ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పులు రావడంతోపాటు ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం కూడా మధుమేహం రావడానికి కారణమవుతోంది. అధిక సమయం కూర్చొని పనిచేసేవారు కచ్చితంగా ప్రతిరోజు వ్యాయామం చేయాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మధుమేహాన్ని అదుపు చేయడానికి కొన్ని ఆహార పదార్థాలున్నాయి.. వాటిగురించి నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
రాత్రివేళ నిద్రించే ముందు ఓ గ్లాసు నీటిలో టీస్పూన్ మెంతులు నానబెట్టాలి. నానబెట్టిన నీటిని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. టైప్2 షుగరు ఉన్నవారు రోజుకు రెండుసార్లు పదిగ్రాముల మెంతుల గింజలను నానబెట్టి తాగారు. వీటిని తీసుకోవడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు ఓ జర్నల్ లో ప్రచురితమైంది. హిమోగ్లోబిన్ ఏవన్ సి గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
కాకరకాయలో పాలీపెప్టైడ్ సమ్మేళనం బ్లడ్ షుగరు లెవల్స్ అదుపులో ఉంచుతుంది. కాకరకాయ రసం తాగితే షుగరు అదుపులో ఉంటుంది. షుగరు ఉన్నవారు క్రమం తప్పకుండా ఉసిరి రసం తీసుకోవాలి.
ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రెండు లేదంటే మూడు ఉసిరికాయలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. వీటిలో ఓ గ్లాసు నీరు కలిపి మళ్లీ మిక్సీ వేయాలి. తర్వాత ఈ రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీకడుపుతో తీసుకుంటే రక్తంలో షుగరు అదుపులో ఉంటుంది.
షుగరు ఉన్నవారికి దాల్చిన చెక్కనీరు బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో మూడు లేదంటే నాలుగు చిన్న దాల్చిన చెక్కల్ని వేసి మూతపెట్టాలి. అలా ఒక పది నిముషాల తర్వాత ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తాగాలి. ఇలా చేయడంవల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు వివరించారు.