
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఓ గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. అందులో కాస్త తేనె తీసుకుంటే ఇంకా మంచిదని చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోజంతా శరీరానికి కావలసినంత ఎనర్జీ వస్తుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో జీర్ణక్రియ మందగించినప్పుడు- గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల శరీరంలోని అంతర్గత వ్యవస్థలు చురుగ్గా మారతాయి. జీర్ణక్రియ వేగవంతమవుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు దూరమవడమే కాకుండా పక్షవాతం, గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. నిమ్మ రసం ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి- శరీరం నుంచి విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడం. దీనివల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడమే కాకుండా, చర్మ కాంతి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లు ముఖంపై ముడతలు, మొటిమలు తగ్గించడంలో సహాయ పడతాయి.
నిమ్మకాయలో పొటాషియం అధికం. దీని రసాన్ని తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మరసాన్ని చక్కెర లేకుండా తీసుకోవాలి. అయితే రాత్రిపూట నిమ్మ రసం తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో సిట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్థపై కొంతవరకు ప్రభావం చూపుతుంది. అది ఎసిడిటీకి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
