గుండెపోటు సంకేతాలని నిర్లక్ష్యం చేయొద్దు

ఆధునిక కాలంలో చాలా మంది ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్కా ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు. సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. చాలా మంది గుండె పోటుతో ఆకస్మాత్తుగా చనిపోతున్నారు.

గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది అకస్మాత్తుగా సంభవించవచ్చు. చాలా సందర్భాలలో ప్రాణాంతకం కావచ్చు. గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి, గుండె కండరానికి నష్టం వాటిల్లినప్పుడు ఇది సంభవిస్తుంది. గుండెపోటు యొక్క కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరికొన్నింటిని గుర్తించకపోవచ్చు. గుండెపోటు సంకేతాలు లేదా లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

*గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. ఇది తరచుగా ఒత్తిడి, బిగుతు, భారంగా లేదా మండుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఛాతీ మధ్యలో సంభవిస్తుంది. కొన్ని నిమిషాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి మెడ, ఎడమ దవడ, భుజం, వీపు లేదా చేతులకు వ్యాపిస్తుంది. అయితే, ఛాతీ నొప్పి కొన్నిసార్లు గ్యాస్ వల్ల కూడా రావచ్చు.

*కొన్నిసార్లు ఛాతీ నొప్పి లేకపోయినా శ్వాస ఆడకపోవడం గుండెపోటుకు కీలకమైన సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా పనిచేయలేనప్పుడు, ఊపిరితిత్తులు సరైన మొత్తంలో ఆక్సిజన్‌ను అందుకోలేనప్పుడు ఈ సమస్య వస్తుంది. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

*అకస్మాత్తుగా చలితో చెమటలు పట్టడం గుండెపోటుకు మరొక హెచ్చరిక లక్షణం. ఈ చెమట సాధారణంగా ఒత్తిడి లేదా వేడి వల్ల కలగదు. కానీ శరీరం లోపల జరుగుతున్న సమస్యకు సంకేతం కావచ్చు. ఎటువంటి కారణం లేకుండా చెమటలు పడుతుంటే, దానిని లైట్ తీసుకోవద్దు.

*గుండెపోటు సమయంలో, గుండె పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా తగినంత రక్తం మెదడుకు చేరదు. దీంతో రక్తపోటు తగ్గుతుంది. దీనివల్ల తలతిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే, అది గుండె సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు.

*కొంతమందికి గుండెపోటు సమయంలో వికారం, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణం తరచుగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎటువంటి అనారోగ్యం లేకుండానే వికారం లేదా వాంతులు అనిపిస్తే, దానిని తీవ్రంగా పరిగణించండి. అంతేకాకుండా చాలా మందికి గుండెపోటుకు ముందు అజీర్ణం లేదా ఛాతీలో మంటగా అనిపించవచ్చు.

*ఎటువంటి శ్రమ, వ్యాయామం, పని చేయకపోయినా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. ఈ అలసట సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. రోజు రోజుకి అలసట క్రమంగా పెరుగుతుంది.

*గుండెపోటు సమయంలో, నొప్పి ఛాతీ నుంచి ప్రారంభమై చేతులు, మెడ, దవడ లేదా వీపు వరకు వ్యాపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఎడమ చేతిలో ఎక్కువగా ఉంటుంది. కానీ కుడి చేతిలో కూడా సంభవించవచ్చు. ఈ ప్రాంతాల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తే, అది గుండెపోటుకు సంకేతం కూడా కావచ్చు.

*హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. దీనిని తరచుగా గుండె దడ అని పిలుస్తారు. దీనిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది లేదా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ లక్షణం తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం

Scroll to Top