కవిత్వమంటే ….


“కవిత్వమంటే” అన్న అంశం మీద సహజకవితా కళాభిజ్ఞ, కావ్యకళాప్రపూర్ణ శ్రీ చింతలపాటి మోహన మురళీకృష్ణ Ph.D గారు పరిశీలనాత్మక వ్యాసం.

కవిత్వమంటే ఏమిటో పరిశీలించేముందు కవి అంటే ఎవరో చెప్పాలి: “కవిర్మనీషీ పరిభూః  స్వయం భూః” అని వేదమంత్రాల్లో చెప్పబడింది. అది క్రమంగా పరమాత్మ దర్శనం పొందిన ఋషి గా వ్యవహారంలోకి వచ్చింది. మంత్ర ద్రష్టలైన ఋషులు కవులుగా పిలవబడ్డారు. వారి కావ్యాలు ఉపనిషత్తులు. వైదికకవులు, లౌకికకవులు లోకరహస్యాలు తెలిసినవారు కనుక “ నానృషిః కురుతే కావ్యం” అన్నారు. అంటే ఋషి కానివాడు కావ్యాన్ని వ్రాయజాలడు అన్నారు. అంటే ఋషియైనవాడు తాను దర్శించిన వస్తువుల ధర్మాలు తెలిసినవాడని భావం. ఈ తెలిసిన లక్షణాన్నే ప్రతిభ అన్నారు. అంటే కేవలం దర్శనం పొందితే చాలదు. దాన్ని వర్ణించగల సామర్థ్యం ఉండాలి.

గ్రీకులు కూడా కవితాశక్తి దైవదత్తమన్నారు. Plato తన Ion గ్రంధంలో కవి ముఖతః పలికేది భగవంతుడే అంటాడు. Muse అనే దివ్యశక్తి గ్రీకుల దృష్టిలో మన సరస్వతి వంటిది.

కవి సామర్ధ్యాన్ని గురించిన  అంశాన్ని భామహుడు ఇలా చెప్పాడు:

“ప్రజ్ఞా నవ నవోన్మేషశాలినీ ప్రతిభా మతా
తదనుప్రాణనాజ్జీవేద్వర్ణనా నిపుణః కవిః”

నవనవోన్మేష శాలిని యగు ప్రజ్ఞ ప్రతిభ. దానికాశ్రితుడై వర్ణనము చేసేవాడు కవి. ఆనందవర్ధనుడు

“ అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః- యథాస్మై రోచతే విశ్వం తధేదంపరివర్తతే” అన్నాడు. అపారమైన కావ్య ప్రపంచంలో కవియే బ్రహ్మ. అతడు సృష్టి కర్త. తనయిష్టానుసారం లోకాన్ని మార్చ గలడు. అంటే వీళ్ళిద్దరి మాటల్ని బట్టి -ప్రతిభావంతుడైన కవి కావ్యప్రపంచాన్ని సృష్టించే బ్రహ్మ. లోచనకారుడు(అభినవగుప్తుడు): “కవనీయం కావ్యం” అన్నాడు. విద్యాధరుడు: “కవయతీతి కవిః . తస్య కర్మ కావ్యం” అన్నాడు. వర్ణించువాడు కవి అనీ, అతని కర్మ కావ్యమనీ చెప్పాడు. “కౌతి శబ్దాయతే విమృశతి రస భావాన్ ఇతి కవిః” అని భట్టగోపాలుడు చెప్పాడు. రసభావాలను విమర్శించేవాడుకవిఅంటాడు. “లోకోత్తరవర్ణనానిపుణఃకవిః”అంటాడుమమ్మటుడు.అప్పకవీయంలో సప్తవిధకవులను పేర్కొన్నాడు:1.వివేకి,2. వాచకుడు,3.రౌచికుడు, 4.ఆర్ధికుడు, 5.శిల్పి,6. భూషణార్ధి,7.మార్దవ కవి అని 7రకాల కవులను చెప్పాడు. వీరిలో రౌచిక ఆర్ధిక,మార్దవ కవులు మాత్రమే కవులు. మిగిలినవాళ్ళు కవి నామకులు మాత్రమే. మృదుమధురోక్తులను వెదకి కావ్యరచన చేసేవాడు రౌచికుడు. నన్నయభట్టు రౌచికుడు. మితశబ్దములలో అమితార్ధాన్ని నిండించేవాడు ఆర్దికుడు. తిక్కన ఆర్దికుడు. సరళమైన పదములతో అర్ధములతో రసవత్తరముగా చెప్పువాడు మార్దవకవి. ఎఱ్ఱన మార్దవకవి. కావ్యమీమాంస లో ముగ్గురు కవులు చెప్పబడ్డారు. 1.శాస్త్రకవి,2. కావ్యకవి, 3.ఉభయకవి. ఉభయకవియే విద్వత్కవి అంటారు. “ విద్వత్కవయఃకవయః కేవల కవయస్తు కేవలం కవయః” అని లోకంలో నానుడి ఉంది. ప్రతిభావ్యుత్పత్తులు రెండును గలవాడే విద్వత్కవి. అతడే లోకోత్తర వర్ణనానిపుణుడు.  అందుకనే

“గురువు లఘువుజేసి కుంచించి కుంచించి-లఘువు గురువుజేసి లాగిలాగి
కవితజెప్పునట్టి కవిగులామునుబట్టి ముక్కుకోయవలయు తొక్కిపట్టి” అని చెప్పారు.

