ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఉన్నాం. నిత్యం కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు వాడే వారి సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం వాటి స్క్రీన్ల వైపు చూస్తూ పని చేసుకోవడం వల్ల కళ్లపై భారం పడుతోంది. ప్రస్తుతం ఎక్కువ శాతం ఉద్యోగాల్లో శరీర శ్రమ తక్కువగా ఉండటంతో కళ్లపై ఒత్తిడి ఎక్కువ అవుతోంది. కనీసం పని లేనప్పుడైనా కళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా.. టీవీలు, స్మార్ట్ ఫోన్లు చూస్తూ గడిపే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. నిద్రపోయిన సమయంలో తప్ప కంటికి అసలు రెస్ట్ అనేది లేకుండా పోతోంది. ఇలాంటి వారిలో మొదటిగా వచ్చే సమస్య డ్రై ఐ సిండ్రోమ్. అంటే కళ్లు పొడిబారడం.
మన కంటి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర లాక్రిమల్ గ్రంథులదే. దీని నుంచి ఉత్పత్తి అయ్యే లిక్విడ్స్ ఎప్పటికప్పుడు మన కళ్లను శుభ్రపరిచి కాపాడుతుంటాయి. అయితే, కళ్లకు రెస్ట్ ఇవ్వకపోతే తగినంత నీళ్లు ఉత్పత్తి అవక కళ్లు పొడిబారుతుంటాయి. ముఖ్యంగా ఐదు నుంచి ఆరు గంటల పాటు స్మార్ట్ ఫోన్స్ వాడే వారిలో ఈ సిండ్రోమ్ కారణంగా కళ్లు పొడిబారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కళ్లు మంటగా ఉండటం, తరచుగా దురద రావడం, ఎర్రగా మారడం, మసకగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి కళ్లు మూసుకొని పోతుంటాయి. కళ్లు ఉబ్బి.. నీళ్లు రాకపోవడం వంటివి డ్రై ఐస్ లక్షణాలు. దీనిని మొదట్లోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
కాలుష్యంలో ఎక్కువగా తిరిగినా, సీ-విటమిన్ లోపించినా, కాంటాక్ట్ లెన్స్ ఎక్కువగా వాడినా, స్మోకింగ్ ఎక్కువగా చేసినా, కంప్యూటర్‌పై ఎక్కువగా పని చేసినా, యాబై ఏళ్లు నిండిన మహిళలు, బీపీ, అలర్జీ, మానసిక వ్యాధికి సంబంధించిన, గర్భనిరోధక మందులు వాడే వారితో పాటు.. కీళ్ల నొప్పులు, డయాబెటిస్ ట్యాబ్లెట్స్ వాడే వారిలో డ్రై ఐస్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డ్రై ఐస్ నుంచి కళ్లను కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
బయటకు వెళ్లే సమయంలో దుమ్ము, ధూళి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ పెట్టుకోండి. సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి కూడా ఈ సన్ గ్లాసెస్ కాపాడుతాయి. ఇక కంప్యూటర్‌పై ఎక్కువగా పని చేసే సమయంలో కాంటాక్ట్ లెన్స్‌ను ఎక్కువగా ఉపయోగించవద్దు. దీని వల్ల కళ్లు పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీకటిగా ఉండే రూములు, ఏసీ గదుల్లో ఎక్కువ సేపు పని చేయవద్దు. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం కళ్లకు మంచింది. కంప్యూటర్, మొబైల్ ఫోన్లు వాడే సమయంలో చాలా మంది కనురెప్ప వేయకుండా అదే పనిగా చూస్తుంటారు. ఇలా చేస్తే కళ్లు పొడిబారతాయి. అందుకే కనురెప్పలను నిత్యం ఆడిస్తుండాలి. ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ను అయినా నిత్యం వాడకుండా.. గ్యాప్ ఇస్తుండాలి. అలాగే స్క్రీన్లను చూసే సమయంలో యూవీ రేస్ నుంచి కాపాడే బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసులను ఉపయోగించాలి.
టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం అవసరం. చక్కెర ఎక్కువగా ఉండే పానియాలు, స్వీట్స్ తీసుకోవడం తగ్గించాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలను వాడటం తగ్గించాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తగ్గించాలి. ఇవన్నీ కళ్లను పొడిబారేలా చేస్తాయి. ఆకు కూరలు కంటికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతీ రోజు ఒక ఆకు కూర తినేలా చూసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండా సాల్మన్, ట్యూనా, సార్డినెస్, ట్రౌట్, మ్యాకరెల్ చేపలు ఎక్కువగా తినాలి. వాల్నట్స్, బాదాం, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, అవకాడోలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రతీ రోజు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇవన్నీ మన శరీరంలో తేమ ఎక్కువగా ఉండేలా చేస్తాయి. దీని వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.