వైవిధ్యభరితమైన అంశాలతో కాలానుగుణంగా పరిణితి చెంది ఉగాది పచ్చడిలా షడ్రుచులే కాకుండా నవరసాల సమ్మిళితం కాన్బెర్రా తెలుగు సంఘం నిర్వహించిన బెంచ్ మార్క్ వారి శోభకృతు ఉగాది. సుమారు 7 గంటల నిడివి గల కార్యక్రమంలో 3 సంవత్సరాల వయసు పిల్లల నుండి 60 సంవత్సరాల నడి వయస్కులు పాల్గొని అంగరంగ వైభోగంగా జరిపిన ఉగాది సంబరాలు చూసిన వారికి కనుల పండుగే.
అధ్యక్షులు శ్రీప్రసాద్ గారు మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి ప్రియాంకల అధ్వర్యంలో కాన్బెర్రా తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు నిబద్ధతగా నిర్వహించిన కార్యక్రమం అత్యద్భుతమనే చెప్పాలి. సుమారు 200 పై చిలుకు పెద్దలు, చిన్నారులు వివిధ అంశాలలో పాల్గొని నిర్విరామంగా వేదికపై నృత్యం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
స్వాతంత్ర్య యోధులను స్పురణకు తీసుకొచ్చి ప్రేక్షకులను రోమాంచితులను చేసారు. జనపదాలతో నిండిన జానపదాలు, రసభంగం కాని శృంగార నేపథ్యంతో జావళీలు, సినిమా గీతాలు, గేయాలకు నృత్యం చేసి గత 20 సంవత్సరాలలో క్రమ క్రమంగా ప్రదర్శనలో, వేషధారణలో, ముఖ కవళికలలో, హావభావాలలో ఎంతో పరిణితిని చూపించారు.
ముఖ్యంగా పౌరాణికాంశము ‘మాయా బాజార్’ అందరినీ చాలా ఆకట్టుకుంది. అందులో శశిరేఖ (సావిత్రి) పాటకు తగ్గట్టుగా మంచి అభినయం చూపించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నది.
ప్రముఖ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారికి ప్రత్యేక నివాళులర్పిస్తూ చక్కని కార్యక్రమం నిర్వహించారు. విశ్వనాథ్ గారు దర్సకత్వం వహించిన కొన్ని చిత్రాల సన్నివేశాలను తెరపై చూపించి అందులోని నటులను గుర్తించి ఆ సన్నివేశంలోని సంభాషణలు కానీ, పాటలు కానీ ప్రేక్షకులు చెప్పాలని నిర్వాహకులు అడిగారు. ఈ విధంగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేయడం అందరినీ అలరించింది.
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆ మహా నటుడిని తలపింపజేసే ఏకపాత్రాభినయం కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేకుని కట్ చేసారు.
ఈ కార్యక్రమానికి తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ నడింపల్లి కృష్ణ గారు, శ్రీ బండి నరసింహారావు గారు, FINACT అధ్యక్షులు శ్రీ శాంతి రెడ్డి గారు, NATA అధ్యక్షులు శ్రీమతి సాహితీ పాటూరి, ACT తెలంగాణా ఉపాధ్యక్షులు శ్రీమతి సునీత రాబిన్సన్ గార్లు ఆత్మీయ అతిథులుగా వచ్చారు.
‘తెలుగుమల్లి’ సంపాదకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ‘వీధి అరుగు’ సంపాదకులు శ్రీ కుండ్రు శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వీరిరువురికీ TAC కార్యవర్గం ఉగాది సందర్భంగా సన్మానించింది.
దర్బార్ రెస్టారెంట్, కాన్బెర్రా వారు పసందైన విందు భోజనం ఏర్పాటు చేసారు. బెంచ్ మార్క్, శుభోదయం, బ్రిక్ ట్రీ సంస్థలతో పాటు పలు వ్యాపార సంస్థలు ఆర్ధిక సహాయాన్ని అందించాయి.
సుష్మిత, శిల్పి మరియు భార్గవ్, వీణ గార్లు ఈ ఏడుగంటల కార్యక్రమం తమ వాక్పటిమతో సునాయాసంగా నడిపించడం ఎంతో ముదావహం.
శ్రీమతి ప్రియాంక దాసరి గారు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.