“ నా కవిత్వ మధర్మాయ మృతయే  దండనాయ చ
కుకవిత్వం పునస్సాక్షాన్మృతి మాహుర్మనీషిణః” అన్నారు.

కవికాకపోయినంత మాత్రాన ఎటువంటి అధర్మమును లేదు. ఏ పాపమును చుట్టుకోదు. అంతమాత్రాన మనిషి చనిపోడు. కానీ కుకవి కావటం అనేది కేవల మరణమే. అన్నారు. కవి ప్రతిభ 2 రకాలు. 1.కారయిత్రి. ఇది కవిచేత కావ్యం వ్రాయిస్తుంది. 2. భావయిత్రి. ఇది పాఠ కునిచేత కావ్యాన్ని చదివిస్తుంది. అంటే కవితోపాటు పాఠకునికి కూడా కొంత చదువగల జ్ఞానం ఉండాలి.

కావ్యం, కవిత్వం రెండూ ఒకేఅర్ధంలో వాడబడుతున్నా ఈ రెంటిమధ్య భేదం ఉంది. కావ్యం అంటే అది పద్యకావ్యం గానీ, గద్యకావ్యం కానీ వచనపద్య కావ్యంగానీ కావచ్చు. కానీ కవిత్వం అంటే కేవలం పద్యరచనయే అని విమర్శకులు  పేర్కొంటున్నారు. సాహిత్య గ్రంధాలన్నీ కావ్యాలు కావచ్చు. కానీ అందులోనిది కవిత్వం కాదు. ఆ సాహిత్యంలో ఛందో బద్ధమైన దానినే కవిత్వం అంటామని వారు పేర్కొంటున్నారు . కవిత్వమంటే ఏది అనే విషయంపై పూర్వకాలం నుంచి మనదేశంలో వలెనే పాశ్చాత్య దేశాలలోనూ చాలా నిర్వచనాలు చెప్పారు. కానీ ఏదీకూడా సరియైనదిగా లేదు. బహుశా భవిష్యత్ లోకూడా రాదని కొందరు విమర్శకులు చెబుతున్నారు.

ఇక కావ్యం ఎలా ఉండాలి అంటే “శబ్దార్ధౌ సహితౌకావ్యం” అన్నాడు భామహుడు. దండి : “శరీరం తావదిష్టార్ధ వ్యవచ్చిన్నా పదావళీ” అన్నాడు. వామనుడు రీతిరాత్మా కావ్యస్య అన్నాడు. ఆనందవర్ధనాచార్యుడు “ధ్వనిరాత్మాకావ్యస్య” అన్నాడు. అభినవగుప్తుడు “ రసేనైవసర్వం జీవతికావ్యం న హి రసశూన్యం కావ్యం కించిదస్తి” అన్నాడు. ఈ సిద్ధాంతం ఆధారంగానే విశ్వ నాధుడు : “ వాక్యం రసాత్మకం కావ్యం” అన్నాడు. క్షేమేంద్రుడు ఔచిత్య  చర్చ చేశాడు. జగన్నాధుడు “ రమణీయార్ధః ప్రతిపాదక శబ్దః కావ్యం” అనిచెప్పాడు. వీళ్ళలో కావ్యప్రకాశ కర్త మమ్మటుడు-

“ తదదోషౌ శబ్దార్ధౌ సగుణావనలంకృతీ పునః క్వాపి” అన్నాడు. దోషాలు లేకుండా గుణవంతాలైన శబ్దార్ధాలే కావ్యం అనీ అవి ఎక్కడైనా అలంకార సహితంగా కూడా ఉండవచ్చని చెప్పాడు. దీన్ని విశ్వనాధుడు కాదన్నాడు. అసలు దోషమే లేని కావ్యం అంటూ ఉండదని ఆక్షేపించాడు. వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పాడు. కానీ దీన్ని జగన్నాధ పండితరాయలు ఒప్పుకోలేదు. రసవంతమైనదే కావ్యం అంటే రసహీనాలైన వర్ణనాత్మక కావ్యాలు కావ్యాలుకాకపోతాయని ఆ

మాటలను వినక “రమణీయార్ధః ప్రతిపాదక శబ్దః కావ్యం అని చెప్పాడు. అంటే శబ్దార్ధాలు గల కావ్యాన్ని విన్నంతనే ఆహ్లాదం కలగాలి. అలా ఆహ్లాదాన్ని కలిగించేదే కావ్యం అన్నాడు. ఇది చాలావరకు తగినదిగా ఉంది. సాధ్యమైనంత వరకు దోషాలను తొలగించుకొని రమణీయాలైన అర్ధాలనే గ్రహించి తగినటువంటి శబ్దాలతో కావ్యరచన చేయాలి.

