
నిద్రపోయే విధానం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి నిద్ర ఎంత అవసరమో.. అదే విధంగా ఆరోగ్యకరంగా సరైన స్థితిలో నిద్ర అంతే అవసరం. ప్రతీ ఒక్కరూ ప్రశాంతంగా నిద్ర పోవటం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అందులోనూ ఎడమ వైపు పడుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుంది. ఈ విధానం ద్వారా జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.
*ఎడమ వైపు పడుకోవడం వల్ల వెన్ను నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఈ స్థానం వెన్నెముకకు మద్దతు ఇస్తుంది. వీపుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది పేగులు, ప్రేగు కదలికలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
*కుడి వైపు పడుకోవటం.. లేదా బోర్లా పడుకోవటం ద్వారా జీర్ణక్రియ సరిగా జరగకపోవడం, గాలి నిల్వలు ఏర్పడడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
*గుండె ఎడమ వైపున ఉండటం వల్ల గుండె పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగి గుండెకు మేలు జరుగుతుంది. ఒత్తిడి తగ్గడంతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. రక్త ప్రవాహం మెరుగుపడటం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచి, అలసట తగ్గిస్తుంది.
*గురక సమస్య చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. అలసట ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సహజంగా వస్తుంది కానీ కొంతమందికి ప్రతిరోజూ ఇదే సమస్యగా మారుతుంది. అలాంటి వారు ఎడమ వైపు నిద్రించడం మంచిది. ఈ స్థానం శ్వాస మార్గాలను తెరుచుకునేలా చేస్తుంది. ఫలితంగా గాలి సరిగా ప్రవహించి గురక తగ్గిపోతుంది. ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.
*ఎడమ వైపు నిద్రించడం కాలేయం, మూత్రపిండాలు, కడుపు పనితీరుకు కూడా మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్థితిలో పడుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అందువల్ల ఎడమ వైపు నిద్రించే అలవాటు పెంచుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, వెన్ను ఆరోగ్యం, నిద్ర నాణ్యత అన్నీ మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.
