తెలుగు తేజం పురిపండా

తెలుగు తేజం పురిపండా అప్పలస్వామి *నవంబరు 13 పురిపండా అప్పలస్వామి జయంతి

బహుభాషావేత్త, రచయిత, పాత్రికేయులు గా గుర్తింపు పొందిన తెలుగు తేజం పురిపండా అప్పలస్వామి.  ఎన్నో అపురూప గ్రంథాల్ని తేట తెలుగు వచనంలో అందించిన ప్రతిభాశాలి ఆయన. నవంబర్ 13 పురిపండా అప్పలస్వామి జయంతి  సందర్భంగా చిరుపరిచయం ఇది…

విజయనగరం జిల్లా, సాలూరు గ్రామంలో నవంబర్ 13, 1904న పురిపండా అప్పలస్వామి జన్మించారు. అక్కడ విద్యాభ్యాసం కొంతకాలం జరిపి,  స్వయంకృషితో ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో  పాండిత్యాన్ని సంపాదించారు. అప్పలస్వామి మహాత్మా గాంధీ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, హరిజనోద్యమం, ఖాదీ ప్రచారంలో అత్యంత శ్రద్ధతో పాల్గొన్నారు. విశాఖపట్నంలో అఖిల భారత చరఖా సంఘం వారి ఖాదీ భాండాగారంలో నిర్వహకుడుగా కొంతకాలం పనిచేశారు.

పత్రికా రంగంలో కూడా తన ప్రతిభను ప్రదర్శించారు. విశాఖపట్నం నుండి వెలువడిన ‘స్వశక్తి’ అను జాతీయ వారపత్రికకు సహాయ సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు. ‘ఆంధ్రపత్రిక’ కు స్వకీయ విలేఖరిగా పన్నెండేళ్ళు వ్యవహరించారు. ‘సత్యవాణి’ పత్రికను నిర్వహించుచు ఆయన రాసిన సంపాదక వ్యాసాలు పునర్ముద్రణ పొందాయి. వీరు ప్రచురించిన ‘వైశాఖి’ మాసపత్రిక సారస్వత ప్రియుల మన్ననలను ఆర్జించింది.

గ్రంథాలయోద్యమంలో పురిపండా అప్పలస్వామి సాగించిన కృషి గణనీయం. మంతెన ఆదినారాయణ స్వామి స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ప్రథమ గ్రంథాలయాన్ని, ‘కవితా సమితి’ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశారు. శ్రీరామవరం, పార్వతీపురం లోని గ్రంథాలయాలను చాలా పెంపొందించారు. మరకాం గ్రామాన ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం యావజ్జీవ గౌరవ సభ్యులుగా పనిచేశారు.

పురిపండా అప్పలస్వామి సాహిత్య రంగంలో సాధించిన కృషి పరిగణన పొందింది.  15 ఏళ్ళ ప్రాయంలోనే తెలుగులో గద్య పద్య రచన మొదలుపెట్టారు. 1928 వరకు ఆయన గ్రాంధిక భాషావాది. గిడుగు వెంకట రామమూర్తిని కలిసిన తర్వాత , ఆయన వలన ప్రభావితుడై  తన సాహిత్య కృషిని వ్యావహారిక భాషలోనే సాగించారు. కందపద్య మయమైన ‘రాట్నపతాకం’ ఇతని తొలి రచన. వీని ప్రముఖ రచనలలో ‘సౌదామిని’ ఆంగ్లంలోకే కాక హిందీ, ఒరియా భాషలలోకి కూడా అనువదింపబడి ఎన్నో ముద్రణలు పొందింది. కేంద్ర సాహిత్య అకాడమీ కోరికపై వీరు ‘అమృత సంతానం’, ‘మట్టి మనుషులు అనే నవలలను ఒరియా నుండి తెనిగించారు. వంగ సాహిత్య చరిత్ర, ఒరియా సాహిత్య చరిత్రలను  తెలుగులో రాశారు. అలాగే ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రాసి తెలుగు సాహిత్యంతో పరిచయాన్ని ఒరియా పండితులకు కల్పించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యవహారిక భాషలో రచించుటకు పూనుకొన్న సంస్కృత భారతానువాదం ఆయన  మరణం వలన అసమగ్రంగా నిలిచిపోగా, పురిపండా అప్పలస్వామి పూనుకొని మిగిలిన పదిహేనున్నర పర్వాలను పూర్తిచేశారు.