కానీ పాశ్చాత్య మేథావులు అందరూకూడా కవిత్వం అంటే ఏమిటి అనేదానిపైనే మాట్లాడారు. వారిలో : Samuel Johnson : “Poetry is metrical Composition. It is the art of uniting pleasure with Truth by calling forth imagination to the help of reason” అన్నాడు. కవిత్వం అంటే ఛందోబద్ధమైన కళ. అది బుద్ధిని, భావనాబలాన్ని సాధనాలుగా చేసుకొని సత్యాన్ని, ఆనందాన్నీ సంఘటించే కళ అన్నాడు.ఇక్కడ కవిత్వం చందోబద్ధ రచన అనేది గమనించాల్సింది. John Stuart Mill : “what is poetry but the thought and words in which emotion spontaneously embodies itself” అన్నాడు. కవిత్వమంటే భావావేశం . రసభావాలు తమంత తాముగా తాల్చే సహజ శబ్దార్ధాలస్వరూపమే కవిత్వం అంటాడు. ఇది విశ్వనాధుని వాక్యం రసాత్మకం కావ్యం అనేదానికి దగ్గరగా ఉంది. Carlyle : “Poetry is antithesis of Science, having for it’s immediate object pleasure , not truth.” అన్నాడు.కవిత్వం అనేది శాస్త్రానికి విరుద్ధం. దాని అవ్యవహిత ప్రయోజనం ఆనందమేకానీ సత్యం కాదు అని అతడు చెప్పాడు. Shelly : “Poetry in a general sense may be defined as expression of imagination” అన్నాడు.భావవ్యక్తీకరణమే కవిత్వం అని షెల్లీ చెప్పాడు. Hazlitt కూడాషెల్లీ వలెనె చెప్పాడు.

అంటే రమణీయములైన శబ్దార్ధములతో రసవంతంగా ధ్వనియుక్తంగా ఆహ్లాదకరంగా చెప్పిన పదసముదాయమే కవిత్వమని అర్ధమౌతోంది. అది ఎలా ఉండాలో ఆంగ్లకావ్య విమర్శకులు కూడా వివరించారు. Longinus అనేవాడు : “True sublimity in writing elevates the reader and evokes a sense of awe rather than merely pervading or pleasing theme. Both nature and art contribute to sublimity in Literature. Great writings does not persuade. It takes the reader out of himself.

Words worth : “Poetry is the breath and finer spirit of all knowledge.”
“ Spontaneous overflow of powerful feelings” అంటే రచనలోని ఉదాత్తత

పాఠకునిలో ఆనందాన్ని హెచ్చింపజేస్తుంది. ప్రకృతి,కళ రెండూ సాహిత్యంలో ఆనందాన్ని ఉద్దీపింప జేస్తాయి. గొప్పరచనలు వ్యాఖ్యానంతో పనిలేకుండా పాఠకులను ఆహ్లాదపరుస్తాయి. అని లాంగినస్ చెప్పాడు. కవిత్వం అనేది విజ్ఞానశ్వాస అని వర్డ్స్ వర్త్ చెప్తాడు.

The poets are unacknowledged legislators of the world. The purpose of a poem is to teach and delight. కవులు ప్రతిఫలం ఆశించని భాశాప్రతినిధులు అని వారంతా చెబుతున్నారు. మొత్తం మీద అందరిదృష్టిలోను రసభావ, భావాత్మకమగు రచన కవిత్వం అని దాని ప్రధాన ప్రయోజనం అందం అయినా అది బుద్ధివికాసాన్నికుడా కలిగించాలని చెప్పినట్లు సారాంశంగా మనం తీసుకోవాలి.

అయితే కవిత్వానికి ఛందస్సు అవసరమా? అనే అంశాన్నిమన ఆలంకారికులు ఎన్నడూ చర్చించలేదు. రమణీయార్ధప్రతిపాదకాలైన శబ్దాలతో కూడింది కావ్యం అన్నారు.అయితే ఈ రమణీయార్ధం ఎలా వస్తుంది? అంటే పలువురు పలురకాల అభిప్రాయాలు చెప్పారు. లోకవ్యవహారం లో కవిత్వం అనగానే ఛందో బద్ధమైన రచన అనే అభిప్రాయం రూఢిగా ఉంది. జాన్ సన్, కార్లయిల్ వంటివాళ్ళు  కూడా ఇదే చెప్పారు. ఛందస్సులో గీతి ఉన్నదికనుక కవిత్వం చందోమయమైనదని అందరు అంగీకరించారు. ఆధునికులలో ప్రామాణిక విమర్శకుడు Prof. Courthope ఛందోమయ భాషలో భావనకు, వేదనకు, ఆలోచనకు తగిన వ్యక్తీకరణ ఉండటం వలన ఆనందాన్ని పుట్టించగలుగుతుంది అని చెప్పాడు. కానీ ఛందో నియమాన్ని అంగీకరించనివాళ్ళు కూడా ఎక్కువమందే ఉన్నారు. Aristotle, Sir Philip Sidney ఛందో విషయాన్ని అంగీకరించలేదు. ఈ పరిస్థితులలో కవిత్వం అంటే ఏమిటనే వాదానికి మూలసూత్రం లయాత్మక జీవం. శృతిలయలను గ్రహించేది శ్రవణేంద్రియం. దానిద్వారా మనస్సునకు ఆహ్లాదాన్నిచ్చేది ఛందస్సు. ఈ విషయం లో MathewArnold:Therhythm and measure of poetry elevated to a regularity, certainty, and force గద్యములందు లేని నియతత్త్వము, నిశ్చితత్త్వము, శక్తిమత్వము శృతి లయల వలన సమకురుతున్నాయి అన్నాడు. కవిత్వానికీ, ఛందస్సుకు సహజ సంబంధం ఉందని John Stuart Mill చెప్పాడు. మన వాల్మీకినోట తొలిగా వెలువడిన మానిషాద శ్లోకాన్ని విని  ఆయన శిష్యుడు భరద్వాజుడు సహచరులతో ఇలా అన్నాట్ట:

