పొంచి ఉన్న ప్రమాదం.. బ్రెయిన్ స్ట్రోక్


విభిన్నమైన జీవనశైలి, ఒత్తిళ్ళు వల్ల నేడు చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య బ్రెయిన్ స్ట్రోక్. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలామంది దీనికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ముందుగా వచ్చే లక్షణాలను గుర్తించలేక బ్రెయిన్ స్ట్రోక్ బాధితులుగా మారుతున్న వారు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? దానిని అసలు ఎలా గుర్తించవచ్చు? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి? వంటి అంశాలను నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రజలు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. మెదడుకు సరిగ్గా రక్తప్రసరణ జరగకపోయినా, లేదా మెదడులో రక్తం గడ్డ కట్టినా, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

లక్షణాలను గుర్తిస్తే
బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమయ్యే లక్షణాలను గుర్తిస్తే తీవ్రమైన ప్రమాదం బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరం మొత్తం బలహీనంగా మారుతుంది. మాటలు నత్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరమంతా తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా చెప్పేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజన్ కు గురవుతారు. మెదడుకు ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతుంది.

ముఖంలో ఎన్నో మార్పులు
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ముఖంలో మార్పు వస్తుంది. చూపు మందగిస్తుంది. ఒక్కోసారి రెండు కళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక వైపుకు ముఖం జారిపోయినట్టుగా మారుతుంది. నిటారుగా నిలబడడంలోను ఇబ్బంది వస్తుంది. శరీరంపై కంట్రోల్ పోతుంది. చేతులు కూడా బలహీనంగా మారుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలున్నా, వచ్చినా వెంటనే డాక్టర్ ను కలవడం చాలా అవసరం.

ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం
బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదిస్తే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండానే కాపాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే త్వరగా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Scroll to Top