ఈ మధ్యకాలంలో రకరకల కారణాల వల్ల చాలామందిలో గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా పెరిగిపోతోంది. ఈ సమస్య వయో బేధం లేకుండా చాలామందిలో ఉంటోంది.
రాత్రి నిద్ర పోయే సమయంలో కడుపులో గ్యాస్ ఉత్పత్తి పెరిగిపోతే సరిగ్గా నిద్ర పట్టదు. చాలామందికి కడుపులో మంటగా ఉంటుంది. అయితే రాత్రిపూట కడుపులో గ్యాస్ ఎందుకు ఏర్పడుతుంది. దానికి గల కారణాలు నిపుణుల మాటల్లో ఇలా ఉన్నాయి. కొందరికి రాత్రి పూట ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. దీంతో కడుపులో గ్యాస్ ఏర్పడడం వేగంగా జరుగుతుంది. సాధారణంగా రాత్రి పూట పార్టీలు, విందులకు బయటకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ పరిస్థితులలో సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. విందులో ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ పెరుగుతుంది. ఇది తినడం వల్ల కడుపుకు అసలు మంచిది కాదు.
ఆహారం జీర్ణం కావడానికి కనీసం 6 గంటల సమయం పడుతుంది. అయితే సాయంత్రం స్నాక్స్ లో ఎక్కువ నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలను తింటే రాత్రి భోజనం తర్వాత కడుపులో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల్లో నడవండి. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొందరికి ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడి కడుపులో గ్యాస్ మొదలవుతుంది. మీరు రోజంతా 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగకపోతే ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది గ్యాస్ సమస్యను పెంచడానికి కారణమవుతుంది. అందుకే లంచ్, డిన్నర్ టైమింగ్ కచ్చితంగా పాటించడం మంచిది. రాత్రిపూట ఎప్పుడు హెవీ లేదా ఆయిల్ ఫుడ్ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.