“ పాదబద్దోక్షర సమః తంత్రీలయ సమన్వితః
శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా”

అలాగే ఋక్కులన్నీ  మంత్రద్రష్టల నోట ఛందో బద్ధంగానే వెలువడినవి.
ఇవీ పూర్వపు లాక్షణికులు ప్రతిపాదించిన కవిత్వపు సూత్రాలు. ఆధునికులలో కూడా కొందరు కవిత్వాన్ని గురించి, కావ్యాన్ని గురించీ చెప్పారు.

“ఎప్పుడో పాతిక శతాబ్దాల క్రింద ఏర్పడ్డ లక్షణశాస్త్రాలు వ్యాకరణ శాస్త్రాలు విధించిన కట్టుబాట్లను, ధర్మశాస్త్రాలు,సంఘశాస్త్రాలు నియమించిన నిబంధనలను, కులాలు, మతాలు, వ్యక్తులు ఇత్యాదులలోగల భేదభావాలున్ను మన అభ్యున్నతికి అడ్డుపడుతుంటే వాటిని తోసివేస్తున్నాము” అని 1930 లో శ్రీ పంచాజ్ఞుల ఆదినారాయణ శాస్త్రిగారు చెప్పారు. అప్పటికే సమాజంలో సంఘ సంస్కరణోద్యమం, ఆంగ్లవిద్యావ్యాప్తి, పత్రికలవ్యాప్తి, వ్యావహారికభాషోద్యమం, స్వదేశీయోద్యమం, ఉవ్వెత్తున దేశంలో అలజడులు సృష్టించాయి. అప్పటికి తెలుగుకవితాశారద పొందిన ప్రసవవేదనలఫలితంగా రాయప్రోలు, గురజాడల ఖండకావ్యాలు, గేయాలు, అవతరించాయి. 1914 లోనే ఆంధ్రపత్రిక సంపాదకీయంలో “ భాషాభిమానం ప్రబలుచున్నది. భాషాభివృద్ధి కనుకూలమైన ప్రయత్నములు చేయబడుచున్నవి. నూతనభావములు వికసించుచున్నవి. నూతనభావపూరితములైన కథలు, గీతములు రచింపబడుచున్నవి.నూతనశైలి సంక్షిప్తము. నూతనభావములు గంభీరములు. నూతన సంప్రదాయములు అపరిచితములు. నూతనాదర్శములు సదాశాభరితములు.శైలియు, భావములును సంప్రదాయమను విపరీతాభిప్రాయమును కలిగించుట సహజము. కాలక్రమమున ఇవి పరిపాటియై భాషకు నూతనాలంకారములు సమకూర్చగలవు.” అని వ్రాయటం గమనించతగినది.

ఆ రోజుల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ, నాయని సుబ్బారావు మొ. లైనవాళ్లు ఆత్మాశ్రయతత్త్వంతో భావకవిత్వాన్ని ప్రాంభించారు. అప్పట్లో ఆధునిక కవిత్వాన్ని నవ్యకవిత్వం అని నోరి నరసింహశాస్త్రిగారు పేర్కొన్నారు.

నవ్యకవిత్వంలో “ఖండకావ్యప్రక్రియ” ప్రథమగణ్యమైనది. పాశ్చాత్యవిజ్ఞానఫలితంగా, కవులను ఆదరించే మహారాజులు లేనిలోటును తీర్చేదిగా ఈ ప్రక్రియ అవతరించింది. ప్రజల జీవనవిధానంలో వేగం పెరిగింది. సుదీర్ఘకావ్యాలను చదివే తీరిక, ఓపిక, ప్రజలకు లోపించింది. దీనికితోడు ఆంగ్లసాహిత్యంలోని ఖండకావ్యాలతో తెలుగువారికి పరిచయం కలిగింది. ఇంగ్లీషు కవిత్వప్రభావంతో తెలుగులో ఖండకావ్యాలు ఆవిర్భవించాయి. భామహుడు చెప్పిన అనిబద్ధ కావ్య మైన ముక్తకము ఇలా ఖండకావ్యంగా అవతరించింది.

