నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూత
************************************
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (23 దిసెంబర్ 2022) ఉదయం హైదరాబాద్లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 777 చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. 2019లో ‘మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు. రేపు (శనివారం) మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆరు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కైకాల ప్రయాణం కొనసాగింది. కైకాల నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు.. చివరి చిత్రం మహర్షి. నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సత్యనారాయణలోని టాలెంట్‌ను ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ గుర్తించి ‘సిపాయి కూతురు’లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఫెయిల్ అయినపప్పటికీ సత్యనారాయణ అందర్నీ ఆకర్షించారు. నిండైన రూపం, కంచు కంఠం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పోలికలకు దగ్గరగా ఉండడం సత్యనారాయణకు కలిసొచ్చింది. ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో సత్యనారాయణ సినీ జీవితం మలుపు తిరిగింది.. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించారు. ఆయనకు 2017లో ఫిల్మ్‌ఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. ఉత్తమ చలన చిత్రం – బంగారు కుటుంబం 1994.. 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది. అంతేకాదు 200 మందికిపైగా దర్శకులతో కైకాల సత్యనారాయణ పనిచేశారు. కైకాల నటించిన 223 చిత్రాలు 100 రోజులు ఆడాయి. సంవత్సరం పైగా 10 సినిమాలు ఆడాయి.. అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59 ఉన్నాయి.
కైకాల సత్యనారాయణ కెరీర్ ను మలుపుతిప్పిన వ్యక్తి విఠలాచార్య. తను తీసిన ఓ సినిమాలో విలన్ పాత్ర వేయించారు విఠలాచార్య. అదే సత్యనారాయణ కెరీర్ ను మలుపుతిప్పింది. అప్పట్నుంచి మెయిన్ స్ట్రీమ్ విలన్ గా స్థిరపడిపోయారాయన. ఆ తర్వాత ఎస్వీ రంగారావు టైపులో ఎన్నో క్యారెక్టర్ రోల్స్ కూడా వేశారు. ఇంకా చెప్పాలంటే, ఎస్వీ రంగారావు లేని లోటును కైకాల దాదాపు భర్తీ చేయగలిగారు. సాంఘికాలతో పాటు.. పౌరాణిక పాత్రలైన రావణుడు, ధుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు లాంటి పాత్రల్ని కైకాల పోషించారు. పౌరాణికాల్లో రాముడు, కృష్ణుడు పాత్రలకు ఎన్టీఆర్ ఎలా స్థిరపడిపోయారో, అదే పౌరాణికాల్లో రాక్షస పాత్రలకు కైకాల అలా స్థిరపడ్డారు. ఎన్టీఆర్ ‘యమగోల’ సినిమాలో కైకాల పోషించిన యమధర్మరాజు పాత్ర ఆయనకు మరింత ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. యముడు అంటే కైకాల సత్యనారాయణే అనేలా చేసింది. ఆ తరవాత ‘యమలీల’ సినిమాలోనూ కామెడీ యముడిగా కైకాల అదరగొట్టారు.
తన 60 ఏళ్ల సినీజీవితంలో కైకాల సత్యనారాయణ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. 777 సినిమాల్లో నటించిన ఈ నవరస నటసార్వభౌముడు.. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా కైకాల చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన్ని నటుడిగా శిఖరాగ్రానికి చేర్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన నటుడు కైకాల.
కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, రాజకీయనాయకుడిగా కూడా కైకాల విశేష ప్రతిభ కనబరిచారు. కొదమసింహం, ముద్దుల మొగుడు, బంగారు కుటుంబం లాంటి సినిమాలు నిర్మించింది ఈయనే. వీటిలో బంగారు కుటుంబం సినిమాకు నంది అవార్డ్ కూడా అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు అందుకొని, తెలుగు చిత్రసీమలో ఓ అధ్యాయాన్ని లిఖించారు కైకాల సత్యనారాయణ.
సినిమాల్లో మాతమ్రే కాదు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కైకాల సత్యనారాయణ 1996లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ (ట్డ్ఫ్) అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1998లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివరావుపై ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో సత్యనారాయణకు అనుబంధం ఉంది.
కైకాల సత్యనారాయణ 1935, జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు కైకాల లక్ష్మీనారాయణ.. సత్యనారాయణ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేశారు. గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులున్నారు.