రాట్న పతాకం, మహమ్మద్‌ చరిత్ర, సౌదామిని, ఒరియా పాటలు, జగద్గురు శంకరాచార్య, ఛెతిమాణ అఠంగుఠ, విశ్వకళావీధి, హంగేరీ విప్లవం, దేవీ భాగవతం, పురిపండా భాగవతము, పురిపండా వ్యావహారికాంధ్ర మహాభారతం, శ్రీమద్భాగవతము, వ్యావహారికాంధ్ర వాల్మీకి రామాయణం అమృత సంతానం (అనువాదం), మట్టిమనుష్యులు (అనువాదం), వంగ సాహిత్య చరిత్ర, ఒడియా సాహిత్య చరిత్ర, భగవద్గీత, ఉపనిషత్సారం…ఇలా పురిపండా మొత్తం అరవై రచనలు చేశారు.వీటిలో పులిపంజా కవితాసంపుటి ఓ విస్ఫులింగం. లండన్‌ నుంచి విదేశాంధ్ర ప్రచురణగా ఇది వెలువడిరది. 41 కవితల సమాహారమిది. సాంఘిక దురన్యాయాలపై పంజా విప్పిన కవి బెబ్బులి పురిపండా.

జాతీయోద్యమంలో కార్యకర్తగా పనిచేయడం వల్ల బూజులా వేళ్లాడుతున్న సనాతన భావాలపై తిరుగుబాటు చేశారు.‘నా గేయం/ మీ కవనం/ మీ ఖడ్గం నా గేయం/ కుబుసం వొదిలిన సర్పం/ నా గీతం పులిపంజా’ అంటూ సమాజానికి ప్రగతి కవితా సందేశాన్నిచ్చారు.

‘గుడిలోని దైవమా! ఆలింపవోయి/ గుడిలోని దయ్యమా! పైకి రావోయి/ నీ పాదపూజకై/ వెదకి తెచ్చిన పూలు/ నీ పాదసేవకై/ నింపి తెచ్చిన నీళ్లు/ పనికి రావంటారు/ మైలపడెనంటారు’ ఇలా సాగుతుందీ ‘గుడిలోని దైవమా’ గేయ కవిత. ఆనాటి సమాజంలో బుసలు కొడుతున్న అస్పృశ్యతపై తీవ్రంగా చలించి రాసిన ఈ కవిత నాటి సాహితీ సభల్లో అందరినీ కదిలింపజేసింది. హరిజనోద్ధరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపునకు స్పందించి రాసిన ఈ కవితను ఆంగ్లంలో అనువదించి గాంధీజీకి వినిపిస్తే ఎంతో మెచ్చుకున్నారు.

‘ఇక్కడ అడుగు పెడితే/ ఎందుకో నా వొళ్లు/ కంపరమెత్తుతుంది/ ఖద్దరు వొదిలేసి/ కత్తి పట్టాలనిపిస్తుంది/ అహింస అబద్ధమనిపిస్తుంది… భగత్సింగులాగ/ విప్లవకారుణ్ణయి/ ఎర్రజెండా ఎత్తాలనిపిస్తుంది/… పద్మనాభం గాలి నిండా/ వీరగాథ వినిపిస్తుంది/ పద్మనాభం ధూళినిండా/ వీరరక్తం కనిపిస్తున్నది’ అనే ఖండికను ఎంతో భావోద్వేగంతో రాశారు. కుంఫిణీ దొరల కుతంత్రాలను ప్రతిఘటించి పూసపాటి విజయ రామరాజు పద్మనాభం (విశాఖ జిల్లా) వద్ద యుద్ధం చేసి వీరమరణం పొందారు. ఈ ఉదంతం పురిపండా మనసును ద్రవింపజేసింది. అమరవీరుని త్యాగానికి నివాళిగా రాసిన స్మృతిగీతం అది.

పురిపండా అప్పలస్వామి విశాఖ రచయితల సంఘానికి కొంతకాలం అధ్యక్షుడిగా పనిచేశారు. అఖిల భారత పి.ఇ.ఎస్. సంస్థలో, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీలో, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో కార్యవర్గ సంఘాలలో పనిచేశారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారం ప్రదానం చేసింది. పురిపండా అప్పలస్వామి నవంబర్ 18, 1982 న కాలధర్మం చెందారు.

Scroll to Top