కవి వ్యక్తీకరణము వస్త్వాశ్రయంగా ఉండటం మనకావ్యాల్లో కనిపిస్తుంది. కానీ అది ఆత్మాశ్రయంగా ఉండటం అనేది ఆంగ్లభాషా ప్రభావంతో సంక్రమించినదే. కవిత్వానికి వస్తు, భావ, రచనలు అనే మూడు వస్తువులు కావాలి. వీటిలో భావం ప్రధానమైనది.అనవసరమైన శబ్ద పటాటోపము తగ్గిపోయి

నది. జటిల సమాసములు, సంస్కృతపదబంధాలు వెనుకబడినై. రాయప్రోలు, గురజాడ, కృష్ణశాస్త్రి, నాయని, బసవరాజు వంటి కవుల రచనలు ప్రజలకు అందుబాటులో నిలచాయి. సహజసిద్ధమైన నవ్యశైలి అందుబాటులోకి వచ్చింది. వీరు వ్యవహారంలో లేని పదాలను ప్రయోగించక నవ్యతను చూపారు. పాదపూరణకై వాడే పదాలను విడిచిపెట్టారు. ఎన్నెన్నో శిష్టవ్యావహారికపదాలను ముత్యాలసరాలలో, యెంకిపాటల్లో ప్రయోగించారు. క్రమంగా మార్గకవితాఛాయలనుండి దేశికవితా విధానంలోకి ఆధునిక కవిత్వం ప్రయాణించింది. ప్రక్రియాబాహుళ్యంతో విస్తరించింది. ప్రకృతి కవిత్వం, దేశభక్తి కవిత్వం, భక్తికవిత్వం, సంస్కరణ కవిత్వం, కథాకవిత్వం, స్మృతిగీతాలు, బాల గేయాలు,ఇలా అనేకరకాలుగా కవిత్వం విస్తరించింది.

ఫ్రాన్స్, జర్మనీ దేశాలలో రూసో ప్రభావంతో మానవతావాదం ,స్వాభావికతా పునరుద్ధరణ వాదాలు, ప్రణయతత్త్వం గొప్ప మార్పు తెచ్చాయి. ఈ ప్రభావం క్రమంగా ఆంగ్లసాహిత్యంపై ప్రభావం చూపింది.  ఆంగ్లసాహిత్యంలోని కాల్పనికోద్యమ ప్రభావం తెలుగు కవిత్వం మీద బాగాప్రసరించింది. ఆలోచన, ప్రణయతత్వం, ప్రకృతిపరిశీలన, స్వేచ్ఛాతత్వం, మానవతావాదం, హేతువాదాలకు ఇది ప్రాధాన్యత నిచ్చింది. రాయప్రోలు, అబ్బూరి, కృష్ణశాస్త్రి,బసవరాజు, కవికొండల, శ్రీశ్రీ వంటి కవులు అద్భుత గేయాలు వ్రాశారు. ఆంగ్లవిద్యనభ్యసించినవారు వర్డ్స్ వర్త్, షెల్లీ, కీట్స్,వంటివారి ప్రేమగీతాలు చదివి వాటిప్రభావంతో తెలుగులో కవితలు వ్రాశారు. ఆ రోజుల్లో భావకవిత్వం ఒక ఉద్యమంగాసాగింది.హృదయేశ్వరి,సౌభద్రునిప్రణయయాత్ర,వత్సల(నాయని),ఊర్వశి(దేవులపల్లి), శశికళ(బాపిరాజు),కిన్నెర(విశ్వనాథ),యెంకి(నాయని),వంటివి భావకవిత్వాన్ని శిఖరాయమానం చేశాయి.

భారత జాతీయోద్యమ ప్రభావంతో చిలకమర్తివారి “భరతఖండంబు చక్కని పాడియావు…” చెరసాలల్ పృథుచంద్రశాలలెయగున్… వంటి పద్యాలు, రాయప్రోల వారి “ ఏదేశమేగినా -ఎండు కాలిడినా వంటి పద్యాలు, బసవరాజు అప్పారావుగారి –“కొల్లాయిగట్టితేనేమి-మాగాంధి కోమటై పుట్టితేనేమి” వంటి గేయాలు, గరిమెళ్ళ సత్యనారాయణగారి మాకొద్దీ తెల్లదొరతనము.. వంటి పాటలు,దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి రాంభజన పాటలు, దుర్భాకరాజశేఖర శతావధానిగారి రాణాప్రతాపసింహ చరిత్ర కావ్యం,గడియారం వెంకట శేషశాస్త్రిగారి శివభారతం,   దువ్వూరి, కొడాలి(హంపీక్షేత్రం),పుట్టపర్తివారి పెనుగొందలక్ష్మి కావ్యం,  జాషువా, తుమ్మల, వేదుల, మున్నగు

వారు ఆంధ్రాభిమానాన్ని వ్యక్తం చేస్తూ రాసిన పద్యాలు గొప్ప దేశాభిమానాన్ని చాటాయి. ముట్నూరి కృష్ణారావుగారి కృష్ణాపత్రిక, నాగేశ్వరరావుగారి ఆంధ్రపత్రికలు  ఆంధ్రత్వాన్ని ప్రోదిచేశాయి..
వెంకటపార్వతీశ్వరకవులకావ్యకుసుమావళిలోను,దువ్వూరివారిగరిక, వానాకాలపు వరిచేలు: ఖండకావ్యాలు, పింగళి-కాటూరి వారి తొలకరి,పౌలస్త్యహృదయం, కృష్ణశాస్త్రిగారి కృష్ణపక్షం, వంటి కావ్యాల్లో ప్రకృతివర్ణనలు ఉద్యమంగాసాగాయి.
సంఘసంస్కరణకవిత్వంలోదురాచార నిరసనం, వర్ణవ్యవస్థా నిరసనం, చోటుచేసుకొన్నాయి.

