సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
* ప్రముఖుల సంతాపం
సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి (101) ఆదివారం నాడు కన్నుమూశారు. 1949లో ఎన్టీఆర్‌ను మన దేశం సినిమాతో తెరకు పరిచయం చేశారు నిర్మాత కృష్ణవేణి. బాలనటిగా, నటిగా, నిర్మాతగా ఎన్నో మరుపురాని చిత్రాలను పరిశ్రమకు అందించారు. ఆమె మరణం పట్ల సీఎం చంద్రబాబు స్పందించారు. ‘అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించింది. 102 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్ ను చిత్ర రంగానికి పరిచయం చేసి కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
తెలుగు చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేసిన సినీ నిర్మాత, తొలితరం హీరోయిన్ కృష్ణవేణి మృతి బాధ కలిగించింది. శోభనాచల స్టూడియో అధినేతగా, వివిధ చిత్రాలకు నిర్మాతగా, నటిగా ఆమె ఎనలేని సేవలు అందించారు. రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమకు వన్నె తెచ్చారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధి సున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసున్నాను అని నారా లోకేష్ సంతాపాన్ని ప్రకటించారు. నందమూరి రామకృష్ణ స్పందిస్తూ.. ‘చలన చిత్ర సీమకు మరచిపోలేని చీకటి రోజు. మా దైవం నాన్న, నందమూరి తారక రామారావు గారిని 1949లో ‘మన దేశం’ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి, మన దేశం చిత్రం నిర్మాత కృష్ణవేణమ్మ స్వర్గస్తులవడం మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. మా కుటుంబం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ పరమాత్మ ఆమె ఆత్మకు శాంతి కలగజేయాలని ప్రార్థిస్తున్నాము అంటూ పోస్ట్ వేశారు. నందమూరి బాలకృష్ణ కూడా ఇదే విధంగా సంతాపాన్ని వ్యక్తం చేశారు.