గుండెపోటు వచ్చే ముందు…లక్షణాలివే!


గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలివే!
************************
ప్రపంచంలో ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులు లేదా గుండెపోటు. ప్రతి ఏడాది దాదాపు 1.79 కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయని దక్షిణ కొరియా, అమెరికా పరిశోధకులు జరిపిన తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వీరి అధ్యయనంలో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చిన వ్యక్తులలో దాదాపు 99 శాతం మందిలో సంవత్సరాల ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించాయి. అధిక రక్తపోటు, అధిక చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ లేదా పొగతాగే అలవాటు వంటి రూపంలో ఈ సంకేతాలు బయటపడతాయి. ఈ సంకేతాలు సకాలంలో గుర్తించి, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణులు చెబుతున్న దానిని బట్టి గుండె సంబంధిత వ్యాధులు నెమ్మదిగా, నిశ్శబ్దంగా పెరుగుతాయి. తొలి దశలో కనిపించే కొన్ని లక్షణాలు చిన్నవిగా లేదా సంబంధం లేనివిగా అనిపించవచ్చు. అందుకే చాలా మంది వాటిని విస్మరిస్తారు. కానీ ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేమిటంటే: చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం. కొద్ది దూరం నడిచినా లేదా మెట్లు ఎక్కినా ఆయాసం రావడం. గుండె దడదడలాడటం లేదా లయ తప్పినట్లు అనిపించడం. పదేపదే గుండెల్లో మంట, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్. నడుస్తున్నప్పుడు కాళ్ళలో తిమ్మిరి లేదా నొప్పి. దవడ, చేయి లేదా ఛాతీలో బిగుతుగా అనిపించడం. అకస్మాత్తుగా చెమట పట్టడం లేదా కారణం లేకుండా ఆందోళనగా అనిపించడం…వంటివి అందులో కొన్ని.

పరిశోధకులు 90 లక్షలకు పైగా దక్షిణ కొరియన్లు, వేలాది మంది అమెరికన్లపై 20 ఏళ్లుగా అధ్యయనం చేశారు. గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె సంబంధిత తీవ్రమైన సమస్య రాకముందు దాదాపు ప్రతి ఒక్కరిలో కనీసం ఒక సంకేతమైనా ఉండేదని కనుగొన్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా బ్లడ్ షుగర్‌లో స్వల్ప పెరుగుదల కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Scroll to Top