విటమిన్-డి ని లోపించనీయొద్దు!

విటమిన్-డి శరీరానికి చలా అవసరమైన పోషకం. ఇది ఎముకలు బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, కాల్షియం శోషణకు సాయపడుతుంది. ఇది సహజంగా సూర్యకాంతి నుంచి లభిస్తుంది. చాలామంది తక్కువ సూర్యరశ్మికి గురికావడం వల్ల, వారిలో విటమిన్ డి లోపం ప్రారంభమవుతుంది. విటమిన్ డి టి-కణాల ఉత్పత్తి వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఈ కణాలు చాలా అవసరం. ఈ కణాలు శరీరాన్ని బయట దాడి నుంచి రక్షిస్తాయి. వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి. ఇక, సూర్య రశ్మి నుండి వచ్చే విటమిన్ డి ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది ఎముకలు, దంతాల్ని స్ట్రాంగ్‌గా మారుస్తుంది. శరీరంలో తగినంత స్థాయిలో విటమిన్ డి ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది.

కొద్దిసేపు ఎండలో కూర్చోవడం ద్వారా విటమిన్ డి సులభంగా పొందవచ్చు. అయితే, ప్రత్యక్ష సూర్యకాంతి మన శరీరానికి హానికరం. టానింగ్, సన్‌బర్న్, చర్మ క్యాన్సర్ వంటి తీవ్రమైన చర్మ సమస్యలకు దారి తీస్తుంది. వేసవి ఉదయం సూర్యుని మొదటి కిరణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వారానికి రెండు నుంచి మూడు సార్లు సూర్యోదయం సమయంలో 20-30 నిమిషాలు ఎండలో కూర్చోవడం వల్ల తగినంత విటమిన్ డి లభించడమే కాకుండా చర్మం, జుట్టు, ఎముకలకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యుని మొదటి కిరణాలు చర్మాన్ని తాకడం వల్ల రక్త ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో చర్మం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వేసవిలో 20-30 నిమిషాలు సూర్యరశ్మికి గురికావడం సరిపోతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ తగినంత విటమిన్ డి పొందడానికి శీతాకాలంలో కనీసం రెండు గంటల సూర్యరశ్మి శరీరానికి కావాలి. ఎందుకంటే శీతాకాలంలో సూర్యరశ్మి ప్రభావం శరీరాలపై తక్కువగా ఉంటుంది. అందుకే తగినంత విటమిన్ డి పొందేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. ఇంకా, ఈ సీజన్‌లో సూర్యరశ్మికి ఉత్తమ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉంటుంది.

శరీరంలో విటమిన్ డి లోపిస్తే… కాల్షియం శోషణ సరిగా జరగదు. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది బోలు ఎముకల వ్యాధి, పగుళ్లకు కారణమవుతుంది. ఎటువంటి భారీ పనిచేయకుండా అలసిపోయినట్లు అనిపిస్తే అది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. చిన్న చిన్న పనులకే అలసిపోతుంటే వెంటనే అప్రమత్తం కావాలి. విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్, చిరాకు వంటి సమస్యలు వస్తాయి. జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. తరచుగా జలుబు చేయడం, ఇన్ఫెక్షన్ల బారిన పడటం కూడా విటమిన్ డి లోపానికి సంకేతం.

విటమిన్ డి లోపాన్ని అధిగమించాలంటే…సూర్యరశ్మిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 15-30 నిమిషాలు ఎండలో గడపాలి. విటమిన్ డి ఎక్కువగా ఉండే చేపలు (సాల్మన్, ట్యూనా), గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, పాలు, తృణధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తినాలి.

Scroll to Top