సినీగీతాల్లో దీపావళి వెలుగులు

‘చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి…’ ఇది ఎంతో ప్రజాదరణ పొందిన సినీగీతం…ఇలాంటి గీతాలెన్నో సినీవినీలాకాశంలో వెలుగు రవ్వలను విరజిమ్మాయి. దీపావళి సందర్భంగా అటువంటి కొన్ని పాటలను గుర్తుచేసుకుందాం…

‘చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి’ ఈ పాట దీపావళి పాటల్లో చాలా పాపులర్ అయిన పాట. ‘విచిత్రబంధం’ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఈ పాటకు కేవి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఘంటసాల, పి.సుశీల ఈ పాటను పాడారు. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, ఎస్వీ.రంగారావు, గుమ్మడి, నాగయ్య, అంజలీదేవి, సూర్యకాంతం, పద్మనాభం వంటి మహామహులు ఈ సినిమాలో నటించారు. ఆదుర్తి సుబ్బారావుగారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలోని ఈ పాటలో అక్కినేని, వాణిశ్రీ అద్వితీయమైన నటన ఆవిష్కరించారు.

సంఘర్షణ సినిమాలో ‘సంబరాలో సంబరాలు దీపాళీ పండగ సంబరాలు’ అనే పాటను పేదలంతా పండుగ ఆనందంగా జరుపుకునే నేపథ్యంలో సాగుతుంది. ఈ పాటలో చిరంజీవి, విజయశాంతి కనిపిస్తారు.

1990 అక్టోబర్ 19 న ‘ఇంటింటి దీపావళి’ సినిమా విడుదలైంది. పి.లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చంద్రమోహన్, ప్రభాకర్ రెడ్డి, సురేష్, వైజయంతి, దివ్యవాణి, విజయలలిత, ప్రభాకర్ రెడ్డి నటించారు. ఈ సినిమాలో ‘కిల కిల జీవితం సాగనీ సాగనీ తీయగా’ అంటూ ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ బృందం పాడిన పాట సందడిగా సాగిపోతుంది. జాలాది ఈ పాటను రాశారు.

పెళ్లికానుక సినిమాలోని ‘ఆడే పాడే పసివాడ ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’ అంటూ ఒక పాట దీపావళి సందర్భంలో ఆహ్లాద భరితంగా సాగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి నటించిన ఈ సినిమాలోని ఈ పాటను చెరువు ఆంజనేయశాస్త్రి రాసారు. ఏఎం.రాజా, పి.సుశీల పాడారు. ఎప్పుడు ఈ పాట విన్నా, చూసినా పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘మామగారు’ సినిమాలో ‘ఇయ్యాలే అచ్చమైన దీపావళి వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి’ అంటూ పాట సాగుతుంది. 1991 లో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ‘నాన్ పుడిచా మాపిళ్లై’ అనే తమిళ సినిమాకి రీమేక్‌గా తీశారు. దీపావళి పండుగను వేడుకగా జరుపుకుంటున్నట్లు చిత్రించిన ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా రాజ్-కోటి సంగీతం అందించారు. బాలు, స్వర్ణలత, బృందం పాడారు.

‘షావుకారు’ సినిమాలోని ‘దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి’ అంటూ సాగే పాటలో వీధులన్నీ దీపాల కాంతుల్లో మెరిసిపోతుంటే ప్రజలంతా బాణాసంచా కాలుస్తూ కనిపిస్తారు. షావుగారు జానకి, ఎన్ టి.రామారావు నటించిన ఈ సినిమాలోని ఈ పాటలో ఆ కాలం నాటి అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి

భానుమతి, చంద్రమోహన్, సుహాసిని, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ముద్దుల మనవరాలు’ ఈ సినిమాలోని ‘ఇన్నాళ్ళకు వచ్చిందో దీపావళి.. మమతల దీపావళి దీప కవితావళి’ అంటూ సుహాసిని డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. జంధ్యాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని పాటలకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించారు. ఇలా అనేక పాటలు దీపావళి సందర్భాన్ని పరిపూర్ణం చేస్తూ కనువిందుగా, వీనులకు హాయిగా, మనసులకు మధురంగా తాకుతాయి.

Scroll to Top