జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తినాలి. అలా పోషకాలు మెండుగా ఉండే ఆహారపదార్థాలలో చేపలు ఒకటి. చేపలలో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే, మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచే అనేక పోషకాలు ఉన్నాయి. అంతేకాదు రోజు పాలు తాగడం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ప్రతిరోజు దానిమ్మ పండును తీసుకోవడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇక వాల్ నట్స్ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, మెదడు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మెదడు బాగా పనిచేసేలా చేస్తాయి.
రోజూ ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. ఇవి మన మెదడుకు పదును పెట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక మెదడు సామర్థ్యాన్ని పెంచే వాటిలో కోడిగుడ్లు కూడా ఒకటి. గుడ్డులో విటమిన్ బి, కోలిన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కోడిగుడ్లను తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే బాదం పప్పులను, వేరుశనగ పప్పులను ప్రతిరోజు తినాలి. బాదంపప్పులు, వేరుశనగపప్పు లో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మన జ్ఞాపక శక్తిని పెంచి మతిమరుపు నుంచి మనల్ని బయట పడేస్తాయి. ఇటు పెద్దలకే కాదు అటు పిల్లలకు కూడా ఈ ఆహార పదార్థాలను తినిపించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.