పెర్త్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెడ్జ్ దీవుల్లో వెడ్జ్ దీవుల తీరంలో…
ఇప్పుడు ఇంటర్నెట్, ఇమెయిల్స్ వచ్చాక ఉత్తరం అంటే ఏమిటో మరిచిపోయే స్థితికి వచ్చేశాం. తపాలా వ్యవస్థ కూడా అంత అభివృద్ధి చెందని కాలం నాటి ఉత్తరం ఒకటి ఉన్న సీసా తాజాగా వెడ్జ్ దీవుల్లోని తీరంలో బయటపడింది. సీసాలో లేఖ అనగానే తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన శివమణి సినిమా గుర్తుకొచ్చింది కదా….. అందులో హీరోయిన్ తన ప్రేమ గురించి ఒక లేఖ రాసి దానిని సీసాలో పెట్టి సముద్రంలో పారేస్తుంది.. అది ఓ రిపోర్టర్‌కు దొరుకుతుంది.. ఇలాగే ఆస్ట్రేలియాలోనూ నాలుగు రోజుల కిందట ఓ సీసా దొరికింది. పెర్త్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెడ్జ్ దీవుల్లోని బీచ్‌లో ప్రముఖ ఫార్ములా వన్ రేసర్ డానియల్ రిక్కియార్డో బృందానికి లేఖతో ఉన్న సీసా దొరికింది. ఆ లేఖ గురించి ఆరా తీయగా దాదాపు 132 ఏండ్ల కిందట రాసినట్టుగా గుర్తించారు. ఇలా సీసాల్లో దొరికిన లేఖల్లో ఇదే పురాతనమైనదని తేల్చారు. సీసాను తెరిచి లేఖను చదవగా అది జర్మన్ భాషలో రాసి ఉన్నట్టు గుర్తించారు. గూగుల్ ట్రాన్స్‌లేట్ ద్వారా దానిని చదివి… ఈ లేఖను 1886 జూన్ 12న రాసినట్టు గుర్తించారు. ఆ తర్వాత పలు మ్యూజియంలను సంప్రదించి వివరాలు సేకరించగా.. 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియా పడమటి తీరానికి 950 కిలోమీటర్ల దూరంలో జర్మనీకి చెందిన బార్క్ పౌలా అనే ఓడ నుంచి దీనిని జారవిడిచినట్టు గుర్తించారు.