ఒత్తిడి సమయంలో జంక్ ఫుడ్ తో మరింత ముప్పు
*******************
మారిన జీవన విధానం, ఉద్యోగాలు వంటి కారణాలతో ఒత్తిడి ఒక సర్వసాధారణ అంశంగా మారిపోయింది. మనలో ప్రతీ నలుగురిలో ఇద్దరు ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతీది పోటా పోటీగా మారడంతో ఒత్తిడి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒత్తిడి మానసికంగానే కాకుండా శారీరకంగా దెబ్బ తీస్తుందని మనకి తెలుసు ఈ ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో రిలీఫ్ కోసం కొన్ని రకాల అలవాట్లను ఆశ్రయిస్తాం. సాధారణంగా ఒత్తిడిగా ఉన్నప్పుడు సిగరెట్ కాలుస్తారు. అది మంచిది కాదని తెలుసుకాబట్టి కొందరు దాని జోలికి వెళ్ళకుండా తిండి మీద పడతారు. ముఖ్యంగా సమోసా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఇది మంచి పద్దతి కాదంటున్నారు నిపుణులు.
ఒత్తిడిగా ఎక్కువగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం తినే ఆహారంలో ఎక్కువ కేలరీలు గనుక ఉంటే ఒత్తిడి తగ్గదు కదా ఇంకా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. జంతువులలో జరిపిన అధ్యయనం ప్రకారం, అధిక కొవ్వు కలిగిన ఆహారం గట్ బ్యాక్టీరియాకు అంతరాయం కలిగిస్తుంది. వాటి ప్రవర్తనను మారుస్తుంది. దీనివల్ల ఆందోళనను పెంచే మార్గాల్లో మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తుందని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ఒత్తిడి, ఆందోళనతో సంబంధమున్న సెరోటోనిన్ ఉత్పత్తి వాటిలో ఎక్కువ కావడాన్ని వారు పరిశీలించారు. అధిక కొవ్వులు కలిగిన పదార్ధాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం, గుండె, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులతో పాటు డిప్రెషన్ కు కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక కొవ్వు కలిగిన ఆహారం న్యూరోసట్రాన్స్మీటర్స్ ద్వారా జరిగే సెరోటోనిన్ ఉత్పత్తి, సిగ్నలింగ్ లో పాల్గొనే మూడు జన్యువులు ఒత్తిడి, ఆందోళనకు కూడా కారణంఅవుతుంది. ఈ సెరోటోనిన్ ను ఫీల్ గుడ్ బ్రెయిన్ కెమికల్ గా వ్యవహరిస్తారు. కానీ ఇది పరిమితికి మించి ఆక్టివేట్ అయినపుడు ఆందోళన కు కూడా కారణం అవుతుంది. అయితే అన్ని కొవ్వులు మాత్రం మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవు. చేపలు, ఆలివ్ నూనె, విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులోకి వస్తాయి. అందువల్ల ఒత్తిడిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.