విజయపథంలో వనితామణులు – మహిళలే మహారాణులు
ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గుర్తించడానికి, లింగ సమానత్వం కోసం అవగాహన పెంచడానికి ఈ రోజును ప్రత్యేకతగా గుర్తిస్తారు. ఈ సంవత్సరం (2026) మహిళా దినోత్సవం యొక్క అధికారిక థీమ్ “గివ్ టు గెయిన్”. ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2026 ప్రచారం మహిళలు, బాలికలందరికీ “హక్కులు. న్యాయం. చర్య” అనే నినాదంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల రాజకీయ చరిత్రలోని మహిళామణుల గురించి ప్రత్యేకం….
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల రాజకీయ చరిత్రను గమనిస్తే, మహిళలు కేవలం పరిపాలన కే పరిమితం కాకుండా, సంక్షోభ సమయాల్లో దేశాన్ని నడిపించే ‘మహారాణులు’ అనిపించుకున్నారు. జూలియా గిల్లార్డ్ ఆస్ట్రేలియా లో పురుషాధిక్య రాజకీయాలను ఎదుర్కొని నిలబడటంలో, హెలెన్ క్లార్క్ సుదీర్ఘకాలం స్థిరమైన పాలన అందించడంలో, జసిండా ఆర్డెర్న్ మానవీయ కోణంలో ప్రపంచం మెచ్చే నాయకత్వాన్ని చూపడంలో…ఎంతో కృషి చేశారు. చేస్తున్నారు. వీరంతా మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనాలు.

జూలియా గిల్లార్డ్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఒక్కరు మాత్రమే మహిళా ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆమె జూలియా గిల్లార్డ్. ఈమె ఆస్ట్రేలియా మొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. జూన్ 24, 2010 నుండి జూన్ 27, 2013 వరకు ఈమె పదవిలో ఉన్నారు. లేబర్ పార్టీకి చెందిన గిలార్డ్, ఆస్ట్రేలియా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన చిహ్నంగా నిలిచారు. ఈమె సెప్టెంబర్ 29, 1961 న ఇంగ్లాండ్ లోని వేల్స్ లో జన్మించారు. చిన్నతనంలో ఆమె అనారోగ్యం (బ్రాంకో న్యుమోనియా) కారణంగా మెరుగైన వాతావరణం కోసం ఆమె కుటుంబం 1966లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు వలస వచ్చింది. ఆమె మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి లా, ఆర్ట్స్ డిగ్రీలు పొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె లాయర్‌గా పనిచేశారు. 1998లో మొదటిసారి ఆస్ట్రేలియా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2007లో కెవిన్ రుడ్ ప్రభుత్వంలో తొలి మహిళా ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
సాధించిన విజయాలు:
2010లో లేబర్ పార్టీ నాయకత్వ మార్పు ద్వారా ఆమె ఆస్ట్రేలియా 27వ ప్రధాన మంత్రి అయ్యారు. ఆమె హయాంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాజిక సంస్కరణల్లో భాగంగా వికలాంగుల కోసం నేషనల్ డిజెబిలిటీ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రవేశపెట్టారు, ఇది ఇప్పటికీ లక్షలాది మందికి ఉపయోగపడుతోంది. విద్యా సంస్కరణల్లో పాఠశాల నిధుల పంపిణీలో పారదర్శకత కోసం ‘గోన్స్కీ’ సంస్కరణలను అమలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం వాతావరణ మార్పులను అరికట్టడానికి వివాదాస్పదమైన ‘కార్బన్ ఎనర్జీ టాక్స్’ ను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ‘నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్’ పనులను వేగవంతం చేశారు. 2012లో పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు టోనీ అబాట్‌ను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయాల్లో మరియు బహిరంగ జీవితంలో మహిళల పట్ల ప్రదర్శించే లింగ వివక్షను ఎండగడుతూ ఆమె చేసిన ఈ ప్రసంగం మహిళా హక్కుల పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచింది.