కృష్ణశాస్త్రి, బసవరాజుఅప్పారావు మధురభక్తిగీతాలను వ్రాశారు. వెంకటపార్వతీశ్వరుల ఏకాంతసేవ  కరుణశ్రీగారి కరుణామయి,దువ్వూరి రామిరెడ్డిగారి కవికోకిల గ్రంథావళి, భక్తిగీతాలకు, తాత్విక చింతనకు చోటిచ్చాయి.

భావకవిత్వం ప్రధానంగా శైలీసౌకుమార్యాన్ని సంతరించుకుని లలితమధురపదవిన్యాసంతో సహజత్వాన్ని సంపాదించుకొంది.కృష్ణశాస్త్రిగారి “నునుమబ్బు లేదున్క కొనలపై సోనలౌ నెలవంక చిరునవ్వు చలువపాట” వంటిపద్యాలు అపూర్వమైన ఆనందాన్నిస్తాయి. అపూర్వపదబంధాలను సృష్టించటంలో భావకవులు కొత్తదనాన్ని సాధించారు. పూర్వకవులు వాడిన పాదపూరణపదాలు “నావుడు, వెండియు, కొనకొని, మానుగ” వంటివాటిని దూరం పెట్టారు. “నీలంపుసిగ్గు, దరహాసకౌముది, కొసరుతేనియలు, నిదురచెర,ముదుసలి నిరాశలు,తీయతేనియబరువు” వంటి ప్రయోగాలు రసానందాన్నిస్తాయి. గద్యపద్యాలస్థానంలో పద్యగేయసమ్మేళనం వాడుకలోకి వచ్చింది. కొందరు వచనగేయాలను వాడుకలోకి తెచ్చారు. ఖండగతిలో మాత్రాసంఖ్యాకంగా చాలామంది కవులు తమ రచనలను చేశారు. కిన్నెరసానిపాటలు, ముత్యాలసరాలు, తల్లావజ్ఝలవారి వకుళమాలిక,రాయప్రోలు, కృష్ణశాస్త్రి, కవికొండల, దువ్వూరి,వంటికవులు మాత్రాఛందస్సులను ప్ప్రయోగించారు. వీరి రచనల్లో ఆధునికతకు కొదువలేదు.కవికొండల రాసిన “నక్కాసామిగాడు”అనే వచనగేయంలో :

“నక్కాసామిగాడు
వాడొకమాలవాడు
రాజుగారి కవతంలో
పాలేరువాడు
దెందులూరు కాడాక్కుండా వెళ్ళిన మెయిల్నీ
ఆగిన మాప్యాసెంజరు రయిల్నీ
రెంటినీకూడామఱచి
ఆ కథలో లీనమైపోయినాం
ఆ కబుర్లలో కలసిపోయినాం
ఆ కాడే ఉండిపోయినాం …”

ఈ రకంగా సాగింది ఆ కవిత. ఇదంతా శుద్ధవ్యావహారికంలో సాగటం,అంత్యనియమం ఉండటం, పాదవిభాగం ఆధునిక వచనగేయాల్లా ఉండటం ఇందులోని ప్రత్యేకత.

భావకవిత్వంపై తిరుగుబాటు చేసింది అభ్యుదయకవిత్వోద్యమం.1930-40 ల మద్య శ్రీశ్రీ , శిష్ట్లా,నారాయణబాబు, పఠాభి వంటి అతినవ్యకవులు భావకవిత్వంపై తిరుగుబాటు చేశారు. ఈ నలుగురు పాశ్చాత్యులప్రభావంతో నాలుగుత్రోవలు తొక్కారు. శ్రీశ్రీ రానురాను అభ్యుదయకవిత్వానికి అధివాస్తవిక కవిత్వానికి ప్రయోక్త అయ్యాడు. ఛందస్సును శిష్ట్లా వికృతం చేశాడు. వచనగేయ రచన కు శ్రీశ్రీ కి శిష్ట్లా గురువయ్యాడు. పురాణపాత్రలనుతీసుకొని కొత్తభావాలను వెల్లడించాడు. “నా యీ వచనపద్యాలనే దుడ్డుకర్రల్తో పద్యాలనడుముల్ విరగదంతాను-చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను … కానీ భావకవిన్ మాత్రము కాన్నేనహంభావ కవిని” అని పఠాభి ఫిడేల్ రాగాల డజన్ లో చెప్పుకొన్నాడు. “పగిలిన ఖలేజాలే నా పాటల జలేజాలు” అని నారాయణబాబు పేర్కొన్నాడు. ఇంకా ముద్దుకృష్ణ ప్రభావం శ్రీశ్రీపై అధికంగా ఉంది. శ్రీశ్రీ మహాప్రస్థానం మార్క్సిస్ట్ దృక్పధానికి నిదర్శనం. అభ్యుదయ కవిత్వం పూర్తిగా భౌతికవాద పునాదులపై నిర్మించబడింది. ఇందులో ఆముష్మిక చింతనకు చోటులేదు. ఇది కర్మసిద్ధాంతాన్ని నమ్మదు. విధిని ఇది పూజించదు. వ్యక్తీ మంచిచెడ్డలకు అతడే బాధ్యుడు. ఈ వాదం శ్రామికులను ఆకర్షించింది. మార్పు, వృద్ధి అనేవి వీరి లక్ష్యాలు. శ్రీశ్రీ బాటలో దాశరధి,సోమసుందర్,ఆత్రేయ,నారపరెడ్డి, రెంటాల,గంగినేని, రమణా రెడ్డి, కుందుర్తి,పుట్టపర్తి, నారాయణ రెడ్డి,అబ్బూరి, ఆరుద్ర,కాళోజీ వంటివారు అభ్యుదయ కవితల్ని వ్రాసారు. అనంతరం అధివాస్తవికదోరణులు ప్రబలాయి: శ్రీశ్రీ వ్రాసిన :

