వయసు పెరిగే కొద్దీ సాధారణంగా గుండె సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు వయసు పెరుగుతున్న కొద్దీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సమాజంలో పెద్దవారు మాత్రమే కాదు గుండె ఆరోగ్యం పై చిన్న వయసు నుంచి కాస్త అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. మారుతున్న జీవన శైలి కారణాలతో చిన్న వయస్సులోనే అప్పటివరకు మాట్లాడిన వారు, తిరిగిన వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. గుండె పోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గుండె ఆరోగ్యం కోసం ధూమపానం మానేయాలి. ధూమపానం అలవాటు ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు తగినన్ని నీళ్లు తాగడంతో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను తినాలి.
*ప్రతిరోజు తగినంత వ్యాయామం చేయడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆహరం, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
*ప్రతి ఒక్కరు గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు రోజుల్లో కాసేపైనా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి, సంతోషంగా గడపాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి, ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు హాయిగా నిద్రపోవాలి. అలాంటి వారికి గుండె సమస్యలు తక్కువగా వస్తాయి.
*గుండె ఆరోగ్యం కోసం బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువ బరువు ఉన్నవారికి కూడా గుండె సమస్యలు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇష్టమైన సంగీతాన్ని వినడం, మనసుకు సంతోషం కలిగించే పనులు చేయడం క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకోవడం వల్ల టెన్షన్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కనీసం ఆరు నెలలకు ఒకసారైనా గుండె వైద్య నిపుణుల వద్దకు వెళ్లి గుండె సంబంధిత పరీక్షలు చేయించుకొని గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించుకుంటే మంచిది. అలా చెయ్యటం వలన గుండె జబ్బుల ప్రమాదం రాకుండా కాపాడుకోవచ్చు, ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందే గుర్తించి తగిన చికిత్స తీసుకోవచ్చు.