మగవారితో పోలిస్తే ఆడవాళ్లకు ప్రత్యేకంగా కొన్ని విటమిన్లు అవసరం అవుతాయి. అలాగే పెరుగుతున్న వయసుతోపాటు కూడా ఆడవాళ్లకు కొన్ని విటమిన్లు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు రీత్యా ఆడవారి శరీరంలో వచ్చే మార్పుల కారణంగా వారికి రకరకాల విటమిన్లు అవసరం అవుతాయి. యునిసెఫ్ రిపోర్ట్ల ప్రకారం ప్రపంచంలో వంద కోట్ల కంటే ఎక్కువ మంది మహిళలు, ఆడపిల్లలు రకరకాల విటమిన్లు, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
ఈ లోపాలను అధిగమించడం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..?
విటమిన్–ఎ :
ఆడవాళ్ల ఆరోగ్యానికి విటమిన్–ఎ కీలకమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆడవారిలో ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి ‘ఎ’ విటమిన్ తీసుకోవడం అత్యంత అవసరం. దీనికోసం టొమాటో, క్యారెట్, బొప్పాయి, గుమ్మడికాయ, పాలకూర, చేపలు, పాలు, గుడ్లు, పుచ్చకాయ వంటివి రెగ్యులర్గా తీసుకుంటుండాలి.
విటమిన్–బి3:
ఆడవారి ఆరోగ్యానికి కావాల్సిన మరో ముఖ్యమైన విటమిన్.. బి3. కణాల పనితీరు, పోషకాలను గ్రహించడంలో, నాడీవ్యవస్థ పనితీరులో ‘బి3’ విటమిన్ కీలకం. ఇది ట్యూనా చేపలు, వేరుశెనగలు, పుట్టగొడుగులు, గోధుమలు, పాలు, గుడ్లు, బీన్స్ వంటి వాటిలో ఉంటుంది.
విటమిన్–బి6:
మహిళల్లో హార్మోన్ల ఉత్పత్తికి, మెదడు ఆరోగ్యానికి, రక్తహీనత వంటి సమస్యలను నివారించడానికి విటమిన్–బి6 అవసరం. దీనికోసం డ్రై ఫ్రూట్స్, నట్స్, ఎగ్స్, ముడి ధాన్యాలు, బీన్స్, ఆవకాడో, అరటిపండ్లు, మాంసం, ఓట్స్ వంటివి తీసుకోవాలి.
విటమిన్–బి9:
మహిళల ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్లో ‘బి9’( ఫోలిక్ యాసిడ్) కూడా ఒకటి. ఇది గర్భిణుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది ఆకుకూరలు, బీన్స్, పప్పుధాన్యాలు, అరటిపండ్లు, పాలఉత్పత్తులు, చేపల్లో ఎక్కువగా ఉంటుంది.
విటమిన్–బి12 :
మహిళల్లో రక్త హీనత తగ్గడానికి విటమిన్–బి12 తీసుకోవడం అవసరం. ఇది రక్తకణాలు ఏర్పడటానికి, మెటబాలిజం రేటును పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది చేపలు, పాలు, గుడ్డు, మాంసం, పెరుగు వంటి పదార్థాల్లో అధికం.
విటమిన్–సి:
ఇమ్యూనిటీకి కీలకమైన విటమిన్– సి ని మహిళలు తప్పకుండా రోజువారీ డైట్లో తీసుకోవాలి. ఇది రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే గర్భిణులకు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి కూడా విటమిన్–సి ఎంతో అవసరం. ఇది సిట్రస్ ఫ్రూట్స్, బంగాళాదుంపలు, స్ట్రాబెర్రీస్, టొమాటో, జామ, ఉసిరి వంటి వాటిలో లభిస్తుంది.
విటమిన్–డి:
శరీరంలో కాల్షియం శోషణకు అవసరమైన ‘డి’ విటమిన్ మహిళల ఆరోగ్యానికి అత్యంత అవసరం. వయసుపైడే కొద్దీ కీళ్ల అరుగుదల, కీళ్ల నొప్పుల వంటివి రాకుండా ఉండేందుకు విటమిన్–డి తీసుకోవడం అవసరం. ఇంటిపట్టునే ఉండే గృహిణుల్లో ‘డి’ విటమిన్ ఎక్కువగా లోపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్లు రోజుకు కాసేపు ఎండలో ఉండడం అవసరం.