అసమాన ప్రతిభాశాలి

30-05-2024 – అసమాన ప్రతిభాశాలి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి.

దేశంలో విద్వత్కవులుగా కీర్తి ప్రతిష్ఠ లార్జించినవారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అట్టివారిలో గుంటూరు శేషేంద్ర శర్మ ఒకరు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, భాషాపరశేషభోగి. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషా సాహిత్యాలలో నిష్ఠాతులేగాక, హిందీ, ఉర్దు సాహిత్యాలలో సహితం గణనీయమైన కృషి చేశారు. మే 30 ఆయన వర్థంతి. ఈ సందర్భంగా ఆయన సాహితీ ప్రతిభ విహంగవీక్షణంగా..

శేషేంద్రశర్మ ఎంత గొప్ప కవియో, అంతటి గొప్ప విద్వాంసుడూ, విమర్శకుడు అనడంలో ఎలాంటి భిన్నాభిప్రాయము లేదు. ప్రముఖ కవిగా, మహాపండితునిగా, గొప్ప విమర్శకునిగా ఆయన ప్రదర్శించిన ప్రతిభ అనన్య సామాన్యము. ప్రపంచ సాహిత్య ధోరణులను అవగాహన చేసుకొని, విస్తృత దృక్పథాన్ని అలవరచు కొని, కవితారంగంలోను విశ్వజనీన ప్రవృత్తిని ప్రకటించారు. నూతన కవితా ‘వాహిక’ చేబట్టి కవితా రంగంలో నూతన శకాన్ని సృష్టించారు. ఆధునిక కవితా రంగంలో ‘మండేసూర్యుని’ గా శేషేంద్రశర్మని అభివర్ణించారు శ్రీశ్రీ . తన కాలం వరకు ఉన్న కవితా ధోరణులను పూర్తిగా అకళింపు చేసుకొని, నాటికి లేనిదాన్ని సృజించి అభివృద్ధి చేయడమే వినూత్న శక్తిగా పరిగణిస్తారు శేషేంద్రశర్మగారు. శ్రీశర్మగారి కలం నుండి అనేక రచనలు ప్రవహించాయి. రచనలన్ని కలిపి దాదాపు 40కి పైగా ప్రచురిత మయ్యాయి.

శేషేంద్రశర్మ వృత్తి రీత్యా ప్రభుత్వోద్యోగి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్ కమీషనరుగా పని చేశారు. ప్రవృత్తి మాత్రం సాహిత్యం. వారి సాహిత్య జీవితం అత్యంత మహోన్నతమైనది. శ్రీనాథ మహాకవి వలె నూనూగు మీసాల నాడే అంటే 20వ ఏటనే (1947లో) రచనా వ్యాసంగం మొదలెట్టారు. అనువాద కావ్యం “సొరాబు” తో ఆయన సాహిత్య ప్రస్థానం ఆరంభ మయింది. తర్వాత 1961వ సంవత్సరంలో “చంపూవినోదిని” పద్య కావ్యం ప్రచురిత మయింది. ఆ కావ్యం ఆయన ఆశు కవిత్వ పటిమకు, పాండిత్య ప్రకర్షకు అద్దం పడుతుంది. శేషేంద్రశర్మ 11 పద్య కావ్యాలు, 12 విమర్శనా గ్రంథాలు రచించి పేరు ప్రతిష్ఠలు ఆర్జించారు.

నాదేశం – నాప్రజలు, శేషజోత్స్న, రక్తరేఖ, ఆధునిక మహాభారతం, జనవంశం, స్వర్ణహంస, షోడశి – రామయణ రహస్యాలు, మండే సూర్యుడు, కవిసేన మేనిఫెస్టొ శేషేంద్రశర్మ విశిష్ఠ రచనలుగా పేర్కొంటారు పండితులు

