అతిగా నడిస్తే అనర్ధాలు


వ్యాయామంలో భాగం రోజూ నడక చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.అయితే అలాగని అతిగా నడక సాగిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణులు చెబుతున్న దాని బట్టి సాధారణంగా 8,000 నుంచి 10,000 అడుగుల వరకు నడవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. దీని వల్ల షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి. నడక అందరికీ మంచిదే. అయితే, అది పరిమితి మించనంత వరకే. వయసు.. ఆరోగ్య సమస్యల కు అనుగుణంగా రోజు ఎంత దూరం నడవాలి.. ఎన్ని అడుగులు నడవాలి అనేది వైద్యులు నిర్ధారణ చేస్తారు. దీనికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవటం ఉత్తమం. నడక అందరికీ ఒకేలా వర్తించదు. మీ వయస్సు, ఆరోగ్యం, జీవనశైలి ఆధారంగా ఇది మారవచ్చు.శరీరం శక్తి మేరకు నడక పరిమితి ఉండాలి. కొత్తగా నడక ప్రారంభించిన వారు 30 నిమిషాలు నడిస్తే కొద్ది రోజులు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు. అయితే,  కొత్తగా నడక ప్రారంభించే వారు ముందుగా కొద్ది రోజుల పాటు 15 నిమిషాలే నడవాలి. వారం తరువాత క్రమేణా పెంచుకుంటూ 30 నిమిషాల వేగవంతమైన నడవటం ఉత్తమం. నడక అలవాటు అయిన తర్వాత సమస్యలు ఉండవు. శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నడక కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వయసు తో పాటుగా శరీరంలో సమస్యలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.  వయసు పెరిగిన వారికి ఎక్కువగా నడవడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తాయి. నడకకు వినియోగించే బూట్లు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పులు.. చదును కాని ప్రాంతాల్లో నడక వలన ఇబ్బందులు ఏర్పడతాయి. శరీర శక్తికి మించి ఎక్కువగా నడిస్తే శరీరం అలసిపోయినట్లు అనిపించడం, చిన్న పని చేసినా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా నడుస్తున్నారని సూచిస్తాయి. నడక మనసుకు శాంతిని ఇవ్వగలిగే శక్తి ఉన్నా.. హద్దు మించి చేస్తే ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణుల సూచన. దీంతో, నడక మంచిదే అయినా పరిమితులు మాత్రం తెలుసుకొని.. ముందుకు సాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

Scroll to Top