“పులికిపిలకలేదనటం -చలికి తెలుగు రాదనటం

-శ్రీనివాసరావ్ రాస్తున్నదిమానిషాదగీతంలో ఉన్నది” ఇలా కవిత్వస్తాయి దిగజారిపోయింది.

“సిరిసిరిమువ్వా” అనే శతకంలో శ్రీశ్రీ :తెగకుట్టి వదలిపెట్టినవగణిత వైజాగుదోమలశ్వత్తామన్ పొగ రెక్కినరెక్కేన్గులుచిగురించినతుమ్మముళ్ళుసిరిసిరిమువ్వా”అంటూ వ్రాసిన సంప్రదాయకవితలుకూడా స్మరించాలి.

ఆరుద్ర త్వమేవాహం లో ఇలా చెప్పాడు :“మంచిరచన చదివాక బాగా భోంచేసినట్టుండాలి-కొంచెం బాధపడాలి:చించు కొన్నట్టుండాలి-మనస్సుకి జ్వరం రావాలి. ఒళ్ళు తిరగాలిఈబాధలోంచి తేరుకొని బాగుపడాలి” అంటాడు. నయాగరా కవులు ముఖ్యంగా కుందుర్తి ఫ్రీ వెర్స్ ఫ్రంట్ వచనకవితలకు పతాకను ఎగురవేసింది.

ఆధునికులు కవిత్వానికి ఒక స్ఫూర్తివంతమైన నిర్వచనాన్నిచ్చారు. నిగూఢతకలిగి ఉండటం, సాధారణ వాక్యానికంటే భిన్నంగా చెప్పటం, ఆలోచింపజేసేవిధంగా చెప్పటం, మనస్సును రంజింపజేయటం అనే వాటిని ఆధునిక కవిత్వంగా చెప్పారు. కవిత్వాన్ని ఒక సృజనాత్మక ప్రక్రియగా పేర్కొన్నారు. అయితే ఇది కొత్త విషయం కాదు. అలాగే కవిత ఒక నిరంతర సాధన అన్నారు. ఇది అంగీకరించాల్సిన విషయం కాదు. భావం కదిలించినప్పుడు కవి రచనకు పూనుకొంటాడు. ఆరుద్ర చెప్పినట్టు అదేదోపూనుతుంది. ఆపూనిక బలాన్నిబట్టి వ్రాయటం జరుగుతుంది. అది కవి అనుభవాన్ని బట్టి ఉంటుంది. కుందుర్తి ఒకచోట చెబుతాడు: కవిత్వం అంటే అక్షరహింస కాదు అని. దానికి అర్ధమేమిటో అతడే చెప్పాలి. బహుశా  సుదీర్ఘసమాసాలను ఉద్దేశించి అనుకొంటే అది నిర్ద్వంద్వంగా తప్పే. ఏ కవీకూడా కావాలని సుదీర్ఘసమాసాలను కల్పించడు. ఒకవేళ కల్పిస్తే పాఠకునికి పట్టుబడిపోతాడు. అనవసర వర్ణనలు, అనవసర సమాసాలు పాఠకులు అంగీకరించరు. కవిత్వం అంటే అక్షరతాండవం అనిచెప్పారు. నిజమే. అక్షరాలు తాండవించకపోతే శబ్దాలు ఎలా రూపొందు తాయి? అంటే ఇలా అనటానికి అర్ధమేమిటంటే John Stuart Mill , William wordsworth లు చెప్పినట్లు బలమైన భావనాస్ఫూర్తి ఉండాలన్నమాట. అది మంచిదే. అటువంటి భావనాబలం లేకపోతే  కవిత్వం నీరసంగా ఉంటుంది. ఒక విమర్శకుడు చెప్పినట్టు మామిడి పండును నోటితో తింటే తిన్నవాడికి దాని రుచి తెలుస్తుంది. అలాగే కవిత్వం విన్నవాడికి దాని రుచితెలుస్తుంది. ఇదీ కవిత్వం అంటే అని ఎన్నిరకాలుగా వర్ణించినా ఉత్తుత్త పదాలతో కవిత్వాన్ని వర్ణించలేము. కానీ పద్యం కానీ, వచనం కానీ మరొక హైకూ , కైకూ, నానీ, బోణీ ఎదైనాకూడా రసవత్తరం కాకపొతే ఎవరూ దానిని వినరు మళ్ళీ తలవరు. అంటే ఎప్పుడో మన పూర్వ ఆలంకారికులు చెప్పిన నిర్వచనం వాక్యం రసాత్మకం కావ్యం అనేది మల్లీమల్లీ రుజువవుతోంది. కవిత్వం అనేది పద్యంలో చెప్పినా, వచనంలో చెప్పినా అది ఆకర్షణీయంగా ఉండాలి. చమత్కారభరితంగా ఉండాలి. వేశ్య  పక్కన పడుకున్న తెనాలి రామకృష్ణుడు “ గంగకద్దరి మే లిద్దరి కీడునున్ గలదె ఉద్యద్రాజ బింబాననా” అంటే అందులో ఎంత ధ్వని ఉందొ చూడండి. నిజానికి గంగకు ఎ తీరమైనా ఒకటే . కవి వేశ్యను “అవ్వలిమొగంబైనంత