సాహిత్య వ్యాసంగం లో ప్రయోగాలు చేయుట శేషేంద్రశర్మకి అత్యంత ప్రీతి కరమైన విషయం. ఆధునిక సాహిత్యంలో కావ్యేతిహాసాలు లేని లోటును తీర్చే ఉద్దేశ్యంతో శేషేంద్రశర్మ “ఆధునిక మహాభారతము (నాదేశం-నాప్రజలు) రచించారు. విలక్షణ ప్రక్రియ అయిన “వచన కవితా వాహిక” ద్వారా ఒక అద్భుత కావ్యాన్ని సృష్టించి ప్రపంచ స్థాయి రచయితగా నిలచారు శేషేంద్రశర్మ. సామాజిక చైతన్యాంశాలను సాహిత్యంలో ప్రవేశ పెట్టి విలువలను పెంచడమే కాక, ఒక నూతన ప్రక్రియ ఆధునికులకు పరిచయం చేశారు. ఇతిహాస నిర్మాణానికి బాధానుభూతి పూర్వక బలి కావాలి. నేనే ఆబలి! నా వయస్సు నా పాండిత్యం, నా ప్రతిభ, నా అనుభవం సర్వస్వం పిండి, మాటల గొంతుల్లో పోసిన నా రక్తం ఈ ఇతిహాసం. ప్రపంచ మానవుల్ని, వాళ్ళ చరిత్రల్నీ, వాళ్ళ జయాప జయాల్నీ, వాళ్ళ భూత భవిష్యద్వర్తమానాల్నీ, అన్నిటినీ అనుభవ జ్ఞాన నేత్ర ద్వయంతో అవలోకన చేసి, ఆ విశ్వ దృశ్యం నుంచి ఈ తాత్పర్యం పిండాను” అంటారు ఆయన నాదేశం-నాప్రజలు గురించి ప్రస్తావిస్తూ!

శేషేంద్రశర్మ “వేదనా జీవితం నుండి ప్రేమోప జీవిగా మారిన తరుణంలో రచించిన రచన “శేషజ్యోత్స్న”. ఇది ఇరువది కవితల ఖండ కావ్యం. దీనికి శేషేంద్రశర్మగారు రచించిన ఉపోద్ఘాతం “నేనూ – నా నెమిలీ లేక నెమిలీ – నా నేనూ” విశేషించి పేర్కొన దగినది. ప్రేమ కూడా ఒక తపస్సే! విరహావస్థలో కంటే, సాఫల్యంలో దాన్ని తపస్సుగా, దర్శనంగా, ఆత్మ సంస్కారంగా, అనుభవించుట గొప్ప సంస్కార వంతుల విశేషం. అట్టివారు అరుదుగా వున్నారు. సాధారణంగా ప్రేమ తపస్వులైన కవులు విరహులే! శేషజ్యోత్స్న కవితా ఖండికలలో ఎక్కడ చూచినా ప్రేమ సాఫల్యానుభూతి కవితా మధు స్రవంతిగా ప్రవహిస్తుంది.

రక్తరేఖ (నాడైరీ) పుస్తకం శేషేంద్రశర్మ తన స్వంత ఉపయోగం కోసం వ్రాసుకొన్న చిత్తు పుస్తకం . దాన్ని యథా తధంగా ప్రచురించారు. ఇందులో తత్వ విచారమూ, తెలుగు దేశంలో కవిత్వం పట్ల ప్రబలిన అపోహల ఖండనమూ ప్రథాన భాగాలు. కవిగా భావకుడుగా శేషేంద్రశర్మ లో జరిగిన పరివర్తన తెలుసు కొనుటకు “రక్తరేఖ” ఉపకరిస్తుంది. ఆయన హృదయ పరిణతిని “రక్తరేఖ” కావ్యం వివరంగా చిత్రిస్తుంది. ఈ పుస్తకం 1974వ సంవత్సరంలో ప్రచురిత మైనది.

