ఫ్రూట్స్‌తో స్వీ‌ట్స్‌

ఫ్రూట్స్‌తో స్వీట్స్‌ ఆరోగ్యకరమైనవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని ఫ్రూట్స్ తో చేయడం వల్ల వాటిని సీజన్‌ కానప్పుడు కూడా తినవచ్చు. ముఖ్యంగా జామ్స్‌. ఫ్రూట్స్‌ వల్ల స్వీట్స్‌లో పీచుపదార్థం, విటమిన్‌- బి, యాంటీ ఆక్సిడెంట్స్‌ చేరతాయి. కాబట్టి వీటిని ఆరోగ్యకరమైన స్వీట్స్‌ అని చెప్పొచ్చు. ఎగ్‌లెస్‌ కేక్‌లో శక్తి అధికంగా ఉంటుంది. వెజిటేరియన్స్‌ కూడా నిర్భయంగా తీసుకోవచ్చు
కొంతమందికి హాట్‌ కన్నా స్వీట్స్‌ తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. మరి అలాంటప్పుడు రొటీన్‌గా ఉండే స్వీట్సే కాకుండా.. అప్పటికప్పుడు ఇంట్లో ఉండే ఫ్రూట్స్‌తో స్వీట్స్‌ తయారుచేసుకోవచ్చు. ఇవి త్వరగా కూడా అయిపోతాయి.. అంతే కాదండోయ్‌ ఆరోగ్యానికి ఆరోగ్యం. శరీరానికి అందాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. మరి అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…

– యాపిల్‌ జిలేబి
కావల్సిన పదార్థాలు : యాపిల్‌ – ఒకటి, కుంకుమపువ్వు – ఒకటిన్నర టేబుల్‌స్పూను, నీరు – మూడు కప్పులు, నెయ్యి – కప్పు, గార్నిష్‌ కోసం పిస్తాలు – టేబుల్‌స్పూను, ఆల్‌పర్పస్‌ ఫ్లోర్‌ – రెండు కప్పులు, పంచదార – కప్పు.

తయారుచేసే విధానం : ముందుగా ఒక గిన్నె తీసుకుని, అందులో ఆల్‌పర్పస్‌ ఫ్లోర్‌ తీసుకోవాలి. అందులో కప్పు నీటిని పోసి బాగా కలుపుకుని, ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌపై పాన్‌ పెట్టుకుని, రెండు కప్పుల నీటిని పోసుకుని, వేడి చేసుకుని నీరు బాగా తెర్లుతున్న సమయంలో పంచదార వేసుకోవాలి. కాసేపు మరగనిచ్చి, పంచదార పాకం తయారుచేసుకోవాలి. ఇందులో చివరగా కుంకుమపువ్వు వేసుకుని, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు యాపిల్‌ని శుభ్రంగా కడిగి రౌండ్‌గా కట్‌ చేసుకోవాలి. స్టౌపై పాన్‌ పెట్టుకున్న డీప్‌ ఫ్రైకి సరిపడా నెయ్యి పోసుకుని, వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకున్న ఆల్‌పర్పస్‌ ఫ్లోర్‌ పిండిలో యాపిల్‌ ముక్కల్ని డిప్‌ చేసుకుని, కాగిన నెయ్యిలో వేసుకుని బంగారు వర్ణం వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార సిరప్‌లో వేసుకోవాలి. తినబోయే ముందు పైన పిస్తాపప్పుల తురుము చల్లాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలూ ఎంతో ఇష్టంగా తింటారు.

– ఎగ్‌లెస్‌ కేక్‌
కావల్సిన పదార్థాలు : మైదా – ఒకటిన్నర కప్పు, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్‌ – 10, పాలపొడి – మూడు టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ పౌడర్‌ – రెండు టేబుల్‌స్పూన్లు, బేకింగ్‌ సోడా – అర టేబుల్‌స్పూను, వెన్న – అరకప్పు, పంచదార పొడి – ముప్పావు కప్పు, పాలు – కప్పు, వెనీలాఎసెన్స్‌ – టేబుల్‌ స్పూను, కోకో పౌడర్‌ – రెండు టేబుల్‌స్పూన్లు, వేడి నీరు – రెండు టేబుల్‌స్పూన్లు.

తయారుచేసే విధానం : ముందుగా ఒక గిన్నె తీసుకుని, మైదా పిండి, బేకింగ్‌ సోడా, వెన్న, పంచదార పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులోనే వెనీలా ఎసెన్స్‌, పాలపొడి, పాలు, వేడి నీరు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కేక్‌ తయారుచేసుకొనే ప్లేట్‌పై వెన్న రాసుకుని, పది నిమిషాలపాటు వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని వేసి, చాక్లెట్‌పొడి, పాలు, పాలపొడి కలిపింది లేయర్లుగా ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీలను నిలువుగా కట్‌ చేసి ఒక లేయర్‌లా సర్దాలి. ఇలా సర్దాక 45 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. అంతే ఎగ్‌లెస్‌ కేక్‌ రెడీ! దీనిపై చాక్లెట్‌తో డిజైన్‌ వేసుకుంటే బాగుంటుంది. ఎగ్‌ తినని వారూ ఎంచక్కా తినేయొచ్చు!

