మెదడు మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో ఒకటి. మన మానసిక స్థితి, ఆకలి, జీవక్రియ, జీర్ణక్రియ, హార్మోనల్ పనితీరును పేరేపిస్తుంది. ప్రస్తుత లైఫ్‌స్టైల్, చెడు ఆహార అలవాట్లు, నిద్రలేమి కారణంగా.. మెదడు పనితీరుపై ప్రభావం పడుతోంది. దీని కారణంగా ఏకాగ్రత దెబ్బతినడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువై మానసిక ప్రశాంతత కరవవుతోంది. మన మెదుడు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి మనం తీసుకునే ఆహారం కీలక పాత్రపోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. రోజూ ఉదయం రెండు బాదం గింజలు, వాల్నట్స్ తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఈ ఆహారాలు మీ మెదడు పనితీరును, అభివృద్ధి రెండింటినీ మెరుగుపరుస్తాయి. జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్ వంటి గింజలు, విత్తనాలు అధికంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలోని విటమిన్-ఇ శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నిరోధిస్తుంది. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజల్లో ఉండే జింక్, మెగ్నీషియం, విటమిన్-బి వంటి పోషకాలు జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
*విటమిన్ సి అధికంగా ఉండే.. వీటితో పాటు విటమిన్ సి అధికంగా లభించే నిమ్మ, దానిమ్మ, నారింజ, కివీ.. వంటి వాటిని కూడా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని బాగా పెంచుకోవచ్చు. రోజూ అర కప్పు చొప్పున బ్లూబెర్రీలను డైట్లో చేర్చుకుంటే.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. బ్లూబెర్రీలలోని ఫ్లేవనాయిడ్లు గ్రాహక శక్తిని రెట్టింపు చేస్తాయి.
*మెదడు పనితీరును మెరుగుపరచడానికి జింక్ అవసమని అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. జింక్ మెదడు చురుగ్గా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదం చేస్తుంది. చికెన్, రెడ్‌మీట్, బీఫ్, సాల్మన్ చేపలు, గుడ్లు వంట మాంసాహార పదార్థాల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. బీన్స్, చిక్కుళ్లు శనగలు వంటి కాయధాన్యాల్లో జింక్ మెండుగా ఉంటుంది. పాలు, వెన్న, పెరుగు లాంటి డెయిరీ ఉత్పత్తులను మీ డైట్లో చేర్చుకోండి.
*డార్క్ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరిగేందుకు సహాయపడతాయి.