శేషేంద్రశర్మ కవితా ప్రతిభను విశ్వనాథ మొదలు పుట్టపర్తి నారాయణాచార్యుల వరకు ప్రశంసించని వారు లేరు. ఆయన కవితలో శ్రీనాథ మహాకవి చందో బద్ధత, ముక్తచ్ఛంద రచనలో బాలగంగాధరతిలక్ తో సాదృశ్యము కనిపిస్తుంది. భాషా సౌందర్య రహస్యం ఆధునికుల్లో శేషేంద్రశర్మకూ, తిలక్ కూ తెలిసి నంతగా మరెవరికి తెలియదని ఆర్.యస్.సుదర్శనం వంటి విమర్శకుల అభిప్రాయం. కొందరు విశేషజ్ఞులు ఋతుఘోషను శేషేంద్ర హృదయ వేదంగా అభివర్ణించారు. ఒక విధంగా ఆలోచిస్తే “ఋతుఘోష” పేరులోనే కనిపిస్తున్న “ఘోష” దీనికి అంతస్సూత్రం. ఒకానొక “ఆర్తి” దీనికి జీవనాడి! శరీరాన్ని “కారాగారంగా” భావించి ఎక్కడికో ఎగిరి పోవడానికి ఆకాంక్షించే తత్త్వం. అది అసాధ్యమైన నిర్వేదం దీనిలో కనిపిస్తాయి.

స్వర్ణహంస వ్యాస సంపుటి 1968వ సంవత్సరంలో వెలువడింది. ఇది సంస్కృతంలో హర్షభట్ట (శ్రీ హర్షుని) ని విరచిత మైన “నైషధ మహాకావ్యం” యొక్క విశ్లేషణాత్మక విమర్శ. పక్షులు అనే కవితా సంపుటి 1970వ సంవత్సరంలో ప్రకటిత మైనది.షోడశి – రామాయణ రహస్యాలు విషయానికొస్తే షోడశి అనే పేరు “శ్రీ విద్య” కు సంబంధించినది. శ్రీవిద్య మహాతంత్రానికి సంబంధించిన గొప్ప విద్య. గ్రంథ మంతటి లోను మంత్ర విద్య, యోగములకు సంబంధించిన వివరములు చర్చించబడినవి. ఈ పుస్తకానికి వ్రాసిన మున్నుడిలో విశ్వనాథ సత్యనారాయణ చివరి అధ్యాయము లోని దేవి స్తోత్ర శ్లోకమును పేర్కొని, దానికి శర్మ వ్యాఖ్యానించిన విధానాన్ని ప్రశంసించి, వ్యాఖ్యానము లోని విశేషాలను గూర్చి విశదీకరించారు.

మండే సూర్యుడు అనే శేషేంద్ర కవితా సంపుటి 1974 లో వెలువడింది. ఈ సంపుటి కార్య కలాపాలలో ఆయన శ్రీమతి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిరి పాత్ర వహించారు.
“సూర్యుడు ఉదయించకపోతే – మండే నాగుండె చీల్చి దానిమీద పెడతా”
సూర్యుడు కాంతి హీనుడయితే ప్రజ్వలించే తన గుండెనే చీల్చి సూర్యుడి స్థానంలో నెల కొల్పుతా నంటుంది చేమటబిందువు!
“ఎఱ్ఱటి నా కండలతో ఎండలు కాయిస్తా” అన్న వ్యాక్యంతో ఈ కవిత పరాకాష్ఠ నందుకొంటుంది. ఈ ముగింపు వాక్యం తోనే మండేసూర్యుడు అనే కావ్య నామం సార్థక్యత పొందుతుంది.

సమకాలీన ప్రపంచ సాహిత్య రీతులను గూర్చి శర్మగారి అవగాహన అత్యంత విస్తృత మైనది. తెలుగు భాషా సాహిత్యాల పైనేగాక శర్మ ఆంగ్లభాషా సాహిత్యాదులలో, హిందీ – ఉర్దూ భాషా సాహిత్యాలలో ఆర్జించిన జ్ఞానం శ్లాఘనీయం. శర్మగారి కవిత్వ తత్వం పేర్కొన దగినది. కవిత్వానికి వస్తు స్వరూపాన్ని బట్టి రూపం, రూపాన్ని అనుసరించి స్వభావం ఉంటుందని వారి నమ్మకం. అదే కవిత్వమని శేషేంద్ర ప్రకటించారు. శర్మ మనిషి తత్వాన్ని కవిత్వతత్వంగా మలచిన మహాకవి. దేశ పౌరుని ఆత్మ కథే ఆదేశ చరిత్ర అవుతుందని నిరూపించడానికే ఆయన ఆధునిక మహాభారతం వ్రాశారు.

Scroll to Top