
హై బీపీని అదుపులో ఉంచే మూడు విధానాలు
***************************************
హైబీపీ అనేది చాలమందిలో సర్వసాధారణమైన విషయంగా మారింది. తగ్గించుకోవాలంటే కచ్చితంగా చేయాల్సిన పని తగిన మందులు వేసుకోవడం. అసలు మందులు లేకుండా బీపీ కంట్రోల్ అవడం కాస్త కష్టమే అని అంతా భావిస్తారు. అయితే మెడిసిన్ తీసుకుంటూనే కొన్ని పద్ధతులు కూడా పాటించాలి. అప్పుడే కాస్తంత త్వరగా బీపీ కంట్రోల్ అవడానికి సాధ్యపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బీపీ వచ్చే ముందు గుండెల్లో దడ గా అనిపిస్తుంది. తరచూ తలనొప్పి వస్తుంది. ఎంత ప్రశాంతమైన చోటులో కూర్చున్నా ఏదో ఓ ఆందోళనగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో బరువుగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. స్ట్రెస్ పెరిగే కొద్దీ బీపీ పెరుగుతూ పోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం నలుగురిలో ఒకరికి హైబీపీ ఉంటోంది.
* శ్వాసకు సంబంధించిన ప్రాణాయామ వ్యాయామం రోజూ ప్రాక్టీస్ చేస్తే చాలా సులువుగా బీపీ తగ్గుతుంది. ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ముందుగా ధ్యాన ముద్రలో కూర్చోవాలి. గట్టిగా ఊపిరి తీసుకోవాలి. నాలుగు లెక్కపెట్టేంత వరకూ అలాగే శ్వాస బిగపట్టి ఉంచాలి. ఆ తర్వాత అదే విధంగా నాలుగు లెక్కబెట్టి నెమ్మదిగా ఊపిరి వదలాలి. ఈ విషయంలో ఎక్కడా స్ట్రెస్ తీసుకోకూడదు. చాలా నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. ఈ వ్యాయామం వల్ల నరాల వ్యవస్థ మొత్తం మెరుగవుతుంది. అటానమస్ నెర్వస్ సిస్టమ్ సరైన విధంగా పని చేస్తుంది. తద్వారా హార్ట్ రేట్ మెరుగవుతుంది. స్ట్రెస్ తగ్గిపోవడంతో పాటు మైండ్ ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది. కేవలం ఓ నిముషం పాటు ఈ వ్యాయామం చేయడం వల్ల రక్త నాళాల్లో ఉండే ప్రెజర్ తగ్గుతుంది.
* రెండో విధానంలో చల్ల నీళ్లు ఉంటే చాలు. హైబీపీ నిమిషంలోనే కంట్రోల్ అవుతుంది. చల్ల నీటితో ముఖం కడుక్కోవడమే ఈ టెక్నిక్. అయితే..ఊరికే కడుక్కోవడం కాకుండా రెండు అరచేతుల్లో నీటిని తీసుకుని ముఖంపై కాస్తంత ఫోర్స్ గా పోయాలి. నుదురు, కళ్లపై నీళ్లు పడేలా చూసుకోవాలి. లేదా నీళ్లు చేతుల్లోకి తీసుకుని ముఖం అంతా తడిసే విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. శరీరంలో అన్ని అవయవాలకు సరైన విధంగా రక్తం సరఫరా అవుతుంది. ముఖ్యంగా గుండె, మెదడుకి బ్లడ్ సప్లై అవుతుంది. ఆ సమయంలో హార్ట్ రేట్ కాస్త తగ్గుతుంది. రక్త నాళాలపై ప్రెజర్ తగ్గుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది.
* మూడోది ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. దీన్ని పి.ఎం.ఆర్. అంటారు. స్ట్రెస్ పెరిగినప్పుడు భుజాలు పట్టేసినట్టుగా అవుతాయి. అంతే కాదు. పిడికిలి కూడా చాలా గట్టిగా అయిపోతుంది. మరీ విపరీతంగా యాంగ్జైటీ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఈ పీఎమ్ ఆర్ టెక్నిక్ వాడాలి. ముందుగా కళ్లను చాలా గట్టిగా మూయాలి. వాటిపై కాస్తంత ప్రెజర్ పడేలా మూస్తే మంచిది. అలా కొద్ది సేపటి వరకూ అలా మూసే ఉంచాలి. కాసేపటికి తెరవాలి. ఆ తరవాత దవడలు గట్టిగా మూయాలి. కనీసం 5 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆపేయాలి. ఇక తప్పకుండా చేయాల్సిన మరో పని ఏంటంటే.. గడ్డం ఛాతికి గట్టిగా ప్రెస్ చేసి ఉంచాలి. ఆ తరవాత వదిలేయాలి. ఇలా కనీసం నాలుగైదు సార్లు చేయాలి. ఆ తర్వాత భుజాలను పైకి లేపి కిందకు అంటూ ఉండాలి. ఆ తరవాత గట్టిగా పిడికిలి మూసి వదలాలి. గట్టిగా శ్వాస తీసుకుని వదిలేయాలి. పాదాలను గట్టిగా కిందకు ఆనించి అలాగే ఉంచాలి. ఇలా కాసేపు చేస్తే చాలు. బీపీ తగ్గిపోతుంది.
ఈ వ్యాయామం చేసిన తర్వాత చివర్లో శవాసనం వేస్తే బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. కాళ్లు కాస్తం ఎడం గా ఉండేలా చూసుకోవాలి. కాసేపటి వరకు అసలు కదలకుండా అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాలన్నీ యాక్టివ్ అయిపోతాయి. వీటితో పాటు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు వాడకం చాలా వరకు పరిమితం చేసుకోవాలి. సైంధవ లవణం, నల్ల ఉప్పు లాంటివి వాడితే బీపీ పెరగకుండా ఉంటుంది. రోజూ వాకింగ్ చేయడం మంచిది. మెడిటేషన్ చేస్తే చాలా వరకు బ్లడ్ ప్రెజర్ నార్మల్ అవుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
