16ఏళ్ళు దాటితేనే సోషల్ మీడియా

16ఏళ్ళు దాటితేనే సోషల్ మీడియా వినియోగానికి అర్హులు
*ఆస్ట్రేలియాలో త్వరలో చట్టం
*మీడియాకు వెల్లడించిన ప్రధాని ఆంథని ఆల్బనీజ్, కమ్యూనికేషన్ మంత్రి మిషెల్ రౌలండ్

ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా యాక్సెస్ కోసం కనిష్ఠ వయసు పరిమితిని తీసుకొస్తున్నట్లు ప్రధాని ఆంథని ఆల్బనీజ్, కమ్యూనికేషన్ మంత్రి మిషెల్ రౌలండ్ మీడియాకు ప్రకటించారు. 2024 చివరి నాటికి సోషల్ మీడియా వినియోగానికి వయసు పరిమితి చట్టాన్ని తీసుకురావాలని గతంలోనే ఆల్బనీజ్ ప్రతిపాదించారు. కాగా ఇప్పుడు దాన్ని 16 సంవత్సరాలకు పరిమితం చేస్తూ నిర్ణయించారు. దీనిపై త్వరలోనే చట్టం తీసుకురానున్నారు.

ఈ ప్రతిపాదన ప్రకారం 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడం నిషేధించబడుతుంది. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఆల్బనీజ్, ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేశారు. పరిమితి లేని యాక్సెస్‌తో కలిగే సామాజిక నష్టం మరియు దాని ఫలితాలను ఎదుర్కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అయితే ఈ చట్టం వ్యక్తిగత వినియోగంపై కాకుండా కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ నిషేధానికి మాత్రమే అనుమతి ఇస్తుంది. వయసు పరిమితిని అమలు చేయడంలో విఫలమయ్యే ప్లాట్‌ఫారమ్‌లకు కఠిన శిక్షలు విధించబడతాయి. వీటిని యాక్సెస్ చేసే మైనర్లు, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఎటువంటి శిక్షలు ఉండవు. సదరు చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన 12 నెలల తర్వాత అమలులోకి వస్తుంది. దీని అమలు తీరును ప్రభుత్వ సేఫ్టీ కమిషనర్ కార్యాలయం పర్యవేక్షిస్తుంది.

ఈ చట్టం సమర్థతను నిర్ధారించడంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించిందని ఆల్బనీజ్ మీడియాకు తెలిపారు. అవాంఛిత పరిణామాలు జరగకుండా చూసేందుకు వయసు పరిమితికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనకు విపక్షం కూడా మద్దతు తెలపడంతో చట్టం ఆమోదించడానికి అవసరమైన ఓట్లు లేబర్ పార్టీకి దక్కే అవకాశాలు ఉన్నాయి.

Scroll to Top