ప్రస్తుతం:
2013లో రాజకీయాల నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆమె సామాజిక సేవా రంగంలో చురుగ్గా ఉన్నారు. కింగ్స్ కాలేజ్ లండన్‌లో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విమెన్స్ లీడర్‌షిప్ కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.మానసిక ఆరోగ్య సంస్థ అయిన బియాండ్ బ్లూ కు కూడా అధ్యక్షత వహించారు. తన రాజకీయ అనుభవాలతో “మై స్టొరీ” అనే ఆత్మ కథను రాశారు
****************
జెన్నీ షిప్లీ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ రాజకీయాల్లో మహిళా నాయకత్వం చాలా బలంగా ఉంది. ఇప్పటివరకు ముగ్గురు మహిళలు ప్రధాన మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. జెన్నీ షిప్లీ న్యూజిలాండ్‌కు మొదటి మహిళా ప్రధాన మంత్రి. 1997 నుండి 1999 వరకు నేషనల్ పార్టీ తరపున ఆమె పదవిలో ఉన్నారు. ఈమె డిసెంబర్ 8, 1997 నుండి డిసెంబర్ 10, 1999 వరకు న్యూజిలాండ్ 36వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఫిబ్రవరి 4, 1952న న్యూజిలాండ్‌లోని గోరే లో జెన్నీ షిప్లీ జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత న్యూజిలాండ్ నేషనల్ పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ కూడా ఈమే కావడం విశేషం. అప్పటి ప్రధాన మంత్రి జిమ్ బోల్గర్‌పై పార్టీలో తిరుగుబాటు చేసి ఆమె ఆ పదవిని దక్కించుకున్నారు. ప్రధాన మంత్రి కావడానికి ముందు ఆమె సామాజిక సంక్షేమ శాఖ (1990-93), మహిళా వ్యవహారాల శాఖ (1990-96), ఆరోగ్య శాఖ (1993-96) వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు.
సాధించిన విజయాలు:
ఆర్థిక సంస్కరణల్లో భాగంగా జెన్నీ షిప్లీ తన హయాంలో జాతీయ అప్పులు తగ్గించడం, పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, సంక్షేమ ప్రయోజనాల తగ్గింపు వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.
సామాజిక రంగంలో మార్పు కోసం కృషి చేస్తూ ఆమె ఆరోగ్య మరియు సంక్షేమ రంగాల్లో చేసిన విప్లవాత్మక మార్పులను కొందరు ‘రుతనేషియా’ అని కూడా పిలిచేవారు. 1999లో జరిగిన ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ సదస్సుకు అధ్యక్షత వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించడం ఒక చారిత్రక ఘట్టం. ఆమె సేవలకు గుర్తింపుగా 2009లో బ్రిటీష్ ప్రభుత్వం ఆమెకు ‘డేమ్’ బిరుదును ప్రధానం చేసింది.
ప్రస్తుతం ఆమె రాజకీయాల నుండి విరమించి, వివిధ అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలకు డైరెక్టర్‌గా, సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆమె తర్వాత హెలెన్ క్లార్క్ న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
*******************
హెలెన్ క్లార్క్ (న్యూజిలాండ్)
హెలెన్ క్లార్క్ న్యూజిలాండ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు. ఫిబ్రవరి 26, 1950న హామిల్టన్, న్యూజిలాండ్‌లో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ స్టడీస్ విభాగంలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆమె 1999 నుండి 2008 వరకు వరుసగా మూడు సార్లు ఎన్నికై, న్యూజిలాండ్‌కు 37వ ప్రధాన మంత్రిగా సేవలందించారు. అత్యధిక కాలం దాదాపు 9 ఏళ్లు న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా పనిచేసిన మహిళగా రికార్డు సృష్టించారు.
