాన్ని రసవత్తరంగా నటించిన తీరు అందర్నీ మెప్పించింది.
భవభూతి కవి: ఉద్దండ పండితులు కూడా అసూయా ద్వేషాలకు అతీతులు కారన్న సత్యాన్ని సంభాషణ ద్వారా అభినయించి, కాళిదాసులోని సత్వగుణాన్ని దర్శింపజేసిన నటన అభినందనీయం.
సంధాగ్రాహులు: రాజాస్థానాల్లో ఉండే అసూయాపరులైన కవులను దర్శింపజేస్తూ, రాజాగ్రహం రుచి చూసిన విషాద ఘట్టాన్ని అందంగా ప్రదర్శించిన తీరు మెప్పు పొందింది.
శతంజయ కవి శిష్యుడు: ఎక్కువ సమయం లేని పాత్ర అయినా, చక్కటి సంభాషణతో, ఎంతో హుందాగా చేసిన నటన అందర్నీ మెప్పించింది.
రాజభటుడు: సహజ సిద్ధమైన పలుకుబడులతో నిండిన భాషణతో, పెట్టెను చూసి అమాయకంగా మాట్లాడిన తీరు, భోజరాజ భటునిగా ఎంతో హుందాతనాన్ని కలిగించిన తీరు అందరికీ నచ్చింది.
కణ్వ మహర్షి: “ఎంత హుందాగా ఉన్నాడా మహర్షి!” అనిపించే వేషధారణ, ఆర్ద్రతాభావన, ప్రసిద్ధ శ్లోక పఠన, కుమార్తెను అత్తవారింటికి పంపే వేదన, మూర్తి కట్టించిన నటన అభినందనీయం.
అనసూయ, ప్రియంవదలు (మునికన్యలు): “తపోవనాల్లో మునికన్యలు ఇలానే ఉంటారు” అనిపించే పవిత్రభావన కలిగించే విధంగా వేషభాషలు, వినయ ప్రవృత్తులు, సాత్వికత, మానవత ప్రదర్శించిన తీరు అభినందించదగ్గది.
శార్జ్ఞరవుడు: గురుభక్తి, సత్వ శక్తి, తపో నియుక్తి కలబోసిన మునికుమారునిగా, తగిన వేషభాషలతో సాత్త్వికంగా చేసిన నటన మెచ్చదగ్గది.
నర్తకీమణులు: “ఏం అద్భుతమైన నృత్యాలు!! దైవ సంస్థానాన్ని, రాజాస్థానాన్ని వేదిక మీదకు దింపేశారు ఆ నృత్యాలతో!” అనే విధంగా, ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని చేసి, వివిధవర్ణ శోభలతో సభనంతా ఉర్రూతలూగించిన నర్తకీమణులు ఎంతో అభినందనీయులు. కవలల (twins) నృత్యం మరింత ఆకర్షణీయమై నిలిచింది.
వ్యాఘ్రము: దేవీ వాహనంగా, దేవి రాకను తెలిపే విధంగా, సహజసిద్ధంగా వ్యాఘ్రం వలె నడక సాగించిన నటన స్వాభావికంగా ఉంది.
శబ్ద చాలకులు: గీతాలను, శ్లోకాలను, సంభాషణలను ముందుగా సంగ్రహించి, వాటికి తగిన సంగీత, వాద్యాదులను సందర్భోచితంగా కలిపి, విశిష్ట విజ్ఞానాన్ని ఉపయోగించి సమగ్ర శబ్దచిత్రాన్ని తయారుచేసి, ప్రదర్శనలో సాంకేతిక లోపాలేమీ లేకుండా తీర్చిదిద్దిన శబ్దవైజ్ఞానికుల కృషి ఎంతో అభినందనీయం.
దర్శకులు: ఈ నాటక ప్రదర్శనను ముందే మనసులో దర్శించి, నటీనటవర్గాన్ని సమీకరించి, వారి నాటకీయతను నిర్దేశించి, అడుగడుగునా కావలసిన సామగ్రిని సంపాదించి, అత్యున్నత ప్రమాణాలతో ప్రదర్శనను అందించి, సభను ఆశ్చర్య చకితుల్ని చేసిన ప్రతిభా ప్రభావులు, కళా స్వభావులైన దర్శకుల దార్శనికత అత్యంత అభినందనీయం. కాళికాదేవి ఆగమనాన్ని సూచించే శబ్ద వైచిత్రి, దేవాలయ కూర్పు, కాంచనమాలను రాజాస్థానానికి తెచ్చి నిలిపిన ప్రతిభ, సాహసం, శాకుంతలం అంకాన్ని కలుపుకొని రావడం, చివరి అంకంలో కాళికాదేవి సౌజన్యం.. ఇలా అడుగడుగునా గుబాళించే ప్రతిభా పరిమళాలతో, ప్రజ్ఞా ప్రభావాలతో కూడిన దర్శకత్వం ఈ నాటక ప్రదర్శనకు ప్రధాన ప్రాణం. దర్శకబృందం ప్రతిభ అసామాన్యం, అగ్రగణ్యం, అద్వితీయం.
నిర్వాహకులు: కించిత్తు కూడా నాణ్యత తగ్గకుండా, అన్ని విషయాలలో అత్యున్నత ప్రమాణాలతో, ఎక్కడా, ఏవిధమైన లోపములు రానీయకుండా, చిరునవ్వుతో అన్నీ సర్దుకొస్తూ, సరిదిద్దుకొస్తూ, కావలసిన హంగులు సమకూరుస్తూ, ఈ ప్రదర్శన చుట్టూ సుందరమైన కార్యక్రమాన్ని రూపొందించి, విజయవంతంగా నిర్వహించిన ప్రధాన నిర్వాహకులు, సహ నిర్వాహకులు, కార్యకర్తలు అత్యంత అభినందనీయులు.
ఆదరణ: మీ ఊర్లో దిగినప్పటినుంచీ, తిరిగి వెళ్ళేవరకూ, అడుగడుగునా మమ్మల్ని వారి కుటుంబ సభ్యులుగా స్నేహవాత్సల్యాలతో ఎంతో ఆదరించి, మమ్మల్ని మధురమైన స్మృతులతో, అనుభూతులతో నింపి వీడ్కోలు ఇచ్చిన ఆత్మీయులకు మా కృతజ్ఞతాభివందనములు.
వేదికపై చెప్పినట్లు, అలకాపురంతో తులతూగే మేలైన పురంలో కాపురం ఉండే
మీ అందరకూ, మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు.
మీ నటబృందం వారి అద్భుత నటనా ప్రతిభకు అభినందనలు.
మీ రూపాల్లో దర్శనమిచ్చిన ఆ పెద్దమ్మకు అభివందనములు.