డా. జనార్ధన రావు
విక్టోరియాలో మొదటి ఇండియన్ కన్సల్ జనరల్
ఆస్ట్రేలియా భారతీయ సమసమాజ స్థాపనకు కృషి చేసిన ఒక ధృవ తార దివికేగింది. వైద్య వృత్తితో మనుషుల రోగాలను నయం చేస్తూ తన మానవత్వంతో భారతీయ సమాజంలోని బేదాభిప్రాయాలను నివృత్తి చేసి, ఒకే త్రాటిపై నిలిపి భువన తారగా నింగికెగసి కాంతి పుంజంలా ధగ ధగా మెరుస్తుంది. ‘సమాజానికి ప్రతీ నిమిషం ఎలా ఉపయోగపడగలను?’ అన్న ఆలోచనా ధోరణి తన రహదారిని రాచబాటగా తీర్చి దిద్దింది. ఒక మానవతా మూర్తిగా అందరి మన్నలను అందుకుంది. సమతా మానవతలే నిలువెత్తు ధనమై సమపాళ్లుగా విశ్వమానవ విలువలతో కూడిన జీవితానికి నాందీ వాక్యం పలికింది.
ఎన్నో ఒడుదుడుకులు అధిగమించి అంచలంచెలుగా ఉన్నత శిఖరాలనధిరోహించి అటు పుట్టిన దేశం లోనూ ఇటు దత్తత దేశం లోనూ ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఘనాపాటి కథనమిది.
జీవిత చరమాంకంలో వైద్య వృత్తినుండి విశ్రాంతం పొందినా సమాజ సేవలో అవిశ్రాంతంగా అహర్నిశలూ పని చేసి స్ఫూర్తిదాయకంగా నిలచిన వైనమిది. తన జీవితం మరెందరికో ఆదర్శప్రాయమై నిలవాలని మలుపులు, గెలుపులు, కొసమెరుపులతో “A surgeon & Consul General A migrant experience” అన్న పేరుతో తన ఆత్మ కథని వ్రాసుకున్న వినమ్ర సుందర చైతన్యమిది.
వైద్యుడుగా ఇద్దరు పిల్లలతో $4.50 డాలర్లు చేతపుచ్చుకొని 1967 లో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన డా. తమరపాకం జనార్ధన రావు (డా.టి.జె.రావుగా అందరికీ చిరపరిచితులు) వైద్య వృత్తి చేస్తూ మెల్బోర్న్ నగరంలో మొట్టమొదటి భారతీయ కాన్సులేట్ జనరల్ పదవిని 17 ఏళ్ళు నిరాఘాటంగా నిర్వహించి ఘనతకెక్కిన కీర్తిశాలి. ఆయన ఆత్మ కథలో వారు వచ్చినపుడు పడ్డ అగచాట్లు, ఇరుగు పొరుగున నివసించే స్థానిక ఆస్ట్రేలియన్లు చేసిన సహాయం, మొదటి ఉద్యోగం సంపాదించడానికి పడ్డ పాట్లు, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధి ఆహ్వానంపై మెల్బోర్న్ లో మొదటి ఇండియన్ కన్సుల్ జనరల్ గా తన పదవీ స్వీకారం, ఆస్ట్రేలియాలోని అన్ని భారతీయ సంఘాలు ఉమ్మడి సంఘంగా ఏర్పడడానికి తాను చేసిన కృషి, మెల్బోర్న్ కామన్ వెల్త్ గేమ్స్ – ఇత్యాది ఎన్నో విషయాలు వివరంగా వ్రాసారు. వారు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మెల్బోర్న్ నగరంలో రెండు ప్రధాన దేవాలయాల నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
కాణీ జీతం తీసుకోకుండా సంవత్సరానికి 30,000 డాలర్ల పైచిలుకు తన సంపాదనలో ఖర్చుబెట్టి భారతీయులందరి యోగక్షేమాల కోసం 17 ఏళ్ళు కన్సల్ జనరల్ కార్యాలయాన్ని నడపడం ఒక మహోత్కృష్టమైన విషయం. ‘ఎముక లేని చేయి’ అనగా వింటూ ఉంటాము. కానీ ఈ వ్యక్తిని చూసిన వారికి ఆ భావం స్పష్టంగా కనిపిస్తుంది.
‘పూర్తి నిజాయితీ, చిత్తశుద్ధి, నిబద్ధత మరియు కృషితో ఎవరైనా గమ్యాన్ని చేరుకోవచ్చు’ ఇది శ్రీ రావు గారు అందరికీ చెప్పే సలహా.
డా. జనార్ధన రావు గారు ఈరోజు (26-08-2024) ఉదయం పరమపదించారని తెలపడానికి చింతిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము.