సినీ గీతాల రచనలో అనితరసాధ్యుడు శ్రీశ్రీ


తెలుగు సాహిత్యంలో ప్రాసకూ, శ్లేషకు శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. “వ్యక్తికి బహువచనం శక్తి” అనేది అతను సృజించిన మహత్తర వాక్యమే! ఆధునిక తెలుగు సాహిత్యంలో యుగకర్తగా గుర్తింపు పొందిన శ్రీసృఈ సినీ గీతాలకు కొత్త నడకలు నేర్పారు. ఆ విశేషాలను ఈనెల 30 శ్రీశ్రీ జయంతి సందర్భంగా ముచ్చటించుకుందాం…

విప్లవకవిగా సుప్రసిద్ధుడైన తెలుగు సినిమా పాటలో ప్రణయరాగాలు పలికించారు. ప్రళయ గర్జనలు పుట్టించారు. ప్రణయ మాధుర్యాన్ని దట్టించారు. హాస్యాన్ని తొణికించారు. శృంగారాన్ని ఒలికించారు. నిప్పులురిమే ఉద్యమ గీతాలను, ఉత్తేజాన్ని నింపే దేశభక్తి పాటలూ రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నవరసాలతో పాటను పరవళ్లు తొక్కించారు. శ్రీశ్రీ పాట ఎలా వుంటుందంటే ఏం చెప్పగలం? ఆయన పాట జలపాతం. వర్షుకాభ్రముల ప్రళయ ఘోష. కలకత్తా కాళిక. కాళికాదేవి నాలిక. కత్తిమొన మీద నెత్తుటి చుక్క. కొడవలి. మరఫిరంగి. మందుపాతర. హేమంత సమీరం. తుషార శీతలం. వెచ్చని నీడ. పచ్చని పైరు…. ఇలా ఎన్నెన్నో…

శ్రీశ్రీ బహుముఖ ప్రజ్ఞలో సినిమా సాహిత్యం ఓ పార్శ్వమే కావొచ్చుగాక కానీ పాటకు ఆయన కట్టబెట్టిన గౌరవం మాత్రం అనంతం. ఆహుతి అనే డబ్బింగ్‌ చిత్రంలో సినీ రంగంలో అడుగు పెట్టినా అంతకు ముందెప్పుడో వచ్చిన కాలచక్రం అనే సినిమాలో మహా ప్రస్థానాన్ని వాడుకున్నారు.డబ్బింగ్‌ పాటల్లో ఆయనెక్కువగా సంస్కృత సమాసాలనే వాడారు. నిజానికి అవి ఆయన సొంత పదాలై వుండవు. డబ్బింగ్‌ కాబట్టి పెదాల కలయిక ప్రాధాన్యం కాబట్టి అలా రాసివుంటారు. ఆహుతి సినిమా కోసం ఆయన రాసిన మొదటి పాట ప్రేమయే జనన మరణలీల అన్న పాటనే చూడండి. మృత్యుపాశం, అమరబంధం, యువ ప్రాణులు, హృదయ సదనం, సుకృత జన్మం, మధుర మధురతనం ఇలా వుంటాయి పదాలు. తర్వాతి కాలంలో డబ్బింగ్‌ పాటల్లోనూ సాహిత్యం పరిమళించేలా చూసుకున్నారు. అసలు అనువాద చిత్రాలకు ఆద్యుడు శ్రీశ్రీనే! హిందీ, తమిళ భాషల నుంచి దిగుమతి అయ్యే ప్రతీ సినిమాకు శ్రీశ్రీ కలమే కావాల్సి వచ్చేది. డబ్బింగ్‌ చిత్రాలకు ఎలా రాయాలో సూత్రీకరించింది శ్రీశ్రీనే! ఓష్ట్యాలైన ప, ఫ, బ, భ, మల విషయంలో జాగ్రత్తపాటించాలని తర్వాతి కవులకు సలహా ఇచ్చింది కూడా ఆయనే!

ఎలాంటి సినిమాలకు పాటలు రాయాల్సి వచ్చినా, ఆయన కలం మాత్రం ప్రజా పోరాటాలను, సామ్యావాదాన్ని, సామాజిక స్పృహను పలికించింది. శ్రీశ్రీ పాటలనగానే ముందుగా మనకు గుర్తొచ్చే చిత్రం పల్లెటూరు ఎన్టీఆర్ కధానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన రచించిన ప్రతిజ్ఞ కవితను నేరుగా తెరకక్కించారు. కార్మికుడి కష్టానికి ఏ షరాబూ ఖరీదు కట్టలేడని సాగే ఈ గీతం… నవశకానికి మార్గదర్శకం. శ్రీశ్రీ కవితను నేరుగా తెరకెక్కించిన మరో సినిమా ఆకలిరాజ్యం. ఆయన బాటసారి కవితను ఈ సినిమాలో తెరకెక్కించారు కమల్ హాసన్ నటన, బాలచందర్ దర్శకత్వ ప్రతిభ… సినిమా సందర్భం ఈ పాటకు ప్రాణం పోసింది. అల్లూరి సీతారామరాజు సినిమాలో శ్రీశ్రీ రాసిన తెలుగువీర లేవరా గీతం వింటుంటే ప్రతి మనిషికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రతిమనిషి తొడలు కొట్టి.. శృంఖలాలు పగుల గొట్టి సమరాన్ని సాగించాలి… అంటూ గీతాచార్యుడై దిశానిర్దేశం చేశాడు శ్రీశ్రీ, జాతీయ అవార్డు ఈ పాటకు లభించింది.

స్వాతంత్య్రం వచ్చిందని పండుగ చేసుకుంటే సరిపోదనే సందేశాన్ని నింపుకున్న పాట పాడవోయి భారతీయుడా పల్లవితో వెలుగునీడలు సినిమాలో రాశారు. మన ముందున్న సమస్యలను అధిగమించకపోతే స్వతంత్రానికి అర్ధంలేదని ఈ పాటలో తెలియజేశారు. ఆకాశాన్నంటే ధరలు, అంతులేని నిరుద్యోగం అవినీతి, బంధుప్రీతి, నల్లబజారు లాంటి సమస్యల్ని ఆనాడే పాటలో శ్రీశ్రీ ప్రస్తావించారు. అవి ఇప్పటికీ తమవిశ్వరూపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. భూమికోసం సినిమాలో శ్రీశ్రీ రాసిన ఎవరో వస్తారని గీతం… నేటి తరానికి స్ఫూర్తి మన భవిష్యత్ కు మనమే మార్గనిర్దేశకులమంటూ స్పూర్తిని రగిలిస్తుంది ఈ గీతం. డాక్టర్ చక్రవర్తి సినిమాలోని మనసున మనపై గీతం మనిషికి తోడు ఉంటే… అది స్వర్గమంటారాయన. పేరుకు ప్రేమ పాటే అయినా ఇది సైతం మనిషిని, మనసుని తట్టిలేపే గీతం. ఆరాధన సినిమాలోని నా హృదయంలో నిదురించే చెలి గీతం… నేటికీ ప్రజల నాల్కలపై నానుతూనే ఉండి ప్రేమకు ప్రతి రూపంగా చెప్పి ఇందులోని పదాలు శ్రీశ్రీని నుంచి వెలువడ్డం విశేషం. నిట్టూర్పులే కాదు… విరహాన్ని పైతం అంతే అద్భుతంగా రాయగలగడం శ్రీశ్రీకి మాత్రమే సాధ్యమైనదని ఇది నిరూపిస్తుంది. వెలుగు నీడలు సినిమాలో “కలకానిది విలువైనది బతుకు” అనే పాటలో జీవిత ప్రాధాన్యాన్ని వివరించారు శ్రీశ్రీ.

యమగోల సినిమాలో ఓ పోరాటగీతాన్ని శ్రీశ్రీ రాశాడు. యముడి మీదకు యమభటులు దండెత్తితే ఎలా ఉంటుందనే విషయాన్ని ఉహించి అద్భుతమైన పదాలతో అక్షర లక్షల విలువైన సాహిత్యాన్ని . సమరానికి నేడే ఆరంభం… యమరాజుకు మూడెను ప్రారబ్ధం అంటూ పాటగా రాశారు. శభాష్ రాముడు సినిమాలోని జయమ్ము నిశ్చయమ్మురా గీతం భయపడకుండా ముందుకు సాగితే విజయం దానంతటి అదే వరించి వస్తుందన్న ఆయన మాటలు స్ఫూర్తి వచనాలు. విప్లవాలే కాదు రాధాకృష్ణుల ప్రణయాలు సైతం శ్రీశ్రీ కలంలో చక్కగా ఒదిగిపోయాయి. ఇద్దరు మిత్రులు సినిమాలో “పాడవేల రాధిక…ప్రణయసుధా గీతిక” అంటూ ఆయన రాసిన పాట మనసును అలవోకగా తాకుంది. ..ఇలా ఒకటా రెండా చెప్పుకుంతూ పోతే వందలాది సినీగీతాలు ఆయన ప్రతిభకు మచ్చుతునకలుగా నిలుస్తాయి.

సినీ రంగంలో వుంటూ సినిమాలకు పాటలూ రాస్తూ ఆ పాటలన్నిటి పుట్టుకా పెద్ద ఫార్స్‌ అంటూ చెప్పుకోగలగటం శ్రీశ్రీకే చెల్లింది. అది ఆయనలోని నిక్కమైన నిజాయితీగా నిదర్శనం. అయితే ఫార్స్‌ అంటూనే ఏ పాటనూ ఆయన తేలిగ్గా తీసుకోలేదు. ఆషామాషీగా రాయలేదు. ప్రతిదానికి కష్టపడ్డాడు. ప్రతిదాన్ని ఇష్టపడ్డాడు. సినిమా పాటల్లో వ్యక్తమైన భావాలు చాలా వరకు తనవి కావని డబ్బిచ్చి రాయించుకున్న నిర్మాతలవనీ, వాళ్లు కోరినవే తానే రాసిపెట్టాననీ శ్రీశ్రీ చెప్పుకున్నా చాలా పాటల్లో ఆయన అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆయన పాట మర ఫిరంగిలా పేలుతుంది. ఇంతేసి గంధకాన్ని, ఇంతేసి సూరేకారాన్ని నూరే శ్రీశ్రీనే వీణ పాటల ఒరవడికి నాంది పలికారన్న విషయం చాలా మందికి తెలియని సత్యం. భార్యభర్తలు సినిమాలోని ఏమని పాడెదనో ఈ వేళ పాట విని చూడండి. వీణ పాటలోని మాధుర్యమెలా ఉంటుందో అనుభవం అవుతుంది. అప్పట్లో డబ్బింగ్‌ చిత్రాలతో బిజీగా వున్న శ్రీశ్రీ దుక్కిపాటి కోసమే ప్రత్యేకంగా మాంగల్యబలంలో అయిదు పాటలు రాశారు. ఆ అయిదూ ఆణిముత్యాలే. శ్రీశ్రీ కలం పడితే పదాలు క్యూలో నిల్చోవాలే కానీ…ఆయన ఏనాడు శబ్దాల కోసం తల బద్దలు కొట్టుకోలేదు. కలం జోరుగా హుషారుగా సాగిపోయేది. పాటా అంతే. భార్యభర్తలు సినిమాలోని జోరుగా హుషారుగా పాటలాగే!

శ్రీశ్రీ అన్ని రకాల పాటలు రాశారు. నవరసాలను ఒలికించారు. వైరాగ్యమూ రాశారు. వేదాంతాన్ని రాశారు. శోక రసాన్ని చాలా అద్భుతంగా చాలా పాటల్లో చూపించారు. అల్పాక్షరాలలో అనల్పార్థం కుప్పించారు. మాంగల్యబలంలోని పెను చీకటాయేలోకం చెలరేగేనాలో శోకం అన్న పాటు ఇందుకు మంచి ఉదాహరణ. భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకుంటే ..శ్రీశ్రీ సినిమా పాటకు ఆయుర్దాయం ఇన్ఫినిటి టు ది పవర్‌ ఆఫ్‌ ఇన్ఫినిటి క్రాంతి సంవత్సరాలు…తెలుగు సినిమా సాహిత్యంలో చెరగని ఎరా…తరగని సిరా శ్రీశ్రీ. మనిషన్నవాడు వున్నంత కాలం ఆయన పాటలు అక్షరాలై నిత్యమూ నిలుస్తాయి. ప్రణయగీతాల్లో శ్రీశ్రీ కొత్త ఒరవడి సృష్టించారు. నర్తనశాలలోని ఎవ్వరి కోసం ఈ మందహాసం పాట ఏవర్ గ్రీన్. ఇలాంటిదే.. శ్రీకృష్ణ తులాభారంలో ఓహో మోహనరూప అన్న పాట. వెలుగునీడలు సినిమాలోని హాయి హాయిగ జాబిల్లి తొలి రేయి వెండిదారాలల్లి పాటలో కొత్త కవితా ప్రయోగం చేశారు. అన్నట్లు జాబిల్లి కిరణాలను వెండిదారాలతో పోల్చడం ఎంత మంచి ప్రయోగం! డాక్టర్‌ చక్రవర్తి సినిమాలోని మనసున మనసై బ్రతుకున బ్రతుకై పాటను అప్పట్లో ప్రతి తెలుగుపిల్లా ఇల్లంతా తిరుగుతూ మురిపంగా పాడుకుంటూ మురిసిపోయింది.

జాతిని మేల్కొలిపే పాటలే కాదు, మేల్కొన్న జాతిని ముందుకు నడిపించే సమరగీతాలు కూడా అనేకం రాశాడాయన.. శబ్దం భావావేశాన్ని కల్పించే రచనాశిల్పం శ్రీశ్రీది! తర్వాత ఆయన్ను చాలా మంది అనుసరించారు..అనుకరించారు. నిజంగా నేను ప్రజల కవిని. ఎంచేతంటేను వాళ్లను చదివేను..చదివిందే రాసేను అనేవారు శ్రీశ్రీ. శ్రీశ్రీ దేశభక్తి పాటలు, జాతిని చైతన్యపరిచే గీతికలు ఎన్నో రాశారు. బలిపీఠం సినిమాలో కలిసిపాడుదాం తెలుగుపాట, రాముడు భీముడులోఉందిలే మంచికాలం ముందుముందునా, నేటిభారతంలో అర్ధరాత్రి స్వతంత్రం అంధకారబంధురం పాటలు కొన్ని ఉదాహరణలు.

కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగిస్తే శ్రీశ్రీలా వెలిగిందన్నాడు పురిపండ. నిజమే ఆయన ఓ శతాబ్దపు మహాకవిగా ఓ వెలుగు వెలిగారు. ఆయన పాటా వెలిగింది. వెలుగుతూ వుంది..సినీ సాహిత్యంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదు. బొబ్బిలియుద్ధం సినిమాకు ఓ జావళి అవసరమైంది. నేను రాస్తానన్నారు శ్రీశ్రీ…మీరు రాయగలరా అని ప్రశ్నించారు సాలూరి మాస్టారు..గలనో లేనో చూడండి అంటూ నిమిషాల్లో నిను చేర మనసాయరా పాట రాసి అనుమానపడ్డవాళ్ల ముక్కున వేలేయించారు. వ్యక్తిత్వ వికాసానికి బండెడు పుస్తకాలు చదవనక్కర్లేదు…గంటల కొద్ది ప్రసంగాలు విననక్కర్లేదు.. కేవలం వెలుగు నీడలు సినిమాలోని కలకానిది విలువైనది బతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అన్న ఒక్క పాట వింటే చాలు… ఈ పాట విన్నాకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒకతను తన మనసు మార్చుకున్నాడట! పాట ప్రభావం అలాంటిది. శ్రీశ్రీ ఓ మహోన్నత శిఖరం. ఉవ్వెత్తున లేచిన కడలి తరంగం…వందలకొద్దీ పాటల్లో మెచ్చినవి వెతకడం అసాధ్యం. అనితర సాధ్యం.

Scroll to Top