సాధించిన విజయాలు
ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. న్యూజిలాండ్‌కు జెన్నీ షిప్లీ మొదటి మహిళా ప్రధాని అయినప్పటికీ, సాధారణ ఎన్నికల ద్వారా నేరుగా ప్రధానిగా ఎన్నికైన తొలి మహిళ హెలెన్ క్లార్క్. న్యూజిలాండ్ చరిత్రలో అత్యధిక కాలం 9 ఏళ్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన ఐదో వ్యక్తిగా ఆమె నిలిచారు. ఆమె పాలనలో న్యూజిలాండ్ గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. నిరుద్యోగిత తగ్గడంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టారు. అణు నిరాయుధీకరణ లో భాగంగా 1980వ దశకంలో న్యూజిలాండ్ ‘అణు రహిత’ విధానాన్ని అనుసరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
అంతర్జాతీయ స్థాయిలో
రాజకీయాల నుంచి విరమించిన తర్వాత, ఆమె అంతర్జాతీయ స్థాయిలో కూడా అత్యున్నత పదవులు నిర్వహించారు. 2009 నుండి 2017 వరకు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్ డిపి) కు అధిపతి గా పనిచేశారు. ఈ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళ ఈమె. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 మహమ్మారి సమయంలో, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీకి కో-చైర్‌గా వ్యవహరించారు. న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ న్యూజిలాండ్’ తో గౌరవించింది. హెలెన్ క్లార్క్ తర్వాత న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మరో ప్రముఖ మహిళా నాయకురాలు జసిండా ఆర్డెర్న్.
****************************
జసిండా ఆర్డెర్న్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ మాజీ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన వినూత్న నాయకత్వ శైలి, మానవీయ దృక్పథం తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.
అతి పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు పొందిన జసిండా ఆర్డెర్న్ 2017లో 37 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ 40వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా ప్రభుత్వాధినేతగా రికార్డు సృష్టించారు. 2020 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
సాధించిన విజయాలు
సంక్షోభాల నిర్వహణలో భాగంగా 2019లో క్రైస్ట్‌చర్చ్ మసీదుపై జరిగిన కాల్పుల ఘటనను ఆమె అత్యంత చాకచక్యంగా, సహానుభూతితో డీల్ చేశారు. వెంటనే తుపాకుల నియంత్రణ చట్టాలను కఠినతరం చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె అనుసరించిన “ఎలిమినేషన్ స్ట్రాటజీ” వల్ల న్యూజిలాండ్‌లో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.
పదవిలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చిన రెండో ప్రపంచ నాయకురాలిగా ఆమె నిలిచారు (మొదటి వ్యక్తి బెనజీర్ భుట్టో). ఐక్యరాజ్యసమితి సదస్సుకు తన చిన్నారితో కలిసి హాజరై వార్తల్లో నిలిచారు. జనవరి 2023లో, దేశాన్ని నడిపించడానికి తగినంత శక్తి తనలో లేదని పేర్కొంటూ ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం:
రాజకీయాల నుంచి వైదొలగిన తర్వాత కూడా జసిండా ఆర్డెర్న్ అంతర్జాతీయ స్థాయిలో చురుగ్గా ఉన్నారు. 2023 నుంచి అమెరికాలో ఉండి హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫెలో గా పనిచేసిన ఆమె, ఫిబ్రవరి 2026లో ఆస్ట్రేలియాకు నివాసాన్ని మార్చారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో డిస్టింగ్విష్డ్ ఫెలోగా జాయిన్ అయ్యారు. అలాగే ప్రిన్స్ విలియం ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ బోర్డు మెంబర్‌గా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. 2025లో ఆమె తన జ్ఞాపకాలతో కూడిన “ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్”అనే పుస్తకాన్ని విడుదల చేశారు. జనవరి 2024లో తన చిరకాల భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆన్‌లైన్ తీవ్రవాదాన్ని అరికట్టే ‘క్రైస్ట్‌చర్చ్ కాల్’ ప్రాజెక్ట్‌లో న్యూజిలాండ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