– పెసరపప్పుతో..
కావల్సిన పదార్థాలు : నెయ్యి – రెండు టేబుల్‌స్పూన్లు, పెసరపప్పు – అరకప్పు, నీరు – ఒకటిన్నర కప్పు, పాలు – కప్పు, బియ్యం పిండి – కప్పు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, పంచదార – ఒకటిన్నర కప్పు, నీరు – ఒకటిన్నర కప్పు, కుంకుమపువ్వు – కొద్దిగా, యాలకుల పొడి – పావు టేబుల్‌స్పూను, ఎండుద్రాక్షపళ్లు – 10

తయారుచేసే విధానం : ముందుగా కుక్కర్‌లో పెసరపప్పు, టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, కొద్దిగా నీటిని పోసుకుని నాలుగు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ పెసరపప్పుకి అరకప్పు నీటిని కలుపుకుని, మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు బియ్యంపిండి పోసుకుంటూ పిండి గట్టిపడేంత వరకూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్‌ పెట్టుకుని అందులో పంచదార, కొద్దిగా నీటిని పోసుకుని పంచదార పాకం చేసుకుని, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, వడల్లా ఒత్తుకోని, టూత్‌పిక్‌తో డిజైన్‌ వేసుకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌పై కొద్దిగా నెయ్యి వేసుకుని, దానిపై ఈ పెసరపప్పు వడల్ని వేసుకుని అటు ఇటూ తిప్పుకుంటూ గోల్డెన్‌ కలర్‌ వచ్చేవరకూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పంచదారపాకంలో వేసి, రెండు గంటల తర్వాత తీసి, ఎండుద్రాక్షతో గార్నిష్‌ చేసి, సర్వ్‌ చేయాలి. ఇవి నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోతాయి.

– బనానా జామూన్‌
కావల్సిన పదార్థాలు : అరటిపండ్లు (పెద్దవి) – రెండు, పంచదార – అరకప్పు, బెల్లం – అరకప్పు, నీరు – కప్పు, యాలకుల పొడి – అర టేబుల్‌ స్పూను, నూనె లేదా నెయ్యి – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారుచేసే విధానం : ముందుగా స్టౌపై పాన్‌ పెట్టుకుని అందులో పంచదార, కప్పు నీటిని పోసుకుని వేడిచేసుకోవాలి. సన్నని మంటపై పంచదార పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు యాలకులపొడిని వేసుకుని. పాకం రాగానే పక్కన పెట్టుకోవాలి. అరటిపండ్లు పైతొక్కని తీసేసి, రౌండ్‌షేప్‌లో ముక్కలు కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్‌ పెట్టుకుని డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె లేదా నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడెక్కాక అరటిపండు ముక్కల్ని ఇందులో వేసుకుని, బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి, టిష్యూ పేపర్‌పై వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిని పది నిమిషాల తర్వాత తింటే టేస్టీగా ఉంటాయి.

– మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ రవ్వ కేసరి
కావల్సిన పదార్థాలు : బొంబాయి రవ్వ – కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పు, పాలు – అరకప్పు, నీరు – రెండున్నర కప్పులు, నెయ్యి – మూడు టేబుల్‌స్పూన్లు, యాపిల్‌ ముక్కలు – కప్పు, కివి పండు ముక్కలు- కప్పు, అరటిపండు ముక్కలు – కప్పు, దానిమ్మగింజలు- అరకప్పు, యాలకుల పొడి – కొద్దిగా, కుంకుమపువ్వు – కొద్దిగా, డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదంపప్పు) – రెండు టేబుల్‌స్పూన్లు.

తయారుచేసే విధానం : ముందుగా స్టౌపై పాన్‌ పెట్టుకుని, అందులో టేబుల్‌స్పూను నెయ్యి వేసుకుని, జీడిపప్పు, బాదంపప్పుల్ని వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యి వేసుకుని రవ్వను వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరికొద్దిగా నెయ్యి వేసుకుని యాపిల్‌ ముక్కలు, కివి పండు ముక్కలు, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత నీటిని పోసి, ఉడకనివ్వాలి. నీరు కాగిన తర్వాత పాలు పోయాలి. అవి తెర్లుతున్నప్పుడు పంచదార కూడా వేసుకుని మరికొద్దిసేపు తెర్లనివ్వాలి. యాలకుల పొడిని, వేయించుకున్న డ్రైఫ్రూట్స్‌ని కూడా వేసుకోవాలి. వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న బొంబాయి రవ్వ పోస్తూ ఉండకట్టకుండా మెల్లగా తిప్పాలి. చివరిలో కొద్దిగా నెయి వేయాలి. అంతే మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ రవ్వ కేసరి రెడీ!

Scroll to Top