ఏమాయె?” అంటాడు. ఈ మాటలు రామకృష్ణుడు అన్నాడో లేదో వదిలేస్తే ఇందులో ఉన్న ధ్వని ఎంత బలంగా ఉందొ గమనించవచ్చు. కనుకనే ఈ పదం ఇన్ని వందలఏళ్ళుగా ప్రజల నాలుకలపై ఉంది. ఇలాంటివి ఎన్ని? అంటే కవిత్వం అంటే మన అనుభూతులు మనవి మాత్రమె అయితే ఎవడూ పట్టించుకోడు. పీత కష్టాలు పీతవి అయితే నాకెందుకు? అంటాడు. అవి సార్వజనీనాలు కావాలి. అలాగే సార్వకాలికం కావాలి. ప్రకృతి సౌందర్యం గురించి చెప్తారు. అందరూ అంగీకరిస్తారు. తన ఆకలిబాధను ఆక్రోశంతో వర్ణిస్తారు. అది ఎవరికి  కావాలి? అభ్యుదయకవిత్వం పేరుకే వర్ధిల్లింది. ఇప్పుడు కనిపించట్లేదు. దిగంబరకవులు ఏమయ్యారో తెలీదు. చివరకు కవిత్వం వ్రాయటానికి రూపం లేదు. వస్తువు లేదు. అవసరం లేదు. ఉన్న పరిస్థితుల్ని వినియోగించుకొనే తెలివి కవులకు లేకపోతోంది. కానీ బహుమానాల కవితలు, నజరానాల కవితలు కాలక్షేపానికి వస్తున్నట్లుంది . కనుకనే మళ్ళీ పద్యకవితవైపు ప్రజలు దృష్టిని సారిస్తున్నారు. భావాలు ఎలా ఉన్నా ఛందస్సునుబట్టి లయాత్మకంగా ఉంటాయి కనుక ఆదరిస్తున్నారు. మరోవంక మన పూర్వసాహిత్యమంతా పద్యరూపమేకనుక“పద్యాలనడుముల్ విరగదంతాను” అన్నవాళ్లు నడుములు విరిగి పారిపోయారు. “ఎవడురా పద్యమ్ము పాతిపెట్టెడివాడు”అని పద్యకవులు జూలు విదల్చిన రోజులొచ్చాయి.

మొత్తం మీద కవిత్వం అంటే వినసొంపైనది, చమత్కారవంతమైనది, ఆలోచింపజేసేది, మంచి త్రోవ చూపేది, నీతిని బోధించేది, పదికాలాలపాటు నిలబడ గలిగినది, పదిమంది ఆదరించేది ప్రజలంతా ఇలాంటిది కావాలని కోరుకొనేది కవిత్వం. కవిత్వం ప్రజలకోసం వ్రాయాలికానీ తనకోసం కాదు. కవి అంటే – “ అతడు స్రష్ట. అతడు ద్రష్ట. సృష్టి కతడు పరాకాష్ట. సృష్టికి ప్రతిసృష్టి చేయగల వాడు కవిఅంటే! నీచ మనస్కతతో దుష్టబుద్ధులతో కవిత్వం చెప్పేవానివలన సమాజం నాశన మౌతుంది. కవిత్వం కాళిదాసుకవితలా, వాల్మీకిసృజనలా వ్యాసమహర్షి రచనలా ధర్మ  ప్రతిపాదకమై ఉండాలి. ఉదాత్తతతో నిండిఉండాలి. సరైనవ్యక్తిత్వంలేనివారి రచనలు సమాజానికి హానికరం. మనం అలాంటి రచయితల్ని, రచనల్ని చాలాచూశాము. అసలు సాహిత్యంఅంటేనే హితవుతో కూడినది అని అర్ధం. స హితం సాహిత్యం. దీన్ని అర్ధం చేసుకొని సామాజిక బాధ్యతతో రచనలు చేయాలి.

“గురువు లఘువుజేసి కుంచించి కుంచించి-లఘువు గురువుజేసి లాగిలాగి
కవితజెప్పునట్టి కవిగులామునుబట్టి ముక్కుకోయవలయు తొక్కిపట్టి” అని చెప్పారు.

అంటే కవిత్వం చెప్పటం చేతకాని కుకవులను గౌరవించ కూడదు అని చెప్పారు. ***

Scroll to Top