విజయాలకు నాంది విజయదశమి


విజయదశమి సర్వ విజయాలకు నాంది. దసరా – ఉత్సవాలలో పదవ రోజు విజయదశమి. విజయదశమి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగ. ఉత్తర భారతంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. నవరాత్రి చెడును, విశృంఖలత్వాన్ని నిర్మూలించడానికి, అలాగే జీవితంలో అన్ని అంశాల పట్ల, అంటే మన శ్రేయస్సుకి దోహదపడే వస్తువులు, విషయాల పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండటానికి సంబంధించినది. నవ రాత్రుల తొమ్మిది రోజులు మూడు ప్రాధమిక లక్షణాలైన తామస, రజస, సత్వ గుణాలకు అనుగుణంగా వర్గీకరించ బడ్డాయి. మొదటి మూడు రోజులు తామసికమైనవి, వాటికి ప్రతీకలు తీవ్రమైన దుర్గ, కాళి దేవతలు. తరువాతి మూడు రోజులు లక్ష్మికి సంబంధించినవి – కోమలమైనదే కానీ ధన, వస్తు, కనక, వాహనాలకు ఆధారమైన దేవి. ఆఖరి మూడు రోజులు సరస్వతి కోసం ఉద్దేశించబడినవి. అదే సత్వ గుణం. అది జ్ఞానం, జ్ఞానోదయానికి సంబంధించినది.

పండుగ వెనుక గాథ
అపరాజితా దేవి అవతరించిన రోజు విజయదశమి. అపరాజితా దేవి అంటే పరాజయమన్నది ఎరుగని దేవత. త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే పరాజయమన్నదే ఉండదు. అమ్మవారు మధు, కైటభులను రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖశాంతులను అందించినది కూడా ఈ రోజే!. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోక కంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.
ఇక మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయా జూదంలో పరాజయం పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అప్పుడు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులోకి ప్రవేశించే ముందు శమీ చెట్టుపై తమ ఆయుధాలను దాచి ఉంచారు. తిరిగి సంవత్సరం తరువాత పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తిరిగి తీసుకున్నదే ఈ విజయదశమి రోజునే! అందుకే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు.

శమీ చెట్టు పూజ
విజయదశమి పండుగ రోజు సాయంత్రం శమీ చెట్టును పూజించి ఆ చెట్టు ఆకులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. శమీ ఆకులు విజయానికి సంకేతం. అందుకే ఇలా చేయాలి. ఇక బహిరంగంగా జరిగే రావణ దహనాన్ని తిలకిస్తే మంచిది. ఈ రోజు పాలపిట్టను చూడడం కూడా శుభ సంకేతంగా భావిస్తారు. పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు. పండుగ పది గండాలు పోగొడుతుంటారు. అందుకే మనకు ఉన్నంతలో పండుగ చేసుకోవాలి. మన పిల్లలకు మన పండుగల గొప్ప తనాన్ని తెలియజేయాలి. మన సాంప్రదాయ విలువలు మన భావితరాలకు భద్రంగా అందించాలి. విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుందాం.

Scroll to Top