నడుము నొప్పి నుంచి ఉపశమనం


ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే సాధారణ సమస్య నడుము నొప్పి. ఇది రావడానికి రకరకాల కారణాలున్నాయి. అయితే ఇది సాధారణ సమస్య అయినప్పటికీ చాలా ఇబ్బంది పెడుతుంది. దీన్ని ప్రాథమికంగా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
* నడుము నొప్పితో బాధపడేవారు ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిల్చోవడం, ఎక్కువ సేపు పడుకోవడం వంటివి చెయ్యకూడదు. నడుము పైన ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. అధిక ఒత్తిడి లేకుండా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది.
* ఎక్కువసేపు మంచం మీద పడుకునే ఉండడం మంచిది కాదు. ఈ విధంగా చేయడం కండరాలను బలహీనపరిచి నడుము నొప్పిని మరింత ఎక్కువ అయ్యేలా చేస్తుంది. సౌకర్యవంతమైన భంగిమలో పడుకోవడం, మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని వెనక్కి పడుకోవడం వంటివి చేస్తే కాస్త నడుం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
* నడుం నొప్పితో ఎక్కువ బాధ పడేవారు హీట్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ పెట్టుకుంటే నడుము నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. నడుము కండరాలకు ఉపశమనం కలిగించే ఎక్సర్సైజులు చేయడం కూడా మంచిది.
* కూర్చున్నప్పుడు లేదా నిలుచున్నప్పుడు నడుము భంగిమ సరైన విధంగా ఉండేలా చూసుకోవడం కూడా నడుము నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. నడుము భాగంలో తేలికపాటి మసాజ్ లు చేసుకోవడం వల్ల కూడా కండరాల నొప్పి సడలి నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలివ్ నూనె, కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల నడుము నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
* అల్లం టీ తాగడం వల్ల, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల కూడా కాస్త ఉపశమనం ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నడుం నొప్పిని తగ్గిస్తాయి. గోరువెచ్చని నీళ్లలో ఎప్సం సాల్ట్ కలిపి, ఆ నీళ్లలో ఒక క్లాత్ ను ముంచి, నడుము పైన కాపడం పెట్టడం వల్ల కూడా నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం వల్ల కూడా నడుం కండరాలకు ఉపశమనం కలిగి నడుము నొప్పి తగ్గుతుంది. నొప్పి తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించి డాక్టర్ సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. నొప్పి ఒక వారం కంటే ఎక్కువ ఉంటే, మూత్ర విసర్జనలో ఇబ్బంది కలిగినా తక్షణం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

Scroll to Top