ఇమ్యూనిటీని కాపాడే మష్రూమ్స్‌

కోవిడ్ కొత్త రూపు సంతరించుకుని ఒమిక్రాన్ గా ప్రపంచంలో మళ్లీ అలజడి రేపుతోంది. ఈ థర్డ్ వేవ్ సమయంలో తగినంత ఇమ్యూనిటీ ప్రతి ఒక్కరికీ అవసరమే. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. కుళ్లిపోతున్న పదార్ధాలున్న చోట ఇవి సహజంగా పెరుగుతుంటాయి. ప్రత్యమ్నాయ మార్గాల్లోనూ వీటిని సాగుచేస్తున్నారు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో తినదగినవి, తినకూడనివి కూడా ఉంటాయి. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయి . కొన్ని రకాలు విటమిన్‌ ‘డీ ఉత్పత్తికి సహకరించేవిగా పనిచేస్తాయి.

మష్రూమ్స్‌లో క్యాలరీలు తక్కువ, ప్రోటీన్ ఎక్కువ. అందుకనే వెయిట్ లాస్ డైట్‌లో వీటికి ఎంతో పాపులారిటీ ఉంది. మష్రూమ్ అనగానే మనసులో… చిల్లీ మష్రూమ్, మష్రూమ్ మసాలా, బటర్ మష్రూమ్, మష్రూమ్ సూప్ లాంటివి అందరూ కామన్ గా చెప్పే సమాధానాలు. ఈ వంటకాలు తేలికగా ఉంటాయి, మంచి రుచిగా ఉంటాయి, ఎంతో మంది వీటి టేస్ట్ కి ఫిదా అయిపోతూ ఉంటారు. ఈ వంటకాల పేరు చెబితేనే నోరూరిపోతుంది. నిజానికి మష్రూమ్స్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఇద్దరికీ కూడా బాగా నచ్చే ఐటెమ్. వీటిని ఏ డిష్‌కి యాడ్ చేసినా ఆ డిష్ టేస్ట్ అమాంతం పెరిగిపోతుంది. పైగా మష్రూమ్స్ ని ప్రపంచవ్యాప్తం‌గా వంటల్లో వాడతారు.మష్రూమ్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల ఇవి అరుగుదలకి సహకరిస్తాయి, మెటబాలిజం‌ని రెగ్యులేట్ చేస్తాయి. ఫలితంగా బాడీ హెల్దీ గా ఉంటుంది.

సూపర్ ఫుడ్
మష్రూమ్స్ కేవలం రుచిగా ఉండడమే కాదు, వీటికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మష్రూమ్స్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఎస్సెన్షియల్ న్యూట్రియెంట్స్ ఉన్నాయి. అందుకే దీన్ని పోషకాహార నిపుణులు సూపర్ ఫుడ్ అని అంటారు.
పుట్టగొడుగుల నుంచి పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువ ఉండటం వల్ల బరువు పెరుగుతామన్న భయమే ఉండదు. ఊబకాయంతో బాధపడేవారికి ఇది ఉపకరిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే పొటాషియం.. పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్‌, నియాసిన్‌లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. మష్రూమ్స్‌లో ఉండే విటమిన్‌-ఈ, సెలీనియం ప్రోస్టేట్‌ కాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. వెంట్రుకల పోషణలో కూడా ఇవి ఉపకరిస్తాయి. శారీరక శక్తిని పెంపొందిస్తాయి.

గుండె జబ్బులకి మందు..
పుట్టగొడుగులలో ఇర్గోథియోనైన్‌ , సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సీడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి తోడ్పడతాయి. శరీరంలో యధేచ్చగా సంచరిస్తూ.. డీఎన్ఏను దెబ్బతీస్తూ, గుండె జబ్బులకు, కాన్సర్ తదితర రోగాలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి ఎదుర్కొంటాయి. రక్తపోటు ఉన్నవారు, బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో 9 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి 5 సార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి.

బ్లడ్ ప్రెషన్ లెవెల్స్ కంట్రోల్
మష్రూమ్స్‌లో పొటాషియం ఎక్కువ గా ఉంటుంది, సోడియం తక్కువ. ఇందు వల్ల బ్లడ్ ప్రెషన్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.మష్రూమ్స్ లో విటమిన్ డీ లభిస్తుంది. ఇందువల్ల ఎనర్జీ లెవెల్స్ పెరగడమే కాక ఎముకలూ, పళ్ళూ బలంగా తయారవుతాయి. ఈ విటమిన్ డీ వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది, ఫ్లూ వంటి వాటిని ప్రివెంట్ చేస్తుంది, అనేక ఇతర వ్యాధుల నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. మష్రూమ్స్‌లో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ సీ, డీ, వల్ల ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది, బాడీకి కావాల్సిన పోషణ లభిస్తుంది. ఈ ప్రయోజనాలన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రపంచవ్యాప్తంగా పోషకాహార నిపుణులు మష్రూమ్స్ ని ఆహారం లో భాగం చేసుకోమని చెబుతూ ఉంటారు.

Scroll to Top